భారత్ నుంచి ఏటా వేల సంఖ్యలో మిలియనీర్లు విదేశాలకు తరలిపోతున్నారు. ఈ ఏడాది దాదాపు 4,300 మంది మిలియనీర్లు భారత్‌ను వీడే అవకాశం ఉందని, వీరిలో ఎక్కువ మంది యూఏఈని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నారని అంతర్జాతీయ పెట్టుబడుల వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్టనర్స్ తాజా నివేదిక వెల్లడించింది.
గత ఏడాది ఇదే నివేదిక ప్రకారం 5,100 మంది భారతీయ మిలియనీర్లు విదేశాలకు మకాం మార్చారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ మిలియనీర్ల వలసల విషయంలో చైనా, యూకే తర్వాత ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో ఉంటుందని అంచనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇప్పుడు చైనాను అధిగమించగా, భారతీయ నికర మిలియనీర్లు చైనా కంటే 30 శాతం కంటే తక్కువ.
కొత్త మిలియనీర్లు
భారత్ ప్రతి సంవత్సరం వేలాది మంది మిలియనీర్లను కోల్పోతున్నప్పటికీ దానికంటే ఎక్కువ సంఖ్యలో కొత్త సంపన్నులను తయారు చేస్తూనే ఉందని నివేదిక పేర్కొంది. గత దశాబ్దంలో దేశంలో 85 శాతం సంపద పెరిగినట్లు వెల్లడించింది. ఇలా వెళ్తున్న మిలియనీర్లలో చాలా మంది భారత్‌లో వ్యాపార ప్రయోజనాలు, ఇళ్లను కలిగి ఉన్నారని నివేదిక ఎత్తి చూపింది. ఇది కొనసాగుతున్న ఆర్థిక సంబంధాలను సూచిస్తుంది.
2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా సుమారు 1,28,000 మంది మిలియనీర్లు వలసలు వెళ్తారని భావిస్తున్నారు. వీరికి యూఏఈ, యూఎస్ఏ ఇష్టమైన గమ్యస్థానాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. భద్రత, ఆర్థిక పరిగణనలు, పన్ను ప్రయోజనాలు, పదవీ విరమణ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అనుకూలమైన జీవనశైలి, పిల్లలకు విద్యావకాశాలు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు, మొత్తం జీవన నాణ్యతతో సహా వివిధ కారణాల వల్ల సంపన్న కుటుంబాలు వలస వెళ్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment