అణువణువూ ప్రమాదమే..
రణస్థలం: కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం అణువణువూ ప్రమాదకరమని సంజీవినీ పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కూన రామం, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, ఉపాధ్యక్షులు సీహెచ్ అమ్మన్నాయుడులు అన్నారు. అణువిద్యుత్ కేంద్రం వల్ల కలిగే అనర్ధాలపై సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం కోష్ఠ సమీపంలోని యూబీ పరిశ్రమ వద్ద ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ఎన్నికల ముందు అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబునాయుడు కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం పెడితే శ్రీకాకుళం జిల్లా శ్మశానంగా మారుతుందని చెప్పారని... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అణుపార్క్కు అనుకూలంగా జీవోలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు.
అణుపార్క్కు వ్యతిరేకంగా చిలకపాలేంలో ప్రజాస్వామ్యయుంతంగా ర్యాలీ నిర్వహిస్తే పోలీసులతో అరెస్టులు చేయించి కేసులు పెట్టడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యానికి నష్టం కలిగించే సెక్షన్–30ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్, జర్మనీ దేశాలలో ఉన్న అణువిద్యుత్ కేంద్రాలను మూసివేస్తుంటే, ఇక్కడ అణుపార్క్ నిర్మాణానికి పూనుకోవడం ఎవరి ప్రయోజనాల కోసమని ప్రశ్నించారు. అణుపార్క్ నిర్మాణానికి 2.8 లక్షల కోట్లు ఖర్చుఅవుతుందన్నారు. అణుప్లాంటు 30 నుంచి 35 సంవత్సరాలు మాత్రమే పనిచేస్తుందని, ఆ తరువాత కూడా అణువ్యర్థ్యాల నిర్వహణకు వేలకోట్లు ఖర్చుచేయాలన్నారు. అణురేడియోధార్మికత, అణువ్యర్థాల వల్ల ప్రజలు క్యాన్సర్, పిల్లలుపుట్టక పోవటం, పుట్టేపిల్లలు వింత ఆకారాలతో పుట్టడం వంటి ప్రమాదకర జబ్బులు బారిన పడతారన్నారు. ఇప్పటికైనా మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు ప్రతిపాదిత కొవ్వాడ అణుపార్క్ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఎన్వీ రమణ, జి.బుచ్చిబాబు, డి.సత్యనారాయణ, కె.మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.