ఉరితాళ్లతో నిరసన వ్యక్తం చేస్తున్న సీఐటీయూ నేతలు
► కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం వద్దు
► సీఐటీయూ ఆధ్వర్యంలో వినూత్న నిరసన
రణస్థలం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమెరికాకు సిరులు కురిపించడానికి కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రం పెట్టి ఉత్తరాంధ్రను ఉరితీస్తున్నాయని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు, డివిజన్ కార్యదర్శి పి.తేజేశ్వరరావులు ధ్వజమెత్తారు. హిరోషిమా డే సందర్భంగా శనివారం కొవ్వాడలో అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉరితాళ్లతో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1945లో జరిగిన అణుబాంబు విధ్వంసంతో ఇప్పటికీ హిరోషిమా కోలుకోలేదన్నారు. ఇప్పుడు కొవ్వాడలో ఆరు రియాక్టర్లు పెడుతున్నారని, ఒక్కో రియాక్టర్ ఒక్కో అణుబాంబుతో సమానమని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాలు అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని దుయ్యబట్టారు. అణునిపుణులతో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. రేడియోధార్మికతతో భూమి, గాలి, నీరు కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు మైలపల్లి పట్టయ్య, అభిరామ్, సీహెచ్ అమ్మన్నాయుడు, కె.గురినాయుడు, సీతారాం, సంతోష్, బాలి శ్రీను తదితరులు పాలొన్నారు.