Saradhi
-
ఆయన నవ్వు చాలామందికి స్ఫూర్తి – కృష్ణంరాజు
‘‘సారధితో నాది 50 ఏళ్ల స్నేహం. హీరో అవుదామని ఇండస్ట్రీకొచ్చి హాస్య నటుడయ్యారు. ఆయన నవ్వులో ప్రత్యేకత ఉంది. అదే ఆయన్ను హాస్య నటుణ్ణి చేసింది. ఆ నవ్వు చాలామందికి స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచింది. సారధిగారు ఇలాగే నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి’’ అని నటుడు కృష్ణంరాజు అన్నారు. ప్రముఖ నటులు కె.జె సారధిపై రచయిత, చిత్రకారుడు రాంపా రచించిన ‘సినీ స్వర్ణయుగంలో సారధి’ పుస్తకాన్ని కృష్ణంరాజు ఆవిష్కరించగా, రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు స్వీకరించారు. ఈ పుస్తకాన్ని కృష్ణంరాజుకు అంకితమిచ్చారు రాంపా. సారధి మాట్లాడుతూ– ‘‘ఏమీ లేకుండా చిత్రపరిశ్రమకు వచ్చి ఇంతటివాడినయ్యా. 378 సినిమాల్లో నటించా. ఈ స్థానంలో ఉన్నానంటే కారణం ప్రేక్షకులే. ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు, నాగేశ్వరరావు, రేలంగి, కృష్ణ, చిరంజీవిలతో నటించా. వెంకటేశ్ ‘గణేష్’ చిత్రం తర్వాత సినిమాలు చేయలేదు. కృష్ణంరాజు ‘భక్తకన్నప్ప’ నా జీవితాన్నే మార్చేసింది. తర్వాత చాలా మంచి పాత్రలతో ప్రేక్షకులను అలరించాను’’ అన్నారు. ‘‘సారధి, ప్రభాకర్‌రెడ్డిగారి కృషి వల్లే చిత్రపురి కాలనీ ఏర్పాటైంది’’ అన్నారు పరుచూరి వెంకటేశ్వరరావు. నటుడు గిరిబాబు. కృష్ణంరాజు సతీమణి శ్యామల, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, నిర్మాత సురేశ్‌కొండేటి పాల్గొన్నారు. -
సంతసం
సంతా మా ఊరి సంత. వారానికోసారి జోరుగా సాగే ఈ సంత... ఇప్పుడు సిటీ కాలనీల్లోనూ హుషారుగా కొనసాగుతోంది. సూపర్ మార్కెట్లోని గాజుతొట్టెల్లో వాడిపోయి ముఖం వేలాడేసి కనిపించే కూర గాయలకంటే... తాజాదనాన్ని ఇళ్ల నడుమకే మోసుకొచ్చే వారాంతపు మార్కెట్లంటేనే జనం మోజు పడుతున్నారు. ప్రైస్ అటుఇటుగా ఉన్నా ఫ్రెష్‌గా దొరుకుతుండటంతో.. ఈ అంగళ్లవైపే అడుగులు వేస్తున్నారు! - శరాది హైదరాబాద్.. మెట్రో, వాల్‌మార్ట్, క్యూ మార్ట్, స్పెన్సర్స్, బిగ్ బజార్, మోర్ మార్కెట్స్వంటి హంగుల హబ్! అంతర్జాతీయ అంగడికి అద్దం ఇది. గుండు సూది నుంచి గూడుకు కావల్సిన ఫర్నిచర్దాకా అన్నిటినీ ఒక్క చోటే కొలువుదీర్చే ఈ బిగ్ బజార్ల చుట్టూ పట్నవాసులు బాగానే క్యూ కట్టారు కొత్తలో! ఆ వరుసకి సందు చివర మార్కెట్లు.. పచారీ కొట్లు చిన్నబుచ్చుకున్నాయి! ఇప్పుడా పరాయి కల్చర్ పస తగ్గింది. మన సొంత సంతల సంస్కృతి పట్నాల గల్లీల్లో పరుచుకుంటోంది! ఇప్పుడు వారాంతపు అంగళ్లు సిటీ ఇళ్ల అరుగులను ఆక్రమిస్తున్నాయి. పల్లె శోభను పట్నానికి తెస్తున్నాయి! గుండుసూది నుంచి గొంగళ్ల దాకా.. వెజిటబుల్స్తోపాటు ఇతర వస్తువులనూ పేర్చడంలో సూపర్మార్కెట్లకు, మాల్స్కేమీ తీసిపోవు ఈ అంగళ్లు. తాజా కూరగాయలు, ఎండు చేపలు, రొయ్యలు, సీజన్లో దొరికే పళ్లు, అన్ని కాలాల్లో కనిపించే డ్రై ఫ్రూట్స్ ఓ వైపు నోరూరిస్తుంటే గుండు సూదుల నుంచి మొహాన్ని మెరిపించే అద్దాలు, దువ్వెన్లు, బొట్టు, కాటుక, పౌడర్, పెర్ఫ్యూమ్స్, చెంప పిన్నులు, జడ రబ్బర్లు, సవరాలు, చీరలు, రవికెలు మొదలు దుప్పట్లు ఆఖరుకు పల్లెలకే పరిమితమైన గొంగళ్లు సైతం సంతను ఆక్రమిస్తున్నాయి. ఇంకోవైపు ప్లాస్టిక్ మగ్గులు మొదలు టబ్బులు, బకెట్లు, డ్రమ్ముల నుంచి స్టీలు బిందెలు, గిన్నెలు, పింగాణి, గృహ అలంకరణ వస్తువులు ఆకర్షిస్తున్నాయి. ఇంటికి దగ్గరగా అగ్గువ ధరకే దొరుకుతూ... డబ్బుతోపాటు సమయాన్నీ ఆదా చేస్తున్నాయి. చిక్కడపల్లి నుంచి కూకట్పల్లిదాకా.. ఆదివారం నుంచి శనివారం దాకా.. చిక్కడపల్లి నుంచి కూకట్పల్లి దాకా.. మౌలాలి నుంచి గచ్చిబౌలి వరకు.. రోజుకో వాడన వెలుస్తున్నాయి. ‘మా దగ్గర (చిక్కడపల్లి) బుధవారం ఈ అంగడొస్తది. మాలాంటి మిడిల్‌క్లాస్ వాళ్లకు ఇట్లాంటివి ఎంతో ఉపయోగం. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ల ఊర్లో చూస్తుంటిమి ఈ అంగళ్లను. సిటీలనే పుట్టిపెరిగిన మాకు అవి మంచి జ్ఞాపకాలు. ఓ పదేళ్ల కిందటొచ్చిన ఈ మాల్స్ వాటిని మరిపించినయ్. మళ్లీ ఇట్లా మా గల్లీలకే రావడం.. మస్తు సంతోషంగా ఉంది. మాల్స్లల్ల తాజా కూరగాయలే కాదు.. ధరలూ అందుబాటులో ఉండవ్. ఇక్కడ అట్లా కాదు.. ఆకు కూరలదగ్గర్నుంచి అన్నీ తాజాగా దొరుకుతయి... అదీ మా బడ్జెట్‌కి అనుగుణంగా. అక్కడ రెండువందల రూపాయలకు నాలుగు రోజుల కూరగాయలు దొరికితే ఇక్కడ రూ.100కు ఆరు రోజుల కూరలు దొరుకుతాయి. మళ్లీ ఆటో చార్జీలుండవ్’ అంటుంది ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కొండ రాజ్యలక్ష్మి. అయితే చిక్కడపల్లికి కాస్త దూరంలో ఉన్న నల్లకుంట రెగ్యులర్ మార్కెట్లో ఆకుకూరల దుకాణమున్న రవి మాట్లాడుతూ ‘వారానికోరోజు వాడలల్ల అంగళ్లొచ్చి మా గిరాకీని దెబ్బకొడ్తున్నయ్.సిటీ చుట్టుపక్కల ఊర్లనుంచి కూరగాయలు తెస్తరు.. చాలా మటుకు రైతులుంటరు. తక్కువ ధరకే ఇస్తరు. మేమేమో మారు బేరగాళ్లం. మాకు అంత తక్కువ ధరకు పడయ్. గందుకే మా దగ్గర రేట్ ఎక్కువని వస్తలేరు’ అని వాపోయాడు. బెడదలేదు... ‘మాది జాయింట్ ఫ్యామిలీ. ఇద్దరు కొడుకులు, కోడళ్లు.. అందరూ ఉదయం లేవగానే ఆఫీస్‌కి వెళ్లేవాళ్లే. శని, ఆదివారాలు వచ్చాయంటే రెస్ట్ తీసుకుంటారు. మార్కెట్‌కో, మాల్స్కో వెళ్లి కూరగాయలు తెచ్చే ఓపిక ఎవరికీ ఉండదు. ఆ బాధ్యత నాదే. ఇన్నాళ్లు మా ఏరియాకు ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతు బజార్కెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఒక్కదాన్నే అన్నన్ని కూరగాయలు మోస్తూ ఆటోచార్జీలు భరిస్తూ తెచ్చుకోవడం భలే కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ బాధ లేదు. మా ఏరియాలో ఎవ్రీ ఫ్రైడే సంతొస్తోంది గుమ్మం ముందుకే. ఎవరి హెల్ప్ లేకుండా ఎంచక్కా ఇంటిల్లిపాదికి కావల్సిన కూరలు, పళ్లూ తెచ్చిపడేస్తున్నాను. ఇంట్లోకి అవసరమైన చిన్న చిన్న స్టీల్ సామాను, పూజ సామగ్రీ దొరుకుతుండడంతో బెడదనిపించడంలేదు. ఎక్కువెక్కువ మోసుకెళ్లకుండా హాయిగా రెండు మూడు ట్రిప్పుల్లో తీసుకెళ్తా’ వివరించారు మోతీనగర్కి చెందిన చల్లపల్లి పార్వతి. మంచి డిమాండ్.. మోతీనగర్ వాడసంతలో పూలమ్మె సాలమ్మ ‘పెద్దపెద్ద మార్కెట్లలో మాకు జాగుండదు. మారుబేరానికి కావల్సిన పెట్టుబడీ మా దగ్గర లేదు. కాబట్టి ఇలాంటి అంగట్ల మాకు మంచి డిమాండ్’ అని స్పందించింది. ఫోర్ టు టెన్.. వరకుసాగే ఈ అంగళ్లల్లో వీథి లైట్లు సరిగ్గా లేక మసక చీకటి అటు వ్యాపారస్తులను ఇటు కొనుగోలు దారులను ఇబ్బంది పెట్టేది మొన్నటిదాకా. ‘నెస్సెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అన్నట్టుగా.. ఈ ఇబ్బందిని తొలగించడానికి బ్యాటరీ లైట్స్‌ను అద్దెకిచ్చే వ్యాపారమూ జోరందుకుంది అన్నిచోట్లా. మార్కెట్ మొదలవగానే ఈ లైట్లను ఇచ్చి మార్కెట్ ముగియగానే తీసుకెళ్తారు. ఆరుగంటలకు పది రూపాయలు అద్దె వసూలు చేస్తున్నారు. తాజా కూరలు.. సరసమైన ధరలు.. గుమ్మం ముందే దుకాణం.. ఎగువ, దిగువ, మధ్యతరగతివాళ్లకు ఇంతకన్నా అనుకూలం ఇంకేముంటుంది! అయితే బంజారాహిల్స్ లాంటి పోష్ లొకాటీల్లోనే ముందు ఈ సంతలు దర్శనమివ్వడం కొసమెరుపు! -
ఏలే డిజైనర్!
లక్ష్మణ్ ఏలే. కుంచె గురించి కొంచెమైనా తెలిసినవారికి పరిచయం అక్కరలేని చిత్రకారుడు. అయినా ఇంకొంచెం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే.. డిజైనింగ్‌లోనూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అంతా ఇంతా కాదు, చరిత్రలో నిలిచిపోయేలా. ఆ కుంచె చేసే విన్యాసం తెలియందెవరికి! ముంబైలోని ప్రతిష్టాత్మకమైన జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ కూడా ఆయన బొమ్మల కొలువు పెట్టింది. ఈ మధ్య ఆయన బొమ్మలతో కన్నా లోగోలతో బాగా ఫేమస్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి రూపు ఇచ్చారు. తాజాగా రాష్ట్ర పోలీస్ కోసం లోగో డిజైన్ చేసి తన ప్రతిభను మరోసారి చాటి చెప్పారు. ఆర్టిస్టులు ఎట్లా చేస్తారు లోగోలు? అది డిజైనర్స్ పనికదా... ఆయనకేం అర్హతుంది.. అనే విమర్శలే చాలా వినిపించాయి. దానికి ఏలే లక్ష్మణ్ చెప్పే సమాధానం ఒకటే! ‘ఆర్టిస్టు అనే పదం చాలా విస్తృతమైంది. అందులో పెయింటర్, డిజైనర్ అనే పదాలూ కలుస్తాయి.’ ఇంకా ‘నేను బేసిక్‌గా జర్నలిస్ట్‌ని, టెక్స్టైల్ డిజైనర్‌ని. ఎన్నో సినిమాలకు పబ్లిసిటీ డిజైనర్‌గా పనిచేశాను. లోగోలు చేశాను. కాబట్టి ఆ విమర్శలకు నా ట్రాక్ రికార్డే జవాబు’ అని అంటున్నాడు. తెలంగాణ ఆర్ట్ చరిత్రను రికార్డ్ చేయడం కోసం ‘ఆర్ట్ ఎట్ తెలంగాణ’ ప్రాజెక్ట్ చేపట్టాడు. ఆ పని మీదే తరచూ తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు పాపారావును కలుస్తుండేవాడు. ఒకరోజు. ‘ స్టేట్ లోగోల గురించి చాలా డిజైన్స్ వస్తున్నాయి కదా.. మీరూ నాలుగైదు డిజైన్లు చేయండి’ అన్నారు ఫోన్లో పాపారావు. అట్లా రాష్ట్ర లోగో చేసే అవకాశం అనుకోకుండా రావడం, ఆయన చేసిన లోగోను సీఎం కేసీఆర్ కొన్ని మార్పులు చేర్పులతో ఆమోదించడమూ జరిగిపోయింది. పోలీస్ లోగో.. ఎలాగంటే! ఒకరోజు సాయంత్రం కుటుంబంతో కలసి ఏదో ఫంక్షన్‌కి వెళ్లడానికి లక్ష్మణ్ రెడీ అవుతుండగా డీజీపీ ఆఫీస్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. వెళ్లి అనురాగ్‌శర్మను కలవగా ‘పోలీస్‌లోగో కూడా మీరే చేయాలి. మీతోనే చేయించమని సీఎం చెప్పారు కాబట్టి ఆ పనిలో ఉండండి’ అని చెప్పారు. ఈ లోగో రూపకల్పనలో ఆస్కీవాళ్లూ ఇన్వాల్వ్ అయ్యారు. హానర్, డ్యూటీ, కంపాషన్ లాంటివి ఆరు పాయింట్లను సూచించారు. ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్, ఆస్కీవారు డిస్కస్ చేసి వాటిని మూడింటికి కుదించారు. వాటిని లక్ష్మణ్ సింబలైజ్ చేస్తూ ఓ డిజైన్నిచ్చాడు. డే అండ్ నైట్, రౌండ్ ది క్లాక్ పోలీసులు పనిచేస్తారనే అర్థమొచ్చేటట్టు షీల్డ్‌ని, ఇతరాలకూ ఆయన ఓ రూపమిచ్చాడు. బ్లూ, రెడ్, గోల్డ్ కలర్లనూ ఇచ్చి ప్రతి కలర్‌కూ ఓ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అంతేకాదు లోగోకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికి వర్ణన, వివరణ ఇస్తూ లాజిక్ ఆఫ్ లోగో అనే కాన్సెప్ట్‌నూ తయారు చేశాడు. పోలీస్ డిపార్ట్మెంట్ సలహాలు, సూచనలను సమన్వయపరుస్తూ ఓ రెండు లోగోలు తయారు చేశాడు లక్ష్మణ్. మిగిలిన వాళ్లూ పంపించిన దాంట్లోంచి కొన్నింటిని తీసి మొత్తం పది లోగోలను ఎంపిక చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అందులోంచి మళ్లీ మూడింటిని ఫైనల్ చేసి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి పంపించారు. ఆ మూడింట్లో రెండు లక్ష్మణ్‌వే. వాటిల్లోంచి లక్ష్మణ్ ఏలే చేసిన ప్రస్తుత లోగోనే పోలీస్ అధికారిక లోగోగా ఎంపికైంది. ఇదీ పోలీస్ లోగో కథ! కొసమెరుపు ఏంటంటే.. కేసీఆర్ సెలెక్ట్ చేసే వరకు ఆయనకు తెలియదు ఆ లోగో లక్ష్మణ్ ఏలే చేసినట్టు! ‘ఓ పొయెట్ పోయెమ్‌కి బొమ్మ వేసినట్టుగానే ఆ రెండు లోగోలను డిజైన్ చేశాను. వీటికి ఇంత రెస్పాన్స్ ఉంటదని, వాటితో నాకింత హానర్ వస్తుందని తెలియదు. కేసీఆర్‌కు మంచి విజువల్ సెన్స్ ఉండడం.. ఆయన చేసిన సూచనలు ఆ లోగో పర్ఫెక్ట్గా రావడానికి హెల్ప్ చేసింది. నేను ఈ లోగోలతో మొత్తం తెలంగాణ ప్రజలకూ తెలిశాను. ఇది నాకు డిఫరెంట్ ఎక్స్పోజర్. చాలా సంతోషంగా ఉంది.’ అని చెబుతున్నాడు లక్ష్మణ్ ఏలే! - శరాది -
ఆవకాయ బిర్యాని
బిర్యానీ.. ఔర్ ఆరామీ కల్చర్.. హైదరాబాద్ పక్కా అడ్రస్..! నిమ్రా చాయ్.. నిలోఫర్ కేఫ్.. ఇద్దరు వ్యక్తుల జిగ్రీదోస్తానాకు పక్కా పతా! ఆ ఇద్దరిలో ఒకరు పి. బాబూరావు.. ఇంకొకరు.. అబుద్ బిన్ అస్లం.. ఒకరికి సంప్రదాయం ఆవకాయ.. మరొకరి సంస్కృతి బిర్యానీ.. బాబూరావు ఆదిలాబాద్ జిల్లాలోని లగ్గావ్ నుంచి బతుకుదారి వెదుక్కోవడానికి పట్నం వచ్చాడు. అబుద్ బిన్ అస్లం పూర్వీకులది యెమెన్! నలభై ఏళ్ల కిందట ఈ భాగ్యనగరంలో భాగ్యాన్ని వెతుక్కుంటూ వచ్చిన ముసాఫిర్లు.. ఒకరికి ఒకరు పరిచయం లేదు.. బాబూరావు కేరాఫ్ ఫుట్‌పాత్ అయితే.. అబుద్ బిన్ అస్లం ఉండేది పాతబస్తీలోని ఇరుకు గల్లీలో! బట్టల దుకాణంలో రోజువారీ కూలీకి సేల్స్‌మన్‌గా జీవనప్రయాణం మొదలుపెట్టిన బాబూరావు నాలుగేళ్లకు రెడ్‌హిల్స్‌లోని ఓ హోటల్లో సర్వర్ కమ్ మేనేజర్ స్థాయికి వచ్చాడు. అక్కడ అబుద్ బిన్ అస్లంది ఇంచుమించు ఇదే జర్నీ కానీ హోటల్ బిజినెస్ కాదు. రోజులు గడుస్తున్నాయి.. బాబూరావు నిజాయితీ మెచ్చిన యజమాని దావూద్ షరీఫ్ ఆ హోటల్ నడిపించుకోమని బాబూరావుకు రెంటికిచ్చాడు. అలవాటైన వ్యాపారంలో.. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోలేదు. తన తెలివితేటలతో హోటల్‌ను లాభాల బాట పట్టించాడు. బాబూరావు యజమానికి దావూద్ షరీఫ్ అబుద్ బిన్ అస్లంకి స్నేహితుడు. అబుద్ బిన్ అస్లం కూడా రకరకాల వ్యాపారాల్లో కాస్త డబ్బు సంపాదించి ఏదైనా ఒక రంగంలో స్థిరపడాలనుకుంటున్నాడు. ఆ టైమ్‌లోనే మొగల్పురాలో అల్ఖుబా హోటల్‌ను కొన్నాడు. కానీ హోటల్ మేనేజ్మెంట్ ఆయనకు తెలియదు. ఆ విషయాన్నే తన ఫ్రెండ్ దావూద్ షరీఫ్‌తో చెప్పాడు. దావూద్‌కి వెంటనే నీకో మంచి మేనేజర్ని తెచ్చిపెడ్తానని బాబూరావుని పరిచయం చేశాడు. అలా బాబూరావు, అబుద్ బిన్ అస్లం స్నేహితులయ్యారు. అబుద్ బిన్ అల్ఖుబా హోటల్‌ను కొన్నాళ్లు బాబూరావే మేనేజ్ చేశాడు. తర్వాత రెడ్ హిల్స్‌లోని బాబూరావు చూస్తున్న హోటల్‌ను దావూద్ షరీఫ్ అమ్మకానికి పెట్టాడు. అది ఇంకెవరో కొంటే స్నేహితుడు రోడ్డున పడ్తాడని ఆ హోటల్ని అబుద్ కొని దావూద్‌కి తెలియకుండా సగం షేర్ బాబూరావుకిచ్చాడు. ఆ తర్వాత అబుద్ చార్మినార్ దగ్గర్లోని నిమ్రానూ కొన్నాడు. దాని మేనేజ్మెంట్ బాధ్యతలనూ బాబూరావుకే అప్పజెప్పాడు. అక్కడ నిమ్రా.. ఇక్కడ నిలోఫర్ రెండిటినీ లాభాలబాట పట్టించాడు బాబూరావు. తర్వాత కొన్నాళ్లకు నిలోఫర్ మొత్తాన్నీ బాబూరావే కొనేశాడు. కాలంతో వీళ్ల వ్యాపారమే కాదు స్నేహమూ ఎదిగింది. ఆ స్నేహం వారి కుటుంబాలకూ విస్తరించింది. బాబూరావు ఖురాన్ చదివి స్ఫూర్తి పొందుతాడు. బాబురావు స్నేహం అబుద్కి ప్రేరణ. అబుద్ పిల్లలు బాబూరావుని చాచా అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. బాబూరావు అబుద్ని సుల్తాన్ భాయ్ అని ప్రేమగా పిలుస్తాడు. ఆ మైత్రీ బంధం.. నిమ్రా చాయ్ చిక్కదనాన్ని.. నిలోఫర్ బిస్కెట్ తియ్యదనాన్ని అద్దుకొని మరింత దృఢపడింది.హైదరాబాద్ గంగాజమునా తెహ్జీబ్ అని ఎవరన్నారో కానీ ఈ ఇద్దరైతే దానికి లివింగ్ ఎగ్జాంపుల్స్‌గా నిలిచారు! మాషా అల్లా యే దోస్తీ ఐసేహీ ఖాయమ్ రహే!! - శరాది ఫొటోలు: ఎస్.ఎస్. ఠాకూర్