విమానం ఎక్కే ముందు..
చాలామందికి విమాన ప్రయాణం అంటే కాస్త గుబులు గానే ఉంటుంది. దానికి తోడు ప్రయాణానికి ముందు ఏది పడితే అది తినడం తాగడం చేస్తే ఇక చెప్పనక్కరలేదు. కడుపులో గుబులుకు తోడు కొన్ని పదార్థాలు లోనికి వెళ్ళడం విపరీతాలనే తెచ్చి పెడుతుంది. అందుకే ఫ్లైట్ ఎక్కే ముందు కాస్త జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా త్వరగా జీర్ణంకానీ, గ్యాస్ ను సృష్టించే పదార్థాలకు, పానీయాలకు దూరంగా ఉండాలంటున్నారు.
విమాన ప్రయాణానికి ముందు ఆపిల్స్ తో పాటు ఆ జాతికి చెందిన పండ్లను తినడం అంతగా మంచిది కాదట. ఎందుకంటే వాటిలో ఎక్కువగా పీచు పదార్థం ఉంటుంది. ఇటువంటి పదార్థాలు భూమినుంచి గరిష్ట ఎత్తులో ప్రయాణించేప్పుడు త్వరగా జీర్ణం కాకపోవడంతో కడుపులో గ్యాస్ పెరిగి ఇబ్బందిని తెచ్చి పెడుతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి అస్సలే ముట్టకూడదు. బస్సు, రైలు ప్రయాణాల్లోనే నూనె వస్తువులు వికారాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ గ్యాస్ ను పెంచడంలో ముందుంటాయి. బర్గర్లు, పిజ్జాలు కూడా ఈ జాతికి చెందినవే. ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి కదాని వీటిని తింటే ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు. వీటివల్ల సిరల్లోని రక్తం గడ్డకట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇక చికెన్ తో చేసిన పదార్థాలు తినడం కూడా విమాన ప్రయాణాల్లో అంతగా మంచిది కాదు.
దాహం అనిపించినప్పుడు తాగే శీతల పానీయాల విషయంలోనూ ప్రయాణానికి ముందు కొంత జాగ్రత్త పడాల్సిందే. చల్లని శుభ్రమైన మంచినీరు తాగడం ఈ సమయంలో అత్యుత్తమం. కోక్ వంటివి తాగితే గ్యాస్ ను సృష్టిస్తాయి. దీంతో అసౌకర్యానికి లోను కావాల్సి వస్తుంది. అలాగే మద్యపానానికి కూడా దూరంగా ఉండటం మంచిది. విమాన ప్రయాణంలో కలిగే ఇబ్బందిని మరచిపోవచ్చని కొందరు చూయింగ్ గమ్ లు, చీక్లెట్లు నములుతుంటారు. వీటినుంచీ ఉత్పత్తయ్యే రసాలు కూడా గాలితో కలసి గ్యాస్ ను సృష్టిస్తాయి. అలాగే కాఫీకి డీ హైడ్రేషన్ తెప్పించే లక్షణం ఉంటుంది. విమాన ప్రయాణంలో కాఫీ తాగడం వల్ల విమానంలో ఉండే తడిగాలి తోడై తలనొప్పి, వికారం తెప్పిస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ పదార్థాలకు దూరంగా ఉంటే టూర్ హాయిగా ఎంజాయ్ చేయగల్గుతారు.