కొత్తజిల్లాల మార్గదర్శకాలు ప్రకటించాలి
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్
గొల్లపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు, మార్గదర్శకాలు ప్రకటించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కె.నగేశ్ డిమాండ్ చేశారు. గొల్లపల్లిలో ఆదివారం మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం, కేసీఆర్ కుటుంబ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేయడాన్ని ప్రజలు హర్షించరన్నారు. హేతుబద్ధంగా, శాస్త్రీయంగా, ప్రజా అవసరాలను, భవిష్యత్ అభివృద్ధిని, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమండ్ చేశారు.
ఇష్టానుసారంగా జిల్లాలు ఏర్పాటుచేసి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించొద్దని కోరారు. తెలంగాణలో ఇప్పుడు కొత్త జిల్లాలు ఎవరు అడిగారని, ఎందుకు తొందరపడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉన్న పది జిల్లాల్లోనే పరిపాలన సరిగా లేదని విమర్శించారు.
కొత్త జిల్లాలకు అవసరమైన వేల కోట్ల రూపాయలను ఎక్కడి నుంచి తెస్తారో ప్రజలకు తెలుపాలన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చిన వేలాది ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎల్లంకి రమేశ్, నాయకులు ఓరుగంటి జాన్, పస్తం సమ్మయ్య, లక్పత్రెడ్డి పాల్గొన్నారు.