రూ.83.52 లక్షల ఎరువులు, పురుగుమందుల సీజ్
నిడమర్రు: జిల్లాలో రూ.83.52 లక్షల విలువైన పురుగుమందులు, ఎరువులను సీజ్ చేసినట్టు రాష్ట్ర తనిఖీ బృందం కో–ఆర్డినేటర్, శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఉపసంచాలకుడు పి.శివప్రసాద్ తెలిపారు. శుక్రవారం నిడమర్రు మండలంలోని పలు ఎరువులు, పురుగుమందుల దుకాణాలను రాష్ట్ర బృందం తనిఖీ చేసింది. దుకాణాల్లో ఇటీవల తగ్గించిన ధరలకు అమ్మకాలు జరుగుతున్నాయా? బిల్లులపై రైతుల సంతకాలు ఉన్నాయా అనే విషయాలను బృందం పరిశీలించింది. అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ.. ఈనెల 1 నుంచి శుక్రవారం వరుకూ 14 మండలాల్లో తనఖీలు చేపట్టామని, నిబంధనలకు విరుద్ధంగా 19 దుకాణాల్లో ఉన్న రూ.75లక్షల విలువైన ఎరువులు, నాలుగు దుకాణాల్లో ఉన్న రూ.8.42 లక్షల విలువైన పురుగు మందులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ బృదంలో ఏడీఏ ఆర్.శ్రీనివాసరావు, విత్తన పరిశోధన అధికారి వి.ఎల్.కె.వర్మ, ఏవో పి.భాస్కరరావు ఉన్నారు.