నన్ను అనుష్క అంటున్నారు
అనుష్కలా ఉన్నావంటున్నారు అంటూ తెగమురిసిపోతోంది నవ నటి సుష్మారాజ్. అయితే ఈ బ్యూటీ కోలీవుడ్‌కే నూతన నటి. టాలీవుడ్లో రెండు చిత్రాలు చేసేసిందట. ఇండియా - పాకిస్తాన్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు దిగుమతి అవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు విజయ్ ఆంతోని హీరోగా నటించిన ఈ చిత్రం ఈ నెల ఎనిమిదవ తేదీన తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఇండియా- పాకిస్తాన్ చిత్రంలో నటించిన అనుభవాలను సుష్మారాజ్ పంచుకున్నారు. ఇండియా - పాకిస్తాన్ చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది.
బెంగళూరులో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి తెలుగులో హీరోయిన్గా రెండు చిత్రాలు చేశాను. ఆ చిత్రాలు చూసే ఇండియా - పాకిస్తాన్ చిత్ర దర్శకుడు ఆనంద్ ఈ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఇందులో నాది ధైర్యం గల యువతి పాత్ర. హీరో విజయ్ ఆంతోనితో తరచూ గొడవపడే పాత్ర. ఇంతకుముందు కాస్త అనుభవం ఉండడం వలన ప్రతి సన్నివేశాన్ని సింగిల్టేక్లో చేసేశాను.
తమిళం నాకు పరిచయం అయిన భాష కావడంతో ఏమంత శ్రమ అనిపించలేదు. అయితే కోర్టు సన్నివేశంలో అచ్చ తమిళ భాష మాట్లాడాల్సి రావడంతో కాస్త కష్టపడాల్సి వచ్చింది. మరో విషయం ఏమిటంటే చిత్రంలోని పలకోటి పెగ్గలిల్ అనే పాటకు నా దుస్తులకు నేనే డిజైన్ చేసుకున్నాను. అలాగే కుక్కలంటే నాకు చాలా భయం అలాంటిది ఒక దెయ్యం సన్నివేశంలో నటిస్తుండగా ఒక కుక్క నాపై బడి కరిచింది. ఈ చిత్ర అనుభవాల్లో ఇదొకటి.