4 వేల మంది కోటీశ్వరులు వెళ్లిపోయారు!
న్యూఢిల్లీ: సొమ్ములు దండిగా ఉన్న కోటీశ్వరులు పెద్ద ఎత్తున విదేశాలకు తరలిపోతున్నారని తాజా నివేదిక వెల్లడించింది. ధనికులు పరాయి దేశాలకు తరలిపోతున్న జాబితాలో భారత్ నాలుగు స్థానంలో నిలిచింది. 2015లో మనదేశం నుంచి 4 వేల మంది కుబేరులు విదేశాలకు ఎగిరిపోయారని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక వెల్లడించింది. ఈ నాలుగు వేల మందిలో చాలా మంది పరాయి దేశాల్లోనే స్థిర నివాసం ఏర్పచుకున్నారని పేర్కొంది.
ఫ్రాన్స్ నుంచి అత్యధికంగా 10 వేల మంది మిలీయనీర్లు వలస వెళ్లిపోయారని తెలిపింది. తర్వాతి స్థానాల్లో చైనా(9 వేల మంది), ఇటలీ(6 వేల మంది) ఉన్నాయి. ఫ్రాన్స్ లో ముస్లిం, క్రైస్తవ మతఘర్షణలు పెరిగిపోవడంతో ఎక్కువ మంది మిలీయనీర్లు వలస పోతున్నారని అభిప్రాయపడింది.
యూరోపియన్ దేశాలయిన బెల్జియం, జర్మనీ, స్వీడన్, బ్రిటన్ లో పెరుగుతున్న మతఘర్షణలు సమీప భవిష్యత్ లో ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని వివరించింది. గ్రీస్(3 వేల మంది), రష్యా, బ్రెజిల్, స్పెయిన్(2 వేల మంది) నుంచి కుబేరుల వలసలు పెరుగుతున్నాయి. ఎక్కుమంది కోటీశ్వరులు ఆస్ట్రేలియా(8 వేల మంది), అమెరికా(7 వేల మంది), కెనడా(5 వేలమంది)కు వలస వెళ్లిపోయారు.