కొవ్వాడలో ఉద్రిక్తం
పూసపాటిరేగ(నెల్లిమర్ల): అధికారం అండతో పట్టాభూముల్ని కాజేస్తూంటే వారి కడుపు మండింది. ఎన్నో ఏళ్లుగా తాము అనుభవిస్తున్న భూముల్ని వేరొకరికి ధారాదత్తం చేయడంతో వారి రక్తం ఉడికింది. ఎలాగైనా తమ భూములు దక్కించుకోవాలని ఉద్యమానికి వారంతా సిద్ధమయ్యారు. అక్కడ వేసిన కంచెలు ధ్వంసం చేసి ఆ భూముల్లో టేకు మొక్కలు నాటారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల శాసనసభ్యుడు పతివాడ నారాయణస్వామి నాయుడు కుమారుడి బినామీ కంపెనీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 17 ఎకరాల భూమిని కారుచౌకగా కట్టబెట్టింది. ఆ భూముల్ని ఇదివరకే పూసపాటిరేగ మండలం కొవ్వాడ దళితులకు పట్టాలుగా అందజేయడంతో వారు ఆ భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమని ఆందోళన చేస్తున్నారు. అయినా ఆ భూముల్లో బుధవారం రాత్రే కంపెనీ యాజమాన్యం కంచె వేయడంతో విషయం తెలుసుకున్న దళితులు గురువారం ఉదయం మూకుమ్మడిగా ఆ కంచెను ధ్వంసం చేశారు.
నోటీసుల్లేకుండా లాక్కుంటారా...
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, దళిత నా యకుడు మిరప అప్పారావు ఆధ్వర్యంలో కొవ్వాడ కు చెందిన దళితులు రక్షణ కంచెను ధ్వంసం చేశా రు. ప్రభుత్వం తమకు డి–పట్టాలుగా ఆ భూములు ఇచ్చిందనీ... ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు చెందిన ఎన్‌సీఎల్ లేబొరేటరీకి ప్రభుత్వం ఎలా అప్పగిస్తుందని వారు ప్రశ్నించారు.
అప్పటికే పూసపాటిరేగ ఎస్‌ఐ జి.కళాధర్ సిబ్బందితో కంచెను ధ్వంసం చేయకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మహిళలతో వాగ్వివాదానికి దిగడంతో మరికొంత మంది దళితులు వేరే మార్గంలో వచ్చి మిగతా కంచెను తీసేశారు. సుమారు 17 ఎకరాల భూముల్లో తమతో పాటు తెచ్చిన టేకు మొక్కల ను నాటారు. విషయాన్ని పోలీసు ఉన్నత అధికా రులకు సమాచారం అందజేయగా డీఎస్‌పీలు ఎ. ఎస్.చక్రవర్తి, డి.త్రినాథరావు ఆధ్వర్యంలో వందలాది మంది ప్రత్యేక పోలీసులు సంఘటనా స్థలం లో మోహరించారు. రిజర్వు ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ సంఘటనా స్థలంలోనే మాక్‌డ్రిల్ నిర్వహించారు.
వేడెక్కిన వాతావరణం
ఇద్దరు డీఎస్‌పీలు, నలుగురు సీఐలు, ఆరుగురు ఎస్‌ఐలతో పాటు వందలాది మంది ప్రత్యేకపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందలాది మంది దళితులు ఒక పక్క, పోలీసులు మరో ప్రక్క వుండటంతో వ్యూహ ప్రతి వ్యూహాలతో వాతావరణం వేడెక్కింది. పోలీసులు భారీ స్థాయిలో మోహరించిన తరువాత భోగాపురం సీఐ ఇ.నరసింహారావు రైతుసంఘం రాష్ట్రప్రధానకార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, దళిత సంఘం నాయకులను సంఘటనా స్థలంలో చర్చలకు ఆహ్వానించారు. డీఎస్‌పీలు ఎ.ఎస్.చక్రవర్తి, డి.త్రినాథరావు, తహసీల్దార్ ఆర్ ఎర్నాయుడు చర్చలు జరిపారు. రెవెన్యూకు సంబంధించిన విషయం కావడంతో విజయనగరం ఆర్‌డీఓ కార్యాలయంలో కొవ్వాడ డి–పట్టాదారులను తమదగ్గరున్న అధారాలతో చర్చలకు రావాలని ఆహ్వానించారు. చర్చలు జరిగే వరకు భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకుండా చూడాలని పోలీసులకు తెలిపారు.
దళితులకే పూర్తి హక్కులు
కొవ్వాడ గ్రామానికి చెందిన దళితులకు డి–పట్టాగా ఇచ్చారు. వారికే భూములపై పూర్తిహక్కులు వున్నాయి. 2013 భూసేకరణ చట్టం, షెడ్యూల్ 11 ప్రకారం దళితుల భూములు ప్రభుత్వానికి అవసరం మేరకు తీసుకున్నప్పడు ముందుగానే పట్టాదారులకు నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చిన తరువాత పట్టాదారు అంగీకరిస్తేనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలి. అలాంటివేవీ లేకుండా దళితుల భూములను లాక్కొని అధికారపార్టీకి చెందిన శాసనసభ్యుడు బినామీ కంపెనీకి కట్టబెట్టడం దుర్మార్గం. దీనిపై ఉద్యమం తీవ్రతం చేస్తాం. తక్షణమే అధికారపార్టీ శాసనసభ్యుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి.
– ఎం.వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి, అమరావతి
దళితుల భూములు లాక్కుంటే కేసులు పెట్టాలి
కొవ్వాడ దళితులు డిపట్టా భూములపై నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేయాలి. 1960 నుంచి భూములపై హక్కులతో వున్న దళితులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి. ప్రభుత్వానికి డి–పట్టా భూములు అవసరమైనప్పుడు నోటీసులు ఇచ్చి పట్టా దారులకు పరిహారం చెల్లించిన తరువాతే భూములు తీసుకోవాలి. ఇప్పటికైనా ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలి.
– తమ్మినేని సూర్యనారాయణ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, విజయనగరం.