హన్సికపై ఫిర్యాదు
అందాల భామ హన్సికకు కోలీవుడ్లో దర్శకుల హీరోయిన్ అనే మంచి పేరుంది. కాల్షీట్స్ టైమ్ కంటే అరగంట ముందే షూటింగ్ స్పాట్లో ఉంటారు. దర్శకుడు చెప్పినట్లు అభినయిస్తారు అనే ప్రసంసలు అందుకున్న హన్సికపై తాజాగా రిమార్క్ పడింది. తన చిత్రానికి కాల్షీట్స్ కేటాయించడం లేదంటూ వాలు చిత్ర నిర్మాత నిక్ ఆర్ట్స్ చక్రవర్తి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు.
ఇంతకు ముందు అజిత్ హీరోగా వాలి, తరువాత సిటిజన్ తదితర చిత్రాలను నిక్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించారు చక్రవర్తి. ఈయన రెండేళ్ల క్రితం శింబు, హన్సిక హీరోహీరోయిన్లుగా వాలు చిత్రాన్ని ప్రారంభించారు. విజయ్ చందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాగా, పాటలు చిత్రీకరణ మినహా చిత్ర షూటింగ్ పూర్తి అయ్యింది.
లవ్ ఎఫెక్ట్
వాలు చిత్ర షూటింగ్ సమయంలోనే శింబు, హన్సికల మధ్య ప్రేమ మొలకెత్తింది. అయితే వాలు చిత్ర షూటింగ్లో మొదలయిన శింబు, హన్సికల మధ్య ప్రేమ ఆ చిత్ర షూటింగ్ పూర్తి కాకముందే ముగిసింది. దీంతో వారిద్దరి మధ్య మనస్పర్థల కారణంగా హన్సిక కాల్షీట్లు ఇవ్వకుండా ఇదిగో.. అదిగో అంటూ దాటవేస్తూ వస్తుండడంతో వాలు చిత్రానికి చిక్కులు ఏర్పడ్డాయి.
దీంతో వాలు చిత్ర నిర్మాత నిక్స్ ఆర్ట్స్ చక్రవర్తి నిర్మాతల మండలిలో నటి హన్సికపై ఫిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ వాలు చిత్రంలో నటించడానికి గాను నటి హన్సికకు 70 లక్షల పారితోషికం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికే 55 లక్షలు ఆమెకు ఇచ్చినట్లు వెల్లడించారు. పాటల చిత్రీకరణ పూర్తి కాగానే మిగిలిన 15 లక్షలు చెల్లిస్తానని అన్నట్లు చెప్పారు.
అయితే హన్సిక కాల్షీట్స్ కేటాయించకుండా కాలయాపన చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. మేలో గానీ జూన్లో గానీ కాల్షీట్స్ ఇస్తానని హన్సిక అంటున్నారని అప్పటి వరకు ఆగితే తనకు పెనునష్టం ఏర్పడుతుందని, ఆమెను వెంటనే కాల్షీట్స్ కేటాయించేలా ఆదేశించాలని నిక్స్ ఆర్ట్స్ చక్రవర్తి ఫిర్యాదులో పేర్కొన్నారు.