New World Wealth Report
-
భారత్ నుంచి సంపన్నుల వలస
న్యూఢిల్లీ: పేదవారు పొట్ట చేత పట్టుకుని వలస పోవడం వినే ఉంటారు. వారిది జీవనపోరాటం. అయితే, వలసలు వారికే పరిమితం కాదు. సంపన్నులు కూడా తమ అవసరాల కోసం, ఆశయాల కోసం, మెరుగైన జీవనం కోసం వలసల బాట పడుతున్నారు. విదేశాలకు తమ గమ్యస్థానాన్ని మార్చుకుంటున్నారు. 2017లో మన దేశం నుంచి 7,000 మంది మిలియనీర్లు (అధిక విలువ కలిగిన వ్యక్తులు/మిలియన్ డాలర్లు/రూ.6.4 కోట్లు ఆపై సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోయారని న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్ చెబుతోంది. 2016లో వలస వెళ్లిన వారి సంఖ్య కంటే 16 శాతం అధికం. 2016లో 6,000 మంది, 2015లో 4,000 మంది మిలియనీర్లు మన దేశం నుంచి విదేశాలకు మకాం మార్చారు. అమెరికా, యూఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మన దేశ వాసులను ఆకర్షించిన టాప్ దేశాలు. కీలక అంశాలు... ♦ 2017లో 10,000 మంది చైనీయులు ఆ దేశం వీడి వెళ్లారు. వలసల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానం చైనాదే. టర్కీ 6,000 మంది, బ్రిటన్ 4,000 మంది, ఫ్రాన్స్ 4,000 మంది, రష్యా 3,000 మంది మిలియనీర్లను కోల్పోయాయి. మిలియనీర్ల వలసల సంఖ్య 2017లో మొత్తం మీద అంతర్జాతీయంగా 95,000గా ఉంది. ♦ మిలియనీర్లను ఆకర్షించడంలో ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకుంది. 2017లో ప్రపంచ దేశాల నుంచి ఈ దేశానికి తరలివెళ్లిన వారు 10,000 మంది ఉన్నారు. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో మరోసారి ఆస్ట్రేలియా కంటే వెనుకబడింది. అయితే, మొత్తం మీద మిలియనీర్ల ఆకర్షణలో ఆస్ట్రేలియా తర్వాత నిలిచింది అగ్రరాజ్యమే. 9,000 మంది ఈ దేశాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కెనడా 5,000 మంది, యూఏఈ 5,000 మందిని ఆకర్షించాయి. ♦ మిలియనీర్ల సంపద ఎక్కువగా వున్న దేశాల్లో భారత్‌కు ఈ నివేదిక ఆరో స్థానం కల్పించింది. మొత్తం సంపద విలువ 8,230 బిలియన్ డాలర్లు. ♦ భారత్‌లో 3,30,400 మంది మిలియనీర్లు ఉన్నారు. మిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ అంతర్జాతీయంగా 9వ స్థానంలో నిలిచింది. మల్టీ మిలియనీర్లు 20,730 మంది ఉన్నారు. ఈ విషయంలో ఏడో స్థానంలో ఉంది. 119 మంది బిలియనీర్ల (100 కోట్ల డాలర్లు, అంతకు పైన సంపద ఉన్నవారు)తో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో నిలిచింది. -
తెలుగు బిలియనీర్లు ఏడుగురు!
♦ దేశంలోనే ధనిక నగరంగా ముంబై ♦ బిలియనీర్లూ అక్కడే అధికం ♦ ఆ తరువాత ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ♦ వర్ధమాన నగరాల్లో విశాఖ న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక తెలుగు రాష్ట్రాల్లో ఐదు బడా లిస్టెడ్ కంపెనీలు వాటి యజమానుల్ని బిలియనీర్ల జాబితాలో నిలబెట్టాయి. అరబిందో ఫార్మా, అమరరాజా బ్యాటరీస్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబ్స్... ఈ కంపెనీల యజమానులు బిలియనీర్ల జాబితాలో నిలబడ్డారు. దేశంలో ఏఏ నగరాలు ధనికమైనవో, ఎక్కడెక్కడ ఎంతమంది బిలియనీర్లున్నారో తెలియజేస్తూ... ‘న్యూ వరల్డ్ వెల్త్’ తాజా నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్‌లో ఏడుగురు బిలియనీర్లు ఉన్నట్లు పేర్కొంది. కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల వ్యక్తుల్ని హైదరాబాద్‌కు చెందినవారిగానే భావిస్తుండటంతో ఈ మేరకు పేర్కొని ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఐదు లిస్టెడ్ కంపెనీలతో పాటు అన్‌లిస్టెడ్ గ్రూపులైనప్పటికీ వివిధ వ్యాపారాల్లో విస్తరించిన రామోజీ గ్రూపు అధిపతి రామోజీరావు, నవయుగ గ్రూపు సంస్థల అధిపతి సి.విశ్వేశ్వరరావు ఈ జాబితాలోని మిగతా ఇద్దరూ అయి ఉండే అవకాశముంది. ఆయా నగరాల్లోని మొత్తం వ్యక్తుల అప్పుల్ని మినహాయించి, వివిధ కంపెనీల్లో వాటాలు, ఇతర ప్రైవేటు ఆస్తుల్ని కలిపి ఈ లెక్క వేసినట్లు నివేదిక వివరించింది. జాబితాలో కనీసం రూ.6.5 కోట్ల (1 మిలియన్ డాలర్లు) విలువగల నికర ఆస్తులను కలిగిన వారిని మిలియనీర్లుగా, రూ.6,500 కోట్ల (1 బిలియన్ డాలర్లు) విలువైన నికర ఆస్తులను కలిగిన వారిని బిలియనీర్లుగా పేర్కొన్నారు. మొత్తంగా ఈ ఏడాది జూన్ నాటికి దేశంలో రూ.364 లక్షల కోట్ల (5.6 ట్రిలియన్ డాలర్లు) సంపద, 2,64,000 మంది మిలియనీర్లు, 95 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ జాబితా ప్రకారం... దేశంలోని సంపన్న నగరాల విషయానికొస్తే ఆర్థిక రాజధాని ముంబై... ‘ధనిక నగరం’ బిరుదునూ సొంతం చేసుకుంది. 45,000 మంది మిలియనీర్లు, 28 మంది బిలియనీర్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ నగరంలోని మొత్తం సంపద విలువ దాదాపు రూ.53.3 లక్షల కోట్లుగా (820 బిలియన్ డాలర్లు) ఉన్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ తన నివేదికలో వెల్లడించింది. ముంబై తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నిలిచాయి. ఢిల్లీలో 22,000 మంది మిలియనీర్లు, 18 మంది బిలియనీర్లు ఉండగా... ఈ నగరంలోని మొత్తం సంపద విలువ దాదాపు రూ.29.2 లక్షల కోట్లు (450 బిలియన్ డాలర్లు). మూడో స్థానంలో నిలిచిన బెంగళూరులో 7,500 మంది మిలియనీర్లు, 8 మంది బిలియనీర్లు ఉన్నారు. ఈ నగరంలోని మొత్తం సంపద దాదాపు రూ.20.8 లక్షల కోట్లుగా (320 బిలియన్ డాలర్లు) ఉంది. హైదరాబాద్ సంపద 20 లక్షల కోట్లు దేశంలో 4వ సంపన్న నగరంగా నిలిచిన హైదరాబాద్‌లో 8,200 మంది మిలియనీర్లు, ఏడుగురు బిలియనీర్లు ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ నగర మొత్తం సంపద దాదాపు రూ.20.1 లక్షల కోట్లుగా (310 బిలియన్ డాలర్లు) ఉంది. ఏడుగురు బిలియనీర్ల పేర్లను సంస్థ వెల్లడించకపోయినప్పటికీ.. ఆయా వ్యక్తులకు సంబంధించిన లిస్టెడ్ కంపెనీల్లో వారి కుటుంబీకులకు ఉన్న షేర్లు, వాటి ప్రస్తుత ధర ఆధారంగా చూస్తే.. • అరబిందో ఫార్మాలో ప్రమోటర్లు నిత్యానందరెడ్డి, రామ్‌ప్రసాద్‌రెడ్డి కుటుంబీకులకు 47.74 శాతం వాటా ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.24,255 కోట్లు. • అమరరాజా బ్యాటరీస్‌లో ప్రమోటర్లు గల్లా రామచంద్రనాయుడి కుటుంబానికి, ఆయనకు చెందిన కంపెనీలకు 52 శాతం వాటా ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.9.139 కోట్లు. • దివీస్ ల్యాబ్స్‌లో మురళి దివి కుటుంబానికి 49% వాటా ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.17,092 కోట్లుగా ఉంది. • డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌లో దివంగత అంజిరెడ్డి కుటుంబీకులకు 30.73% వాటా ఉంది. దీని విలువ రూ.16,860 కోట్లు. • చెన్నై కేంద్రంగా నడుస్తున్నప్పటికీ రాష్ట్రానికి చెందిన డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి కుటుంబం ప్రమోటర్లుగా ఉన్న అపోలో హాస్పిటల్స్‌లో ఈ కుటుంబానికి 34% వాటా ఉంది. దీని విలువ రూ.6,500 కోట్లుపైనే. • మిగిలిన ఇద్దరు బిలియనీర్లూ అన్‌లిస్టెడ్ గ్రూపులకు చెందినవారే. మార్కెట్ విలువ బిలియన్ డాలర్లకన్నా చాలా ఎక్కువ ఉండొచ్చని భావిస్తున్న రామోజీ గ్రూపులో రామోజీ ఫిల్మ్‌సిటీ, ఈనాడు, ఈటీవీ, కళాంజలి, మార్గదర్శి చిట్‌ఫండ్స్, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, డాల్ఫిన్ హోటల్స్, ఉషాకిర ణ్ మూవీస్ వంటివి ఉన్నాయి. • రాష్ట్రానికి చెందిన నవయుగ గ్రూపు సైతం కృష్ణపట్నం పోర్టుతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, ఎక్స్‌పోర్ట్స్, స్టీల్, ఇన్ఫోటెక్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో ఉంది. వర్ధమాన నగరాల్లో విశాఖ.. హైదరాబాద్ తర్వాతి స్థానంలో 8,600 మంది మిలియనీర్లు, 10 మంది బిలియనీర్లతో కోల్‌కతా నిలవగా... 3,900 మంది మిలియనీర్లు, ఐదుగురు బిలియనీర్లతో పుణే ఆ తరవాత నిలిచింది. చెన్నైలో 6,200 మంది మిలియనీర్లు, నలుగురు బిలియనీర్లు ఉండగా... గుర్గావ్లో 3,600 మంది మిలియనీర్లు, ఇద్దరు బిలియనీర్లు ఉన్నారు. వర్ధమాన నగరాల జాబితాలో విశాఖపట్నం స్థానం పొందింది. విశాఖతోపాటు సూరత్, అహ్మదాబాద్, గోవా, చండీగఢ్, జైపూర్, వడోదర ఈ జాబితాలో ఉన్నాయి. మున్ముందు సంపద సృష్టి ప్రధానంగా హైదరాబాద్, పుణే, బెంగళూరు వంటి నగరాల్లో జరుగుతుందని నివేదిక పేర్కొంది. -
దేశం ధనికం.. వ్యక్తులు పేదలు!
♦ టాప్ టెన్ సంపన్న దేశాల్లో ♦ భారత్‌కు 7వ ర్యాంక్ ♦ న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ స్థానం పొందింది. ఏడవ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఇండియాలో మొత్తం సంపద 5,200 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ అధిక జనాభా వల్లే జాబితాలో స్థానం సంపాదించుకుందని నివేదిక పేర్కొంటోంది. ఇక తలసరి ఆదాయం పరంగా చూస్తే భారతీయులు చాలా పేదరికంలో ఉన్నారు. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం.. ♦ ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో అగ్రస్థానంలో అమెరికా ఉంది. ఈ దేశంలోని మొత్తం వ్యక్తుల సంపద 48,700 బిలియన్ డాలర్లు. ♦ అమెరికా తర్వాత వరుసగా చైనా (2వ స్థానం-17,300 బి.డాలర్లు), జపాన్ (3వ స్థానం-15,200 బి.డాలర్లు), జర్మనీ (4వ స్థానం-9,400 బి.డాలర్లు), యూకే (5వ స్థానం-9,200 బి.డాలర్లు) ఉన్నాయి. ♦ వీటి తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్ (6వ స్థానం-7,600 బి. డాలర్లు), ఇటలీ (8వ స్థానం-5,000 బి.డాలర్లు), కెనడా (9వ స్థానం-4,800 బి. డాలర్లు), ఆస్ట్రేలియా (10వ స్థానం-4,500 బి. డాలర్లు) నిలిచాయి. ♦ భారత్‌లో సంపద భారీగా వున్నా, అధిక జనాభాకావడం వల్ల తలసరి సంపద 4,000 డాలర్లకే (రూ. 2.68 లక్షలు) పరిమితమయ్యింది. ఆస్ట్రేలియాలో తలసరి సంపద 2.05 లక్షల డాలర్లు. భారత్‌లో 2015 గణాంకాల ప్రకారం వార్షిక తలసరి ఆదాయం 1,313 డాలర్లే (రూ. 88,000). సంపన్న దేశాల జాబితాలో భారత్‌కు ముందు, వెనుక వున్న ఫ్రాన్స్ (35,600 డాలర్లు), ఇటలీ (23,000 డాలర్లు)ల్లో తలసరి ఆదాయం భారత్‌కంటే బాగా ఎక్కువ. అమెరికాలో ఇది 38,000 డాలర్లు కాగా, చైనాలో 3,865 డాలర్లు. -
పదేళ్లలో సంపద 400 శాతం వృద్ధి
భారతీయుని సగటు ఆర్జనపై న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక న్యూఢిల్లీ: భారతీయుని సగటు సంపద 2005-15 మధ్య కాలంలో 400 శాతం పెరిగిందని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ఒకటి పేర్కొంది. ఇదే కాలంలో యూరోపియన్ సిటిజన్ ఆర్జనలో అసలు వృద్ధిలేకపోగా 5 శాతం క్షీణించిందని తెలిపింది. ముఖ్యాంశాలు చూస్తే... ♦ భారత్, చైనా, వియత్నాం వంటి వర్ధమాన దేశాల్లో పౌరుని సగటు సంపద 400 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా విషయంలో సంపద పెరుగుదల రేటు 100 శాతంగా ఉంది. కెనడాకు సంబంధించి ఈ రేటు 50 శాతం. ♦ ఒక వ్యక్తి మొత్తం ఆస్తుల్లోంచి రుణాలు తీసివేయగా వచ్చే నికర ఆస్తిని ‘సంపద’గా నివేదిక పేర్కొంది. ఆస్తి, నగదు, ఈక్విటీ, వాణిజ్య ప్రయోజనాలను ‘ఆస్తి’గా లెక్కలోకి తీసుకుంది. ♦ యూరోప్ నుంచి పలువురు సంపన్నులు అమెరికా, కెనడా, న్యూజిలాండ్, కరేబియన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలసపోవడం యూరోప్‌లో సంపద సృష్టికి విఘాతం ఏర్పడింది. దీనితోపాటు 2008 ప్రపంచ ఆర్థిక, హౌసింగ్ సంక్షోభాలు సైతం యూరోప్‌కు ప్రతికూలంగా మారాయి. ఆదాయపు పన్ను రేట్లూ పెరిగాయి. చైనా, భారత్, శ్రీలంక, ఫిలిప్పైన్స్, వియత్నాం వంటి దేశాల్లో పలు రంగాలు ప్రత్యేకించి తయారీ రంగం బలపడుతుండడం పరోక్షంగా యూరోప్‌పై ప్రతికూల ప్రభావం పడింది. ప్రపంచ మార్కెట్లో ఏర్పడిన పోటీలో యూరోపియన్ దేశాలు నిలబడలేకపోయాయి. పలు కంపెనీలు మూతబడ్డాయి. ఉపాధి అవకాశాలు తగ్గాయి. -
4 వేల మంది కోటీశ్వరులు వెళ్లిపోయారు!
న్యూఢిల్లీ: సొమ్ములు దండిగా ఉన్న కోటీశ్వరులు పెద్ద ఎత్తున విదేశాలకు తరలిపోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. ధనికులు పరాయి దేశాలకు తరలిపోతున్న జాబితాలో భారత్ నాలుగు స్థానంలో నిలిచింది. 2015లో మనదేశం నుంచి 4 వేల మంది కుబేరులు విదేశాలకు ఎగిరిపోయారని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది. ఈ నాలుగు వేల మందిలో చాలా మంది పరాయి దేశాల్లోనే స్థిర నివాసం ఏర్పచుకున్నారని పేర్కొంది. ఫ్రాన్స్ నుంచి అత్యధికంగా 10 వేల మంది మిలీయనీర్లు వలస వెళ్లిపోయారని తెలిపింది. తర్వాతి స్థానాల్లో చైనా(9 వేల మంది), ఇటలీ(6 వేల మంది) ఉన్నాయి. ఫ్రాన్స్ లో ముస్లిం, క్రైస్తవ మతఘర్షణలు పెరిగిపోవడంతో ఎక్కువ మంది మిలీయనీర్లు వలస పోతున్నారని అభిప్రాయపడింది. యూరోపియన్ దేశాలయిన బెల్జియం, జర్మనీ, స్వీడన్, బ్రిటన్ లో పెరుగుతున్న మతఘర్షణలు సమీప భవిష్యత్ లో ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వివరించింది. గ్రీస్(3 వేల మంది), రష్యా, బ్రెజిల్, స్పెయిన్(2 వేల మంది) నుంచి కుబేరుల వలసలు పెరుగుతున్నాయి. ఎక్కుమంది కోటీశ్వరులు ఆస్ట్రేలియా(8 వేల మంది), అమెరికా(7 వేల మంది), కెనడా(5 వేలమంది)కు వలస వెళ్లిపోయారు.