కీలక పరిణామం: ట్రంప్‌తో అలీబాబా చైర్మన్ భేటీ
చైనా పాలసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన ట్రంప్‌కు, డ్రాగన్ దేశానికి ఈ మధ్యన అసలు పడటం లేదు. ట్రంప్ తమతో వైరానికి దిగితే తాము చూస్తూ ఊరుకోబోమంటూ డ్రాగన్ ఓ వైపు నుంచి హెచ్చరికలు కూడా జారీచేస్తోంది. ఈ కీలక సమయంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్, వ్యవస్థాపకుడు జాక్‌మా సోమవారం డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఈ భేటీలో చిన్న వ్యాపారాలకు సాయార్థం చైనాకు గూడ్స్ విక్రయించడానికి అమెరికాలో కొత్త ఉద్యోగాల సృష్టించాలనే దానిపై జాక్ మా ట్రంప్‌తో చర్చించారు. త్వరలో రాబోతున్న ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌కు, చైనాకు మధ్య నెలకొన్న ఆందోళన నేపథ్యంలో వీరిద్దరు సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.
చైనాతో వాణిజ్యం సాగించడానికి అత్యధిక టారిఫ్‌లు వేస్తానని ఓవైపు నుంచి ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అమెరికాలో ఉద్యోగాలను చైనీసులు కొట్టుకుని పోతున్నారని వాదిస్తున్నారు. అంతేకాక ఎన్నికల్లో అనూహ్య విజయానంతరం అమెరికా విదేశాంగ విధానానికి తూట్లు పొడిచి, తైవాన్ అధ్యక్షురాలితో ఫోన్లో మాట్లాడారు. ఈ విషయంలో ఇప్పటికే చైనా చాలా గుర్రుగా ఉంది. జాక్ మా, ట్రంప్ భేటీ మీటింగ్ ట్రంప్ టవర్‌లో జరిగింది. కంపెనీ ప్లాట్ ఫామ్స్ ద్వారా చిన్న, మధ్యతర బిజినెస్‌లకు అనుమతివ్వాలని, వీటివల్ల అమెరికాలో సృష్టించే 1 మిలియన్ ఉద్యోగాల ప్రణాళికపై చర్చించినట్టు అలీబాబా ట్వీట్ చేసింది. ఈ విషయంతో పాటు జాక్ మా, ట్రంప్‌తో భేటీ అవడానికి వెళ్లడం, ట్రంప్ టవర్‌లో వేచి చూస్తున్న జాక్ మా చిత్రాలను అలీబాబా పోస్టు చేసింది. 'జాక్, నేను కలిసి కొన్ని గొప్ప పనులు చేయబోతున్నాం' అని మీటింగ్ అనంతరం ట్రంప్ కూడా పేర్కొన్నారు.
Jack Ma on the way to meet President Elect @realDonaldTrump to discuss $BABA plans to create 1MM US jobs by helping small biz sell to China. pic.twitter.com/Kca4kiwqPI
— Alibaba Group (@AlibabaGroup) January 9, 2017