కన్నబిడ్డతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది
గోపవరం (నిడదవోలు రూరల్), న్యూస్‌లైన్ : నవమాసాలు మోసి కన్న బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆ తల్లికి జ్యోతిష్యుడు చెప్పిన మాటలు తల్లడిల్లేలా చేశాయి. బిడ్డ నష్టజాతకుడని, కుటుంబ సభ్యులకు అనర్థాలు తప్పవని చెప్పిన మాటలకు తోడు ఆ కుటుంబంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు ఆ మాతృమూర్తి హృదయాన్ని కృంగదీశాయి. నష్ట జాతకుడిగా పేరుపడిన బిడ్డతో పాటు తాను కూడా తనువుచాలించాలని నిర్ణయించుకున్న ఆ తల్లి నాలుగేళ్ల కన్నబిడ్డతో సహా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కాలువలో కొట్టుకుపోతున్న ఆమెను చూసి స్థానికులు రక్షించగా ఆ బాలుడు గల్లంతయ్యాడు.
మానవుడు భూమి నుంచి గ్రహాంతరయానం చేస్తున్న నేటి ఆధునిక యుగంలో జ్యోతిష్యుడి మాటలు విని బిడ్డతో సహా తల్లి ఆత్మహత్యకు యత్నించిన ఈ ఘటన నిడదవోలు మండలం గోపవరం సమీపంలోని మద్దూరు వంతెన వద్ద సోమవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజమండ్రి ఇన్నీస్‌పేటకు చెందిన దుర్గ (22) అనే మహిళ నాలుగేళ్ల కుమారుడు వర్థన్‌తో కలిసి సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో మద్దూరు వంతెన వద్దకు వచ్చింది. ముందుగా రాసుకున్న సూసైడ్ నోట్‌ను, భర్త మాధవ్, వర్ధన్ కలిసి ఉన్న ఫొటోను, హ్యాండ్ బ్యాగ్‌ను వంతెన మధ్యలో ఉన్న ఖానా వద్ద ఉంచి కుమారుడితో సహా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలోకి దూకేసింది. నీటి ప్రవాహానికి దుర్గ ఒడ్డుకు కొట్టుకురాగా అటువైపు వెళుతున్న ఆటో డ్రైవర్ ప్రసాద్, స్థానికుడు కె.బుజ్జి చూసి ఆమెను రక్షించారు. బాలుడు కాలువలో గల్లంతయ్యాడు. ఘటనాస్థలంలో ఆమె ఉంచిన సూసైడ్‌నోట్‌లోని కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్‌కు స్థానికులు సమాచారం అందించారు. కొద్దిసేపటికే అక్కడకు చేరుకున్న దుర్గ బంధువులు బాలుడి కోసం కాలువలో వెతకకుండానే ఆమెను హడావుడిగా ఆటోలో అక్కడి నుంచి తీసుకువెళ్లిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు తొలుత 108 వాహనానికి సమాచారం అందించగా వాహనం వచ్చే సరికి ఆమెను బంధువులు తీసుకువెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
నష్ట జాతకమేనా.. ఇంకేమైనా ఉందా?
కుమారుడు నష్టజాతకుడని జ్యోతిష్యుడు చెప్పడం వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె చెప్పిందని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం నుంచి బయటపడిన అనంతరం ప్రశ్నించగా బిడ్డ పెరిగేకొద్దీ మరిన్ని అరిష్టాలు జరుగుతాయని జ్యోతిష్కుడు చెప్పాడని, ఆ ప్రకారమే కుటుంబంలో ఇటీవల రెండు, మూడు ఘటనలు జరగడంతో ఆందోళనకు గురయ్యానని, దీంతో బిడ్డతో సహా చనిపోవాలనుకున్నట్టు చెప్పిందని స్థానికులు తెలిపారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకేమైనా కారణాలు కూడా ఉండివచ్చని స్థానికులు, పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజమండ్రి ఇన్నీస్‌పేటకు సిబ్బందిని పంపినట్టు సమిశ్రగూడెం పోలీసులు చెప్పారు.