2020లో కొత్త మార్కెట్ కమిటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతన మార్కెట్ కమిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. శనివారం ప్రభుత్వం విడుదల చేసిన తుది నోటిఫికేషన్తో మార్కెట్ కమిటీల సరిహద్దులు ఖరారయ్యాయి. ఇక మార్కెట్ కమిటీల పాలక వర్గాల నియామకం, బాధ్యతల స్వీకరణ త్వరలో పూర్తి కానుంది. వచ్చే నెలలోనే నూతన మార్కెట్ కమిటీలు కొలువుదీరనున్నట్లు సమాచారం. మార్కెట్ కమిటీల ద్వారా రైతు సంక్షేమ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మొత్తం మార్కెట్ కమిటీలు 216
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ తప్పనిసరిగా ఉండాలని ఎమ్మెల్యేల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ మేరకు ప్రభుత్వం మార్కెట్ కమిటీల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. 10 రోజుల క్రితం ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించింది. తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, ప్రకాశం జిల్లాల నుంచి వచి్చన అభ్యంతరాలను పరిష్కరించి, శనివారం తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
దీని ప్రకారం కొత్తగా 25 మార్కెట్ కమిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కమిటీల సంఖ్య 216కు చేరింది. ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల్లోని మార్కెట్ కమిటీలకు గౌరవ అధ్యక్షులుగా ప్రకటించారు. సూచనలు, సలహాలు ఇచ్చే అధికారాన్ని కట్టబెట్టారు. ఒక్కో మార్కెట్ కమిటీలో 20 మంది సభ్యులుండాలని ప్రభుత్వం నిర్దేశించింది. గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే, 12 మంది రైతులు, ముగ్గురు వ్యాపారులు, నలుగురు అధికారులు ఉండాలని సూచించింది. సభ్యులు తప్పనిసరిగా రైతులే అయి ఉండాలి. భూమి లేకపోయినా పాడి పశువులున్న వారిని రైతులుగా గుర్తిస్తారు.
రిజర్వేషన్లకు అనుగుణంగానే..
మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీలకు 25, మైనారీ్టలకు 4 శాతం రిజర్వేషన్ కలి్పంచాలని, జనరల్ కేటగిరీకి మిగిలిన 50 శాతం ఇవ్వాలని సూచించింది. వీటిన్నింటిలోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని స్పష్టం చేసింది.
జనవరిలో బాధ్యతల స్వీకరణ
‘‘కొత్త సంవత్సరంలో మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలు రానున్నాయి. జనవరిలో ఎమ్మెల్యే అధ్యక్షతన సభ్యులు బాధ్యతలు స్వీకరిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్న కమిటీలనే మార్కెటింగ్ శాఖ ఖరారు చేస్తుంది. కొత్త కమిటీల ఏర్పాటుతో రైతులకు మరిన్ని సేవలు అందనున్నాయి. అలాగే కొత్త మార్కెట్ యార్డుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. అవసరమైన చోట స్థలాలు సేకరిస్తున్నాం’’
– మోపిదేవి వెంకటరమణారావు, మార్కెటింగ్ శాఖ మంత్రి