కొత్త ఓటర్లకు 25న గుర్తింపు కార్డులివ్వండి
ఏలూరు, న్యూస్‌లైన్ :జిల్లాలో కొత్తగా నమోదైన ఓటర్లకు జనవరి 25న ఉచితంగా ఫొటో ఓటరు గుర్తిం పు కార్డులు అందించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ తహసిల్దార్లకు ఆదేశాలిచ్చారు. ఇందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మండల అధికారులతో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఎన్నికల సందర్భంలో ఓటర్లందరికీ ఫొటో ఓటరు స్లిప్‌లను ప్రభుత్వపరంగానే అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జనవరి 16న ఓటర్ల తుదిజాబితా ప్రకటించి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు అందించాలన్నారు.
తరచూ గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా ఓటర్ల జాబితాల విషయంలో ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. ఇటీవల ప్రత్యేక డ్రైవ్ ద్వారా వచ్చిన 1.55 లక్షల ఓటర్ల దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి, ఓటర్ల జాబి తాలను సిద్ధం చేయాలన్నారు. సుమోటాగా చేపట్టే తొలగింపులను ఏకపక్షంగా చేయడానికి వీల్లేదని, సరైన రీతిలో విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఓటర్ల నమోదు డేటా ఎంట్రీని పూర్తి చేసుకోవాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి కె.ప్రభాకరరావు, డీపీవో అల్లూరి నాగరాజువర్మ, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, ఇందిరాసాగర్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి పాల్గొన్నారు.