Niloufer Cafe
-
హైదరాబాద్‌లో కప్పు చాయ్ రూ.1000.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా మనం ఒక కప్పు టీ కోసం మీరు ఎంత ఖర్చు పెడుతాం. రూ.15, 25 అంతే కదా లేదా ఖరీదైన హోటల్స్‌కి వెళితే 150 నుంచి 300 వరకు రేటు ఉంటుంది. కానీ అక్కడి హోటల్లో మాత్రం ఓ కప్పు టీ రూ.1,000 ఖరీదు ఉందట! అయినా ఈ రేటు విదేశాల్లో అనుకుంటే పొరపాటే. ఇది మన హైదరాబాద్‌లోని నిలోఫర్ కేఫ్‌లోని కప్పు టీ రేటు అంత ఉందంట. అసలు ఆ చాయ్ అంత ఖరీదు ఎందుకంటే..? ఆ కప్పు చాయ్‌కి అంత ధరకి కారణం.. ఆ టీ తయారీకి వాడే టీ పౌడర్ ధర కిలో రూ.75 వేలు ఉంది కాబట్టి. ఇందులో ప్రత్యేకతలు.. ఈ చాయ్‌లో పాలు ఉండవు. దీన్ని తయారీ విధానం వేరుగా ఉంటుంది. ఈ చాయ్ మాల్టీ వాసనతో అద్భుతంగా ఉంటుంది. నిలోఫర్ కేఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ఈ టీ ని గోల్డెన్ టిప్స్ బ్లాక్ టీ అంటారు. మేము ఆ పౌడర్ని అస్సాంలోని మైజాన్‌లో నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసాము. కేవలం 1.5 కిలోలు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, కేఫ్ ఈ టీ రకాన్ని అందించడం ఇదే మొదటిసారి కాదు. గత రెండేళ్లుగా సేవలందిస్తోంది. అసోంలోని మైజాన్ గోల్డెన్ టిప్స్, మాల్టీ వాసనకు ప్రసిద్ధి, దేశంలో అత్యంత ఖరీదైన టీ రకాల్లో ఇదీ ఒకటి. 2019 లో, ఇది గౌహతి టీ వేలం కేంద్రంలో కిలో రూ .70,000 కి విక్రయించి రికార్డు కూడా సృష్టించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో, కోల్‌కతాలో ఒక టీ విక్రేత కూడా ఒక్కో కప్పుకు రూ .1,000 చొప్పున టీ అమ్మడం ప్రారంభించాడు. ఈ రకం టీ దేశంలోనే అత్యంత ఖరీదైన చాయ్‌గా కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ స్ఫెషల్ టీ మా బంజారాహిల్స్ అవుట్‌లెట్‌లో మాత్రమే లభిస్తుందని ఆయన అన్నారు. చదవండి: Pune Woman Dont Want To Beg: ‘నాకు అడుక్కోవాలని లేదు.. పెన్నులు కొనండి చాలు’ -
కెఫే నిలోఫర్ ప్రాసెసింగ్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నిలోఫర్ చాయ్.. బహుశా ఈ పేరు తెలియని హైదరాబాదీయులు ఉండరేమో. భాగ్యనగర వాసులే కాదు విదేశీయులు సైతం ఇక్కడి గరమ్ గరమ్ చాయ్ రుచి చూసినవారే. నాలుగు దశాబ్దాల నిలోఫర్ ప్రస్థానంలో ఇప్పటికే కోటి మందికిపైగా వినియోగదార్ల మనసు చూరగొంది. రెండవ తరం రాకతో సంస్థ విస్తరణ బాట పట్టింది. బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తుల తయారీతో మొదలుకుని ప్రీమియం లాంజ్‌ల ఏర్పాటు, టీ పొడుల విక్రయంలోకి రంగ ప్రవేశం చేసింది. ప్రాసెసింగ్ ప్లాంట్ సైతం నెలకొల్పుతున్నట్టు కెఫే నిలోఫర్ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న ఏబీఆర్ కెఫే అండ్ బేకర్స్ వ్యవస్థాపకులు అనుముల బాబురావు వెల్లడించారు. సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే.. అత్యాధునిక యంత్రాలతో.. తయారీ కేంద్రం కోసం శంషాబాద్ దగ్గరలో తెలంగాణ ప్రభుత్వం ఆరు ఎకరాలను కేటాయించింది. 1,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రోజుకు 30 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న ఈ అత్యాధునిక ప్లాంటుకు రూ.30 కోట్లు పెట్టుబడి చేస్తున్నాం. ఇక్కడ టీ పొడుల ప్రాసెసింగ్ యూనిట్ ఏడాదిలో, డ్రై కేక్స్, బిస్కట్స్ తయారీ కోసం బేకరీ ప్రాసెసింగ్ యూనిట్ æ2023లో అందుబాటులోకి వస్తుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 600 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ఏడాదే నాల్గవ కేంద్రం.. హిమాయత్‌నగర్‌లో ప్రీమియం లాంజ్‌ను డిసెంబరులో ప్రారంభించనున్నాం. 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రానుంది. ఒకేసారి 250 మంది వినియోగదార్లకు సేవలు అందించే వీలుంది. ఈ సెంటర్‌కు 150 మందిని నియమిస్తాం. బంజారాహిల్స్‌లో ఉన్న ప్రీమియం లాంజ్ 2019లో ప్రారంభమైంది. లక్డీకాపూల్‌లో తొలి కెఫేకు సమీపంలోనే రెండవ కేంద్రాన్ని 2016లో ఏర్పాటు చేశాం. మా కెఫేలకు రోజుకు 20,000 మంది కస్టమర్లు వస్తుంటారు. రెండేళ్లలో తెలంగాణలో.. టీ పొడులను మూడు రకాల రుచుల్లో పరిచయం చేశాం. రెండేళ్లలో తెలంగాణ వ్యాప్తంగా ఇవి లభిస్తాయి. రూ.10 మొదలుకుని రూ.650ల ప్యాక్ వరకు తీసుకొచ్చాం. సంస్థ ఆదాయంలో ఆన్లైన్ వాటా 20 శాతం ఉంది. ఆన్లైన్లో బుక్ చేస్తే చాయ్ సైతం ప్రత్యేక బాక్స్ ద్వారా హైదరాబాద్‌లో డెలివరీ చేస్తున్నాం. 300ల రకాల బేకరీ, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. సంస్థలో 250 మంది ఉద్యోగులున్నారు. -
ఆవకాయ బిర్యాని
బిర్యానీ.. ఔర్ ఆరామీ కల్చర్.. హైదరాబాద్ పక్కా అడ్రస్..! నిమ్రా చాయ్.. నిలోఫర్ కేఫ్.. ఇద్దరు వ్యక్తుల జిగ్రీదోస్తానాకు పక్కా పతా! ఆ ఇద్దరిలో ఒకరు పి. బాబూరావు.. ఇంకొకరు.. అబుద్ బిన్ అస్లం.. ఒకరికి సంప్రదాయం ఆవకాయ.. మరొకరి సంస్కృతి బిర్యానీ.. బాబూరావు ఆదిలాబాద్ జిల్లాలోని లగ్గావ్ నుంచి బతుకుదారి వెదుక్కోవడానికి పట్నం వచ్చాడు. అబుద్ బిన్ అస్లం పూర్వీకులది యెమెన్! నలభై ఏళ్ల కిందట ఈ భాగ్యనగరంలో భాగ్యాన్ని వెతుక్కుంటూ వచ్చిన ముసాఫిర్లు.. ఒకరికి ఒకరు పరిచయం లేదు.. బాబూరావు కేరాఫ్ ఫుట్‌పాత్ అయితే.. అబుద్ బిన్ అస్లం ఉండేది పాతబస్తీలోని ఇరుకు గల్లీలో! బట్టల దుకాణంలో రోజువారీ కూలీకి సేల్స్‌మన్‌గా జీవనప్రయాణం మొదలుపెట్టిన బాబూరావు నాలుగేళ్లకు రెడ్‌హిల్స్‌లోని ఓ హోటల్లో సర్వర్ కమ్ మేనేజర్ స్థాయికి వచ్చాడు. అక్కడ అబుద్ బిన్ అస్లంది ఇంచుమించు ఇదే జర్నీ కానీ హోటల్ బిజినెస్ కాదు. రోజులు గడుస్తున్నాయి.. బాబూరావు నిజాయితీ మెచ్చిన యజమాని దావూద్ షరీఫ్ ఆ హోటల్ నడిపించుకోమని బాబూరావుకు రెంటికిచ్చాడు. అలవాటైన వ్యాపారంలో.. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోలేదు. తన తెలివితేటలతో హోటల్‌ను లాభాల బాట పట్టించాడు. బాబూరావు యజమానికి దావూద్ షరీఫ్ అబుద్ బిన్ అస్లంకి స్నేహితుడు. అబుద్ బిన్ అస్లం కూడా రకరకాల వ్యాపారాల్లో కాస్త డబ్బు సంపాదించి ఏదైనా ఒక రంగంలో స్థిరపడాలనుకుంటున్నాడు. ఆ టైమ్‌లోనే మొగల్పురాలో అల్ఖుబా హోటల్‌ను కొన్నాడు. కానీ హోటల్ మేనేజ్మెంట్ ఆయనకు తెలియదు. ఆ విషయాన్నే తన ఫ్రెండ్ దావూద్ షరీఫ్‌తో చెప్పాడు. దావూద్‌కి వెంటనే నీకో మంచి మేనేజర్ని తెచ్చిపెడ్తానని బాబూరావుని పరిచయం చేశాడు. అలా బాబూరావు, అబుద్ బిన్ అస్లం స్నేహితులయ్యారు. అబుద్ బిన్ అల్ఖుబా హోటల్‌ను కొన్నాళ్లు బాబూరావే మేనేజ్ చేశాడు. తర్వాత రెడ్ హిల్స్‌లోని బాబూరావు చూస్తున్న హోటల్‌ను దావూద్ షరీఫ్ అమ్మకానికి పెట్టాడు. అది ఇంకెవరో కొంటే స్నేహితుడు రోడ్డున పడ్తాడని ఆ హోటల్ని అబుద్ కొని దావూద్‌కి తెలియకుండా సగం షేర్ బాబూరావుకిచ్చాడు. ఆ తర్వాత అబుద్ చార్మినార్ దగ్గర్లోని నిమ్రానూ కొన్నాడు. దాని మేనేజ్మెంట్ బాధ్యతలనూ బాబూరావుకే అప్పజెప్పాడు. అక్కడ నిమ్రా.. ఇక్కడ నిలోఫర్ రెండిటినీ లాభాలబాట పట్టించాడు బాబూరావు. తర్వాత కొన్నాళ్లకు నిలోఫర్ మొత్తాన్నీ బాబూరావే కొనేశాడు. కాలంతో వీళ్ల వ్యాపారమే కాదు స్నేహమూ ఎదిగింది. ఆ స్నేహం వారి కుటుంబాలకూ విస్తరించింది. బాబూరావు ఖురాన్ చదివి స్ఫూర్తి పొందుతాడు. బాబురావు స్నేహం అబుద్కి ప్రేరణ. అబుద్ పిల్లలు బాబూరావుని చాచా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. బాబూరావు అబుద్ని సుల్తాన్ భాయ్ అని ప్రేమగా పిలుస్తాడు. ఆ మైత్రీ బంధం.. నిమ్రా చాయ్ చిక్కదనాన్ని.. నిలోఫర్ బిస్కెట్ తియ్యదనాన్ని అద్దుకొని మరింత దృఢపడింది.హైదరాబాద్ గంగాజమునా తెహ్జీబ్ అని ఎవరన్నారో కానీ ఈ ఇద్దరైతే దానికి లివింగ్ ఎగ్జాంపుల్స్‌గా నిలిచారు! మాషా అల్లా యే దోస్తీ ఐసేహీ ఖాయమ్ రహే!! - శరాది ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్