13 శాతం పెరిగిన టెల్కోల ఆదాయం
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం సేవల రంగ సంస్థల స్థూల ఆదాయం 13 శాతం జంప్ చేసింది. జూన్ 2016 తో ముగిసిన త్రైమాసికంలో గ్రాస్ రెవెన్యూ (జీఆర్) రూ 73,344 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. అలాగే సర్దుబాటు చేసిన నికర రాబడి (ఎడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ ఏజీఆర్) 9.2శాతం వృద్ధితో రూ. 53,383 కోట్లుగా ఉంది. ఈ వివరాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) త్రైమాసికపు పనితీరు సూచీ నివేదికలో తెలిపింది.గత ఏడాది జీఆర్ 12.79శాతం వృద్ధితో రూ.65,030కోట్ల ఆదాయాన్ని ఏజీఆర్13.26శాతం వృద్ధితో రూ.47,134 కోట్లను ఆర్జించినట్టు రిపోర్ట్ చేసింది. రోమింగ్ ఆదాయం, ఇంటర్ కనెక్ట్ చార్జీలతో కలిపి ఈ ఆదాయాన్ని ఆర్జించినట్టు తెలిపింది.
అలాగే ఫీజు మరియు స్పెక్ట్రమ్ వాడుక ఛార్జీలు (ఎస్ యూసీ) వరుసగా 14 శాతం 12 శాతం పెరిగాయి. దీంతో టెలికాం ఆపరేటర్లు ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజు ఏప్రిల్-జూన్ నాటికి రూ 4,314 కోట్లకు పెరిగింది. జీఆర్ మరియు ఏజీఆర్ (టెలికాం సేవల ద్వారా ఆదాయం మాత్రమే) అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే... ఈ త్రైమాసికంలో వరుసగా 7.33శాతం,10.34శాతం పెరిగింది .ఏజీ ఆర్ ఆధారంగా టెలికాం సేవలకు యూజర్ (ఏఆర్పీయూ) ప్రకారం నెలవారీ సగటు రాబడి త్రైమాసికంలో రూ 141 కోట్లుగా ఉంది. ఇది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ 127కోట్లుగా ఉంది.