గుజరాత్ కొత్త సీఎంగా ఆనందీ బెన్ పటేల్ ?
సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అఖండ విజయం సాధించింది. దాంతో ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని పీఠం అధిష్టించనున్నారు. అందుకోసం ఈ నెల 21న గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి మోడీ రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆ రోజే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు అధ్యక్షత వహించేందుకు కొత్త సీఎంను ఎంపిక చేయాలి. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి ఎంపికపై బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు తీవ్రతరం చేసింది.
అందులోభాగంగా ఆ పార్టీ పరిశీలకులు ఇప్పటికే గుజరాత్ చేరుకున్నారు. మోడీ మంత్రి వర్గంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళ మంత్రి ఆనందీ బెన్ పటేల్ ఎంపికపై రాష్ట్ర పరిశీలకులు అటు పార్టీ రాష్ట్ర నాయకులు ఇటు కేంద్ర నాయకులతో చర్చిస్తున్నారు. ఆనందీబెన్ పటేల్‌ను గుజరాత్ సీఎంగా ఎంపిక చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆనందీబెన్ పటేల్ రోడ్లు, భవనాలు, పట్టణాభివృద్ధి, విపత్తు నిర్వహణ మంత్రిగా మోడీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.