అమెరికా సహకారంతో కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం  | Nuclear Power Plant at Kovvada in collaboration with United States | Sakshi
Sakshi News home page

అమెరికా సహకారంతో కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం 

Published Fri, Feb 4 2022 5:17 AM | Last Updated on Fri, Feb 4 2022 5:17 AM

Nuclear Power Plant at Kovvada in collaboration with United States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం నెలకొల్పాలని ప్రతిపాదించినట్లు పీఎంవో కార్యాలయ సహాయమంత్రి డాక్టర్‌ జితేంద్రసింగ్‌ గురువారం రాజ్యసభలో చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిస్తూ.. మొత్తం ఆరు రియాక్టర్లతో 1,208 మెగావాట్ల సామర్థ్యంతో ఈ అణువిద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

దేశీయంగా తయారయ్యే ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్స్‌ (పీహెచ్‌డబ్ల్యూఆర్‌)ను ఈ అణువిద్యుత్‌ కేంద్రంలో ఏర్పాటు చేయడం లేదని చెప్పారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం 18 ప్రెషరైజ్డ్‌ హెవీ వాటర్‌ రియాక్టర్స్‌ అణువిద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండగా మరో ఆరు నిర్మాణంలో ఉన్నాయని, మరో 10 పీహెచ్‌డబ్ల్యూఆర్‌ల ఏర్పాటుకు ఆర్థిక, పాలనాపరమైన మంజూరు లభించిందని వివరించారు. ఈ మొత్తం రియాక్టర్ల ద్వారా 7 వేల మెగావాట్ల అణువిద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. 

న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర పథకం 
న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తున్నట్లు న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను కల్పించి, అభివృద్ధి చేసే ప్రాథమిక బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వలదే అయినప్పటికీ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక తోడ్పాటు ఇచ్చేందుకు కేంద్రం పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు.

ఈ పథకం కింద మౌలిక వసతుల అభివృద్ధికి అయ్యే ఖర్చులో కేంద్రం 60 శాతం భరిస్తుందని, కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఏప్రిల్‌ 2021 నుంచి మరో అయిదేళ్లు పొడిగించిందని తెలిపారు. ఈ పథకం కింద రూ.9 వేల కోట్లు కేటాయించగా అందులో కేంద్ర ప్రభుత్వం వాటా 5,307 కోట్లని తెలిపారు. 1993–94లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు 8,758 కోట్లు విడుదల చేసిందని, అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా రూ.199 కోట్లని చెప్పారు. 

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల పెంపు ప్రతిపాదన వచ్చింది 
ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపునకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రతిపాదన వచ్చిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలతో కలిపి పూర్తి ప్రతిపాదనలు పంపాలని గత నవంబర్‌ 29న, గతనెల 3వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలను కోరామని కేంద్రమంత్రి చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement