న్యూ అవతార్ గా ఫోర్డ్ ఫియస్టా
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్, తన తర్వాతి తరం ఫియస్టా తయారీలో బిజీ బిజీగా ఉందట. 2017లో జరిగే మోటార్ షోల్లో ఈ బ్రాండ్ ను రివీల్ చేయడానికి సిద్దమవుతోందట. 2018 లో ఈ మోడల్ గ్లోబల్ గా అమ్మకానికి రానుందని తెలుస్తోంది. ఇటీవలే యూరప్ లో ఈ కొత్త ఫియస్టాను టెస్టింగ్ కూడా చేసిందట.
ఈ మోడల్ డిజైన్, ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయంటే..
ఫోర్డ్ ప్రవేశపెట్టబోయే తర్వాతి తరం ఫియస్టా బహుశ పొడవు ఎక్కువ ఉండొచ్చట. ప్రస్తుతమున్న దానికి విభిన్నంగా, విస్తృతంగా రూపొందిస్తున్నారు. ఫోర్డ్స్ కైనెటిక్ 2.0 డిజైన్ ఫిలాసఫీ ఆధారితంగా ఇది తయారవుతుందట. న్యూ గ్రిల్ లుక్ కూడా ప్రస్తుతమున్న దానికంటే చిన్నగా, బిగుతుగా ఉండబోతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కానీ ప్రస్తుతమున్న మోడల్ కు ఈ తర్వాతి తరం ఫియస్టా ఏమాత్రం తీసిపోదంట. ఈ కారు వెనుక భాగంలో ముఖ్యమైన మార్పులే చేయబోతుందట. వెడల్పును పెంచి, వెనుక భాగంలో విండ్ స్క్రీన్ ను పెంచబోతున్నారని తెలుస్తోంది. టైల్ ల్యాంప్స్ చుట్టూ అడ్డంగా వ్రాప్ ను మనం చూడబోతున్నాం.
ఎకో స్పోర్ట్ గా ఈ కారు మార్కెట్లోకి రాబోతుంది. ప్రస్తుతమున్నవెర్షన్ కూడా అదేమాదిరి మార్కెట్లోకి వచ్చింది. ఐదు సార్లు వరుసగా బెస్ట్ స్మాల్ ఇంజెన్ గా నిలిచిన ఫోర్డ్ ఈ వెర్షన్ లో కూడా ప్రస్తుతమున్న ఇంజన్ నే కొనసాగించనుంది. 1.0 లీటర్ మూడు సిలిండర్ల ఎకో బూస్ట్ ను కలిగిఉండనుంది. డిజీల్ పరంగా చూసుకుంటే ఫియస్టాను కొత్త 1.5 లీటర్ ఇంజన్ సామర్థ్యంతో ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోందని తెలుస్తోంది. అయితే ఈ వెహికిల్ ను భారత్ లో ప్రవేశపెడతారా..? అనేదే చర్చనీయాంశం.
ఎప్పుడైతే ఆస్సైర్ కంపాక్ట్ సెడాన్ ను ఫోర్డ్ భారత మార్కెట్లోకి తీసుకొచ్చిందో అప్పటినుంచి ఫియాస్టా సెడాన్ లు ఇండియాలో విఫలమయ్యాయి. కానీ హ్యాచ్ బాక్ స్పేస్ లో దీన్ని ప్రవేశపెడతారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హ్యుందాయ్ ఐ20, ఫోక్స్ వాగన్ పోలో, హోండా జాజ్ వెహికిల్స్ కు పోటీగా దీన్ని తీసుకొస్తారని పేర్కొంటున్నారు.