పోటెత్తుతున్న వాహనాలు
రోజూ నగర రోడ్లపైకి 1,309 నూతన వాహనాలు
2015-16 ఆర్థిక ఏడాదిలో 4.78 లక్షల నూతన వాహనాల నమోదు
అంతకు ముందు ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 24,078 ఎక్కువ
వాహనాల సంఖ్యలో ఢిల్లీ తర్వాత బెంగళూరు రెండో స్థానం
బెంగళూరు: బెంగళూరు నగరంలో వాహన రద్దీ పెరుగుతోంది. సగటున రోజుకు 1,309 నూతన వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఇందులో మెజారిటీ వాటా ద్విచక్ర వాహనాలదే. రాష్ట్ర రవాణాశాఖ గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బెంగళూరు నగరంలోని 11 రీజినల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు ఉండగా (ఆర్టీవో) 2015 ఏప్రిల్ 1 నుంచి 2016 మార్చ్ 31 వరకూ మొత్తం 4.78 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయి. అంతకు ముందు ఆర్థిక ఏడాది (2014-15)తో పోలిస్తే ఈ సంఖ్య 24,078 ఎక్కువ. ఇందులో 3.78 లక్షల వాహనాలు ద్విచక్రవాహనాలు కాగా, మిగిలినవి కార్లు, లారీ, బస్సులు తదితరాలు. ఈ లెక్కన రోజూ సగటున 1,309 వానాలు బెంగళూరు రోడ్ల పైకి వస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక మొత్తం బెంగళూరులో ఈ ఏడాది మార్చి 31 వరకూ 61 లక్షల వాహనాలు ఉన్నాయి. ఇందులో 88.5 (54 లక్షలు) శాతం ప్రైవేటు వాహనాలు కావడమే గమనార్హం. మిగిలినవి ప్రజారవాణా వ్యవస్థకు వినియోగించే కేఎస్ ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవాటితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విద్యా, వైద్య సంస్థలకు చెందిన వాహనాలు ఉన్నాయి.
నగరంలోని విభాగాలవారిగా తీసుకుంటే పశ్చిమ బెంగళూరు విభాగం అత్యధికంగా 7.2 లక్షల ద్విచక్ర వాహనాలు కలిగి ఉండగా ఆ తర్వాతి స్థానంలో దక్షిణ విభాగం (7 లక్షల వాహనాలు) ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 1.62 కోట్ల వాహనాలు ఉన్నాయని రాష్ట్ర రవాణాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఈ లెక్కన ప్రతి పది వాహనాల్లో దాదాపు నాలుగు వాహనాలు బెంగళూరులోనే ఉన్నాయని చెప్పవచ్చు. ఇక దేశ వ్యాప్తంగా తీసుకుంటే ఢిల్లీ 88.3 లక్షల వాహనాలతో మొదటి స్థానంలో ఉండగా అటు పై బెంగళూరు 61.1 లక్షల వాహనాలతో రెండోస్థానంలో, 42.4లక్షల వాహనాలతో చెన్నై మూడో స్థానంలో ఉంది. ఇక కొలకత్తా (38.6 లక్షల వాహనాలు), ముంబై (27 లక్షల వాహనాలు) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉండటం గమానార్హం.