ప్రొటోకాల్‌కు తిలోదకాలు
► నిబంధనలకు గవిరెడ్డి అతీతం!
► మాజీ ఎమ్మెల్యే అయినా నీరు-చెట్టు పనులు
► ప్రారంభించిన వైనం హాజరుకాని అధికార గణం
► పచ్చచొక్కాల తీరుపై ప్రజల ఆగ్రహం
దేవరాపల్లి: అధికార పార్టీ నాయకులు ప్రొటోకాల్ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నారు. అధికారిక కార్యక్రమాలను సైతం పార్టీ కార్యక్రమాలుగా మార్చేస్తున్నారు. పలుమార్లు నిబంధనలను అతిక్రమిస్తున్నా చర్యలు తీసుకుంటున్న దాఖలాలులేవు. చెరువు ల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు నీరు-చెట్టు కార్యక్ర మం పేరిట చెరువుల్లో పూడిక తీత పనులు చేపడుతున్నారు. అయితే అధికారిక కార్యక్రమమైన ఈ నీరు-చెట్టు కార్యక్రమాన్ని స్థానిక టీడీపీ నాయకు లు రాజ్యాం గానికి విరుద్ధంగా ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుకు ఎటువంటి హోదా లేనప్పటికీ పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని ప్రొటోకాల్‌కు తూట్లు పొడుస్తూ పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు.
ఇటీవల ముషిడిపల్లి గ్రామంలో అధికారిక కార్యక్రమైన ఎన్టీఆర్ గృహ కల్ప పథకం ప్రారంభోత్సవంలో పాల్గొనడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. వేచలం గ్రామంలో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా మహాపాత్రుని చెరువు పూడిక తీత పనులకు సుమారు రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఈ పనులను బుధవారం స్థానిక సర్పంచ్ వంటాకు సింహాద్రప్పడుతో కలిసి మాజీ ఎమ్మెల్యే ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తూ ప్రారంభించడంపై పలువురు గ్రామస్తులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలుగు తమ్ముళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికార గణం చూసి చూడనట్టు వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.