దేశం ధనికం.. వ్యక్తులు పేదలు!
♦ టాప్ టెన్ సంపన్న దేశాల్లో
♦ భారత్‌కు 7వ ర్యాంక్
♦ న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక
న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ స్థానం పొందింది. ఏడవ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఇండియాలో మొత్తం సంపద 5,200 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్ అధిక జనాభా వల్లే జాబితాలో స్థానం సంపాదించుకుందని నివేదిక పేర్కొంటోంది. ఇక తలసరి ఆదాయం పరంగా చూస్తే భారతీయులు చాలా పేదరికంలో ఉన్నారు. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం..
♦ ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో అగ్రస్థానంలో అమెరికా ఉంది. ఈ దేశంలోని మొత్తం వ్యక్తుల సంపద 48,700 బిలియన్ డాలర్లు.
♦ అమెరికా తర్వాత వరుసగా చైనా (2వ స్థానం-17,300 బి.డాలర్లు), జపాన్ (3వ స్థానం-15,200 బి.డాలర్లు), జర్మనీ (4వ స్థానం-9,400 బి.డాలర్లు), యూకే (5వ స్థానం-9,200 బి.డాలర్లు) ఉన్నాయి.
♦ వీటి తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్ (6వ స్థానం-7,600 బి. డాలర్లు), ఇటలీ (8వ స్థానం-5,000 బి.డాలర్లు), కెనడా (9వ స్థానం-4,800 బి. డాలర్లు), ఆస్ట్రేలియా (10వ స్థానం-4,500 బి. డాలర్లు) నిలిచాయి.
♦ భారత్‌లో సంపద భారీగా వున్నా, అధిక జనాభాకావడం వల్ల తలసరి సంపద 4,000 డాలర్లకే (రూ. 2.68 లక్షలు) పరిమితమయ్యింది. ఆస్ట్రేలియాలో తలసరి సంపద 2.05 లక్షల డాలర్లు. భారత్‌లో 2015 గణాంకాల ప్రకారం వార్షిక తలసరి ఆదాయం 1,313 డాలర్లే (రూ. 88,000). సంపన్న దేశాల జాబితాలో భారత్‌కు ముందు, వెనుక వున్న ఫ్రాన్స్ (35,600 డాలర్లు), ఇటలీ (23,000 డాలర్లు)ల్లో తలసరి ఆదాయం భారత్‌కంటే బాగా ఎక్కువ. అమెరికాలో ఇది 38,000 డాలర్లు కాగా, చైనాలో 3,865 డాలర్లు.