నాడు హత్యలకు అడ్డా.. నేడు అత్యంత సురక్షిత ప్రాంతం!
ఎల్ సాల్వడార్.. మధ్య అమెరికాలోని అత్యంత చిన్నదైన, అత్యధిక జనాభా కలిగిన దేశం. ఒకప్పుడు నేరాలు, అవినీతి, హత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ దేశం రూపురేఖలు ఇప్పుడు సమూలంగా మారిపోయాయి. అధ్యక్షుడు నయూబ్ బకెలే దేశ అధికార పగ్గాలు చేపట్టడంతో దేశంలో నేరాలు, హత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది.
‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు
ఇటీవల జరిగిన ఎల్ సాల్వడార్ ఎన్నికల్లో నయీబ్ బుకెలే ఘనవిజయం సాధించి, అధ్యక్షపీఠం అధిరోహించారు. దేశంలో అంతకంతకూ దిగజారుతున్న ప్రజాస్వామ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వీటిని నయూబ్ బుకెలే చక్కదిద్దుతారన్న నమ్మకంతో ఓటర్లు ఆయన పార్టీకి పట్టం కట్టారు. నయీబ్ బుకెలే దేశంలో పెరుగుతున్న హత్యల నియంత్రణకు తీసుకున్న కఠిన చర్యలపై ఎల్ సాల్వడార్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని కార్మికులైతే ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు. నయీబ్ బుకెలే ఇప్పుడు ప్రపంచవ్యాపంగా ‘కూల్ డిక్టేటర్’గా గుర్తింపు పొందారు.
గణనీయంగా తగ్గిన భద్రతా ముప్పు
ఒక నివేదిక ప్రకారం నయీబ్ బుకెలే 2019లో తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎల్ సాల్వడార్లో శాంతిభద్రతల పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఫలితంగా దేశంలో భద్రతా ముప్పు గణనీయంగా తగ్గింది. తాజాగా 2024 అధ్యక్ష ఎన్నికల్లోనూ ఆయనే గెలవడంతో అతని ‘న్యూ ఐడియాస్ పార్టీ’ కార్యకర్తలు విజయోత్సాహంతో ర్యాలీలు చేపట్టారు. లెక్కలేనంతమంది బుకెలే అభిమానులు సాల్వడార్‌లోని సెంట్రల్ స్క్వేర్‌లో సమావేశమై, ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నీలి రంగు దుస్తులు ధరించి ఆనందంగా జెండాలు రెపరెపలాడించారు.
‘న్యూ ఐడియాస్ పార్టీ’ పాలన
42 ఏళ్ల అధ్యక్షుడు నయీబ్ బుకెలే తాను మరోమారు సాధించిన ఈ విజయాన్ని తన పరిపాలనకు ఇదొక ‘రిఫరెండం’గా అభివర్ణించారు. దేశ శాసనసభలో మొత్తం 60 స్థానాలను గెలుచుకున్న బుకెలేకి చెందిన ‘న్యూ ఐడియాస్ పార్టీ’ దేశాన్ని మరోమారు పాలించనుంది. ఈ ఎన్నికల తర్వాత దేశంలో బుకెలే ప్రభావం మరింతగా పెరిగింది. సాల్వడార్ చరిత్రలో బుకెలే అత్యంత ప్రభావవంతమైన నాయకునిగా ఎదిగారని విశ్లేషకులు చెబుతుంటారు.
అసురక్షితం నుంచి సురక్షితానికి..
అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన నేపధ్యంలో నయీబ్ బుకెలే తన భార్యతో కలిసి నేషనల్ ప్యాలెస్ బాల్కనీ నుండి మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అందరూ కలిసి ప్రతిపక్షాన్ని కూల్చివేశారు. ఎల్ సాల్వడార్ అత్యంత అసురక్షిత దేశం అనే పేరు నుంచి అత్యంత సురక్షితమైన దేశమనే దిశకు చేరుకుంది. రాబోయే ఐదేళ్లలో మనం చాలా చేయాల్సివుంది’ అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నారు.
ఒకే వారంలో 80 మంది హత్య
ఒక నివేదిక ప్రకారం బుకెలే దేశ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎల్ సాల్వడార్లో హత్యల రేటు గణనీయంగా తగ్గింది. ‘మారా సాల్వత్రుచా గ్యాంగ్’ (ఎంఎస్-13)సభ్యులు దేశంలో పెద్ద సంఖ్యలో హత్యలు సాగిస్తూ వచ్చారు. 2022 మార్చి లో ఒకే వారంలో వీరు 80 మందిని హత్య చేశారు. బుకెలే ప్రభుత్వం నేరస్తుల ముఠాతో సంబంధం ఉన్న 75 వేల మందిని అరెస్టు చేసింది.
El Salvador's President Nayib Bukele, who has described himself as the 'World's coolest dictator,' is all but certain to be re-elected in a presidential bid for another five-year term https://t.co/t7X5vV5VLq pic.twitter.com/1LmIt9aaVV
— Reuters (@Reuters) January 30, 2024
70 శాతం మేరకు తగ్గిన హత్యల రేటు
పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగిన తర్వాత ఎల్ సాల్వడార్‌లోని క్రిమినల్ ముఠాల వెన్ను విరిగినట్లయ్యింది. ఈ చర్య ఫలితంగా 2022లో హత్యలు దాదాపు 60 శాతం మేరకు తగ్గాయి. అయితే 2023 నాటికి దేశంలో అత్యధిక ఖైదు రేటు నమోదు కావడంతో ఇది మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలకు దారితీసింది. భద్రతా దళాల చర్యల అనంతరం 2023లో ఎల్ సాల్వడార్లో హత్యల రేటు 70 శాతం మేరకు తగ్గి, అది ఒక లక్షకు 2.4 శాతానికి చేరింది. ఈ సంఖ్య లాటిన్ అమెరికాలోని చాలా దేశాల కంటే అతి స్వల్పం
నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాటం
2019లో ఎల్ సాల్వడార్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సొంతం చేసుకున్న బుకెలే దేశంలో చోటుచేసుకున్న నేరాలు, అవినీతి, అసమానతలతో పోరాడతానని వాగ్దానం చేశారు. తన మద్దతుదారులతో మెరుగ్గా కమ్యూనికేట్ చేయడానికి, విమర్శకులను ట్రోల్ చేయడానికి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను సమర్థవంగంగా ఉపయోగించుకున్నారు. బుకెల్ తరచూ బేస్ బాల్ క్యాప్, లెదర్ జాకెట్, సన్ గ్లాసెస్ ధరిస్తారు. సెల్ఫీలు, మీమ్లను అమితంగా ఇష్టపడతారు.
President Bukele takes a victory lap after El Salvador becomes the safest nation in the Western hemisphere
He then tells foreign critics to go stuff it
pic.twitter.com/iBNEPooXcP
— Jack-of-all-trades (@Upliftingvision) February 13, 2024