కోట్ల కొద్దీ నగదు, ఆరు పిస్టళ్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/తుర్కయంజాల్: నయీమ్ ఎన్కౌంటర్ నేపథ్యంలో అప్రమత్తమైన సైబరాబాద్ పోలీసులు నెక్నాంపూర్ పంచాయతీలోని అలకాపురి టౌన్షిప్లో ఉన్న నయీమ్ బావమరిది మహమ్మద్ అయూబ్ ఆలీ నివాసంలో, వనస్థలిపురంలో నయీ మ్ అనుచరుడిగా భావిస్తున్న శ్రీధర్‌గౌడ్ నివాసంలో సోదాలు చేశారు. అయూబ్ నివాసంలో రూ. 2.8 కోట్ల నగదు, మూడు పిస్టళ్లు, 1.93 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుని 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్‌గౌడ్ నివాసంలో రూ.38.5 లక్షల నగదు, 3 పిస్టల్లు, భూములు, ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎనిమిది గంటల పాటు తనిఖీలు
ట్రాఫిక్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, రాజేంద్రనగర్ ఏసీపీ గంగారెడ్డి, శంషాబాద్ ఏసీపీ అనురాధ నేతృత్వంలోని పోలీసులు అలకాపూరి టౌన్షిప్ హెచ్ బ్లాక్ ఫ్లాట్ నంబర్ 105లో సోమవారం మధ్యాహ్నం 12 నుంచి దాదాపు రాత్రి 8.00 గంటల వరకు సోదాలు చేశారు. రూ.రెండు కోట్ల ఎనిమిది లక్షలు నగదు, మూడు పిస్టల్లు, ఒక డమ్మీ పిస్టల్, 169 బుల్లెట్లు, పది జిలెటిన్ స్టిక్స్, 1.93 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా వందలసంఖ్యలో భూములు, ఫ్లాట్ల డాక్యుమెంట్లు, వందల సంఖ్యలో సిమ్ కార్డులు లభ్యమయ్యాయి.
ఇంట్లో దొరికిన డబ్బును లెక్కించేందుకు మిషిన్‌ను తెప్పించగా, అది సరిపోకపోవడంతో నార్సింగి ప్రాంతంలోని కిరాణా దుకాణాల నుంచి మరో రెండు మిషన్లను తెప్పించారు. ‘‘నయీమ్ బంధువులుగా చెబుతున్న ఫర్హా, ఆసియా (డ్రైవర్ భార్య) లతో పాటు ఇంట్లో ఉన్న మరో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నాం. వారిలో ఫర్హానా (11), రేష్మా (10), నజియా (17), సాహిరా (10), నబీ యా (12) అనే పిల్లలు ఉన్నారు. వారంతా ఎవరు, ఎక్కెడినుంచి వచ్చారనే వివరాలు తెలియాల్సి ఉంది. నయీమ్ ఇద్దరు కుమారులు దిల్లీ దిద్దీన్(11), అహదుద్దీన్ (14), కుమార్తె సఫా (8), నయీమ్ సోదరి కూమార్తె అబ్రన్లను కూడా పట్టుకున్నాం. ఈ పిల్లలను చైల్డ్ వెల్ఫేర్ హోమ్‌కు తరలిస్తాం. మిగతావారిలో కేసుతో సంబంధం లేని వారిని విచారించాక వదిలిపెడతాం..’’ అని సైబరాబాద్ వెస్ట్ సీపీ నవీన్ చంద్ వివరించారు.
శ్రీధర్‌గౌడ్ ఇంటిపై దాడులు
హయత్‌నగర్ మండలం ఇంజాపూర్ గ్రామ పరిధిలోని తుల్జాభవానీకాలనీలో ఉన్న శ్రీధర్‌గౌడ్ ఇంటి పై సైబరాబాద్ ఈస్ట్ పోలీసులు దాడి చేశారు. రూ.38.5 లక్షల నగదు, మూడు పిస్టల్స్, పలు భూములు, ఆస్తుల డాక్యుమెంట్లు, ఒక కంప్యూటర్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్‌గౌడ్ భూదందాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ పేర్కొన్నారు. శ్రీధర్‌గౌడ్ నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురానికి చెందిన వాడని తెలుస్తోంది. నయీమ్ కుటుంబ సభ్యులకు డ్రైవర్‌గా పనిచేసేవాడని సమాచారం.