ఆవకాయ బిర్యాని | Aavakaya Biryani very famous in Hyderabad Niloufer Cafe | Sakshi
Sakshi News home page

ఆవకాయ బిర్యాని

Published Sun, Aug 3 2014 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 11:17 AM

ఆవకాయ బిర్యాని

ఆవకాయ బిర్యాని

బిర్యానీ.. ఔర్ ఆరామీ కల్చర్.. హైదరాబాద్ పక్కా అడ్రస్..! నిమ్రా చాయ్.. నిలోఫర్  కేఫ్.. ఇద్దరు వ్యక్తుల జిగ్రీదోస్తానాకు పక్కా పతా! ఆ ఇద్దరిలో ఒకరు పి. బాబూరావు.. ఇంకొకరు.. అబుద్ బిన్ అస్లం.. ఒకరికి సంప్రదాయం ఆవకాయ.. మరొకరి సంస్కృతి బిర్యానీ.. బాబూరావు ఆదిలాబాద్ జిల్లాలోని లగ్గావ్ నుంచి బతుకుదారి వెదుక్కోవడానికి పట్నం వచ్చాడు. అబుద్ బిన్ అస్లం పూర్వీకులది యెమెన్! నలభై ఏళ్ల కిందట ఈ భాగ్యనగరంలో భాగ్యాన్ని వెతుక్కుంటూ వచ్చిన ముసాఫిర్లు..
 
 ఒకరికి ఒకరు పరిచయం లేదు.. బాబూరావు కేరాఫ్ ఫుట్‌పాత్ అయితే.. అబుద్ బిన్ అస్లం ఉండేది పాతబస్తీలోని ఇరుకు గల్లీలో! బట్టల దుకాణంలో రోజువారీ కూలీకి సేల్స్‌మన్‌గా జీవనప్రయాణం మొదలుపెట్టిన బాబూరావు నాలుగేళ్లకు రెడ్‌హిల్స్‌లోని ఓ హోటల్‌లో సర్వర్ కమ్ మేనేజర్ స్థాయికి వచ్చాడు. అక్కడ అబుద్ బిన్ అస్లంది ఇంచుమించు ఇదే జర్నీ కానీ హోటల్ బిజినెస్ కాదు.
 
 రోజులు గడుస్తున్నాయి.. బాబూరావు నిజాయితీ మెచ్చిన యజమాని దావూద్ షరీఫ్ ఆ హోటల్ నడిపించుకోమని బాబూరావుకు రెంటికిచ్చాడు. అలవాటైన వ్యాపారంలో.. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోలేదు. తన తెలివితేటలతో హోటల్‌ను లాభాల బాట పట్టించాడు. బాబూరావు యజమానికి దావూద్ షరీఫ్ అబుద్ బిన్ అస్లంకి స్నేహితుడు. అబుద్ బిన్ అస్లం కూడా రకరకాల వ్యాపారాల్లో  కాస్త డబ్బు సంపాదించి ఏదైనా ఒక రంగంలో స్థిరపడాలనుకుంటున్నాడు.
 
  ఆ టైమ్‌లోనే మొగల్‌పురాలో అల్‌ఖుబా హోటల్‌ను కొన్నాడు. కానీ హోటల్ మేనేజ్‌మెంట్ ఆయనకు తెలియదు. ఆ విషయాన్నే తన ఫ్రెండ్ దావూద్ షరీఫ్‌తో చెప్పాడు. దావూద్‌కి వెంటనే నీకో మంచి మేనేజర్‌ని తెచ్చిపెడ్తానని బాబూరావుని పరిచయం చేశాడు. అలా బాబూరావు, అబుద్ బిన్ అస్లం స్నేహితులయ్యారు. అబుద్ బిన్ అల్‌ఖుబా హోటల్‌ను కొన్నాళ్లు బాబూరావే మేనేజ్ చేశాడు. తర్వాత రెడ్ హిల్స్‌లోని బాబూరావు చూస్తున్న హోటల్‌ను దావూద్ షరీఫ్ అమ్మకానికి పెట్టాడు. అది ఇంకెవరో కొంటే స్నేహితుడు రోడ్డున పడ్తాడని ఆ హోటల్‌ని అబుద్ కొని దావూద్‌కి తెలియకుండా సగం షేర్ బాబూరావుకిచ్చాడు. ఆ తర్వాత అబుద్ చార్మినార్ దగ్గర్లోని నిమ్రానూ కొన్నాడు.
 
 దాని మేనేజ్‌మెంట్ బాధ్యతలనూ బాబూరావుకే అప్పజెప్పాడు. అక్కడ నిమ్రా.. ఇక్కడ నిలోఫర్ రెండిటినీ లాభాలబాట పట్టించాడు బాబూరావు. తర్వాత కొన్నాళ్లకు నిలోఫర్ మొత్తాన్నీ బాబూరావే కొనేశాడు. కాలంతో వీళ్ల వ్యాపారమే కాదు స్నేహమూ ఎదిగింది. ఆ స్నేహం వారి కుటుంబాలకూ విస్తరించింది. బాబూరావు ఖురాన్ చదివి స్ఫూర్తి పొందుతాడు. బాబురావు స్నేహం అబుద్‌కి ప్రేరణ. అబుద్ పిల్లలు బాబూరావుని చాచా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. బాబూరావు అబుద్‌ని సుల్తాన్ భాయ్ అని ప్రేమగా పిలుస్తాడు. ఆ మైత్రీ బంధం.. నిమ్రా చాయ్ చిక్కదనాన్ని.. నిలోఫర్ బిస్కెట్ తియ్యదనాన్ని అద్దుకొని మరింత దృఢపడింది.హైదరాబాద్ గంగాజమునా తెహ్‌జీబ్ అని ఎవరన్నారో కానీ ఈ ఇద్దరైతే దానికి లివింగ్ ఎగ్జాంపుల్స్‌గా నిలిచారు! మాషా అల్లా యే దోస్తీ ఐసేహీ ఖాయమ్ రహే!!
 - శరాది
 ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement