Neglected by authorities
-
అందని ‘అభయం’
పాల్వంచరూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోప్రవేశపెట్టిన అభయహస్తం పథకం ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ పథకం ద్వారా అందించే పింఛన్లు గత 11 నెలలుగా నిలిచిపోయాయి. జిల్లాలో అభయహస్తం లబ్ధిదారులు 8 వేల మంది ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జిల్లాలో నెలకు రూ.40 లక్షల పింఛన్లు చెల్లించాల్సి ఉంది. 2017 నవంబర్ వరకు తర్వాత ఇంతవరకు తమకు రూపాయి కూడా ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభయహస్తంతో ఎంతో ప్రయోజనం.. అభయహస్తం పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేంది. స్వయం సహాయక సంఘాల్లోని నిరుపేద మహిళలకు నెలకు రూ.500 వస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది. 18 నుంచి 59 సంవత్సరాల మహిళలు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు. వారు రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం ద్వారా మరో రూ. 365 జమ చేసి జనశ్రీ బీమా పథకంలో లబ్ధిదారులుగా చేరుస్తారు. ఆ తర్వాత 60 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 పింఛన్ చెల్లిస్తారు. అంతేకాక గ్రూపులోని మహిళలకు 9 నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలు ఉంటే ఏడాదికి రూ.1200 చొప్పున ఒక్కో కుటుంబంలో ఇద్దరికి ఉపకార వేతనాలు అందిస్తారు. సభ్యులు అకాల మరణం పొందితే కుటుంబసభ్యులకు బీమా కంపెనీ ద్వారా రూ.30 వేలు చెల్లిస్తారు. ప్రమాదంలో మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యం కలిగితే రూ.37, 500 చొప్పున పరిహారం చెల్లిస్తారు. అయితే ఇటీవల ఈ పరిహారాన్ని రెండు లక్షలకు పెంచారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన అభయహస్తం పింఛన్ డబ్బును వెంటనే ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 11 నెలలుగా ఇబ్బంది పడుతున్నాం అభయహస్తం పింఛన్ గత 11 నెలలుగా రావడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే రూ.500 అయినా నెలనెలా సక్రమంగా ఇవ్వాలి.లేకుంటే తమ జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. అసరా పింఛన్లోనైనా చేర్చి ప్రతినెలా పింఛన్ ఇస్తే బాగుటుంది. – నూనావత్ చాందిని, లబ్ధిదారురాలు వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పైనే ఆధారపడి వృద్ధాప్యాన్ని గడుపుతున్నాం. గత 11 నెలలుగా పింఛన్లు ఇవ్వకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పింఛన్ల కోసం సంబంధిత అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. నెలనెలా విధిగా పింఛన్ ఇవ్వాలి. – ధర్మసోతు మారు, లబ్ధిదారురాలు నిధులు విడుదల కాగానే పంపిణీ చేస్తాం అభయహస్తం పించన్లు గత 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మాట నిజమే. ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. మంజూరు కాగానే లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. – ప్రదీప్, అభయహస్తం పింఛన్ల జిల్లా ఇన్చార్జి -
రేషన్.. పరేషాన్ !
* అనుసంధానం కానీ ‘ఆధార్’ * కోటాలో కోత.. * తాజా దరఖాస్తులతో ఆందోళన బాన్సువాడ: తెల్లరేషన్ కార్డులు ఉన్నవారు ఆధార్‌కార్డులను అందించాలని చెప్పడంతో అందరూ అందజేశారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండునెలలుగా రేషన్‌కోటాలో కోత తప్పడం లేదు. రచ్చబండ కార్డులతో పాటు, గతంలో ఉన్న కార్డుల లబ్ధిదారుల ఆధా ర్ నమోదు ప్రక్రియ కొనసాగుతుండగా, వాటిని సకాలంలో అనుసంధానం చేయడం లేదు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొనడంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఆధార్ నంబర్‌తో.. రేషన్ కార్డుల్లో పేర్లు నమోదై ఉన్న వారంతా తమ ఆధార్ కార్డు నంబర్‌ను అనుసంధానం చేయాలని కలెక్టర్ ఆదేశించడంతో అధికారులు ఆధార్ అనుసంధానం ప్రక్రియను దాదాపు పూర్తి చేస్తున్నారు. అయితే ఆధార్ జిరాక్సు కాపీలను చౌకధరల దుకాణాల్లో ఇచ్చినా తమ కార్డును అనర్హుల జాబితాల్లో చేర్చుతున్నారని పలువురు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ నంబర్‌ను ఇచ్చినా పలువురు లబ్ధిదారులకు చౌకధరల దుకాణాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం లేదు. అనర్హులుగా లబ్ధిదారులు జిల్లావ్యాప్తంగా రేషన్ కార్డుదారుల ఆధార్ నంబర్లను సేకరించి అనుసంధానం చేసే ప్రక్రియ గత ఏడాది కాలంగా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా కార్డుదారులు తమ ఆధార్ కార్డు జిరాక్సులను చౌక దుకాణాల్లో డీలర్లకు అందజేస్తున్నారు. ఇలా ఇచ్చిన ఆధార్ నెంబర్లను ఆన్లైన్ డేటాలో నమోదు చేయాల్సి ఉంది. ఇక్కడే అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కార్డు దారులు ఆధార్ నెంబర్లు ఇచ్చినా డేటా ఎంట్రీలో నిర్లక్ష్యం వల్ల వారి పేర్లు అనర్హుల జాబితాకు చేరుతున్నాయి. వీటికి ప్రస్తుతం రేషన్ పంపిణీ నిలిచిపోయింది. వారికి చౌకధరల దుకాణాల్లో డీలర్లు సరుకులు పంపిణీ చేయడం లేదు. ఆధార్ అనుసంధాన కంప్యూటరీకరణ ప్రక్రియ సక్రమంగా పూర్తి చేస్తేనే కార్డుల లబ్ధిదారులకు ఈ ఇబ్బందులు తొలగుతాయి. ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమాల్లో రేషన్ కార్డులను మంజూరు చేయగా, అప్పట్లో కార్డులైతే ఇచ్చారు కానీ వీరి పేర్లు ఆన్లైన్ డేటాబేస్‌లో నమోదు చేయలేదు. దీంతో అప్పటి నుంచి రచ్చబండ కార్డుదారులకు ప్రత్యేకంగా కూపన్లు జారీ చేసి సరుకుల పంపిణీ చేస్తూ వచ్చారు. జిల్లాలో సుమారు 40వేల మంది రచ్చబండ కార్డు దారులు ఉండగా, వీరిలో వేలాది మంది పేర్లు డేటాబేస్‌లో నమోదు కాలేదు. దీంతో వీరికి సంబంధించిన కోటాను కూడా చౌకధరల దుకాణాలకు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆహార భద్రతాకార్డులతో గందరగోళం రేషన్ కార్డులు ఉన్నా.. ఆహార భద్రతా కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలని తాజాగా ప్రభుత్వం ఆదేశించడంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే ఆధార్ అనుసంధానం ఇబ్బందులు పెడుతుండగా, మళ్లీ ఇప్పుడు తాజా దరఖాస్తు చేసుకోవాలనడంతో గందరగోళానికి గురవుతున్నారు.