సంతసం | People are very interested to buy from super market | Sakshi
Sakshi News home page

సంతసం

Published Tue, Mar 17 2015 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 10:56 PM

సంతసం

సంతసం

సంతా మా ఊరి సంత. వారానికోసారి జోరుగా సాగే ఈ సంత... ఇప్పుడు సిటీ కాలనీల్లోనూ హుషారుగా కొనసాగుతోంది.  సూపర్‌ మార్కెట్‌లోని గాజుతొట్టెల్లో వాడిపోయి ముఖం వేలాడేసి కనిపించే కూర గాయలకంటే... తాజాదనాన్ని ఇళ్ల నడుమకే మోసుకొచ్చే వారాంతపు మార్కెట్లంటేనే జనం మోజు పడుతున్నారు. ప్రైస్ అటుఇటుగా ఉన్నా ఫ్రెష్‌గా దొరుకుతుండటంతో.. ఈ అంగళ్లవైపే అడుగులు వేస్తున్నారు!
 - శరాది
 
 హైదరాబాద్.. మెట్రో, వాల్‌మార్ట్, క్యూ మార్ట్, స్పెన్సర్స్, బిగ్ బజార్, మోర్ మార్కెట్స్‌వంటి హంగుల హబ్! అంతర్జాతీయ అంగడికి అద్దం ఇది. గుండు సూది నుంచి గూడుకు కావల్సిన ఫర్నిచర్‌దాకా అన్నిటినీ ఒక్క చోటే కొలువుదీర్చే ఈ బిగ్ బజార్ల చుట్టూ పట్నవాసులు బాగానే క్యూ కట్టారు కొత్తలో! ఆ వరుసకి సందు చివర మార్కెట్లు.. పచారీ కొట్లు చిన్నబుచ్చుకున్నాయి! ఇప్పుడా పరాయి కల్చర్ పస తగ్గింది. మన సొంత సంతల సంస్కృతి పట్నాల గల్లీల్లో పరుచుకుంటోంది! ఇప్పుడు వారాంతపు అంగళ్లు సిటీ ఇళ్ల అరుగులను ఆక్రమిస్తున్నాయి. పల్లె శోభను పట్నానికి తెస్తున్నాయి!
 
 గుండుసూది నుంచి గొంగళ్ల దాకా..
 వెజిటబుల్స్‌తోపాటు ఇతర వస్తువులనూ పేర్చడంలో సూపర్‌మార్కెట్లకు, మాల్స్‌కేమీ తీసిపోవు ఈ అంగళ్లు. తాజా కూరగాయలు, ఎండు చేపలు, రొయ్యలు, సీజన్లో దొరికే పళ్లు, అన్ని కాలాల్లో కనిపించే డ్రై ఫ్రూట్స్ ఓ వైపు నోరూరిస్తుంటే గుండు సూదుల నుంచి మొహాన్ని మెరిపించే అద్దాలు, దువ్వెన్లు, బొట్టు, కాటుక, పౌడర్, పెర్‌ఫ్యూమ్స్, చెంప పిన్నులు, జడ రబ్బర్లు, సవరాలు, చీరలు, రవికెలు మొదలు దుప్పట్లు ఆఖరుకు పల్లెలకే పరిమితమైన గొంగళ్లు సైతం సంతను ఆక్రమిస్తున్నాయి. ఇంకోవైపు ప్లాస్టిక్ మగ్గులు మొదలు టబ్బులు, బకెట్లు, డ్రమ్ముల నుంచి స్టీలు బిందెలు, గిన్నెలు, పింగాణి, గృహ అలంకరణ వస్తువులు ఆకర్షిస్తున్నాయి. ఇంటికి దగ్గరగా అగ్గువ ధరకే దొరుకుతూ... డబ్బుతోపాటు సమయాన్నీ ఆదా చేస్తున్నాయి.
 
 చిక్కడపల్లి నుంచి కూకట్‌పల్లిదాకా..
 ఆదివారం నుంచి శనివారం దాకా.. చిక్కడపల్లి నుంచి కూకట్‌పల్లి దాకా.. మౌలాలి నుంచి గచ్చిబౌలి వరకు.. రోజుకో వాడన వెలుస్తున్నాయి. ‘మా దగ్గర (చిక్కడపల్లి) బుధవారం ఈ అంగడొస్తది. మాలాంటి మిడిల్‌క్లాస్ వాళ్లకు ఇట్లాంటివి ఎంతో ఉపయోగం. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ల ఊర్లో చూస్తుంటిమి ఈ అంగళ్లను. సిటీలనే పుట్టిపెరిగిన మాకు అవి మంచి జ్ఞాపకాలు. ఓ పదేళ్ల కిందటొచ్చిన ఈ మాల్స్ వాటిని మరిపించినయ్. మళ్లీ ఇట్లా మా గల్లీలకే రావడం.. మస్తు సంతోషంగా ఉంది.
 
 మాల్స్‌లల్ల తాజా కూరగాయలే కాదు.. ధరలూ అందుబాటులో ఉండవ్. ఇక్కడ అట్లా కాదు.. ఆకు కూరలదగ్గర్నుంచి అన్నీ తాజాగా దొరుకుతయి... అదీ మా బడ్జెట్‌కి అనుగుణంగా. అక్కడ రెండువందల రూపాయలకు నాలుగు రోజుల కూరగాయలు దొరికితే ఇక్కడ రూ.100కు ఆరు రోజుల కూరలు దొరుకుతాయి. మళ్లీ ఆటో చార్జీలుండవ్’ అంటుంది ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసే కొండ రాజ్యలక్ష్మి. అయితే చిక్కడపల్లికి కాస్త దూరంలో ఉన్న నల్లకుంట రెగ్యులర్ మార్కెట్‌లో ఆకుకూరల దుకాణమున్న రవి మాట్లాడుతూ ‘వారానికోరోజు వాడలల్ల అంగళ్లొచ్చి మా గిరాకీని దెబ్బకొడ్తున్నయ్.సిటీ చుట్టుపక్కల ఊర్లనుంచి కూరగాయలు తెస్తరు.. చాలా మటుకు రైతులుంటరు. తక్కువ ధరకే ఇస్తరు. మేమేమో మారు బేరగాళ్లం. మాకు అంత తక్కువ ధరకు పడయ్. గందుకే మా దగ్గర రేట్ ఎక్కువని వస్తలేరు’ అని వాపోయాడు.
 
 బెడదలేదు...
 ‘మాది జాయింట్ ఫ్యామిలీ. ఇద్దరు కొడుకులు, కోడళ్లు.. అందరూ ఉదయం లేవగానే ఆఫీస్‌కి వెళ్లేవాళ్లే. శని, ఆదివారాలు వచ్చాయంటే రెస్ట్ తీసుకుంటారు. మార్కెట్‌కో, మాల్స్‌కో వెళ్లి కూరగాయలు తెచ్చే ఓపిక ఎవరికీ ఉండదు. ఆ బాధ్యత నాదే. ఇన్నాళ్లు మా ఏరియాకు ఎక్కడో మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రైతు బజార్‌కెళ్లి తెచ్చుకోవాల్సి వచ్చేది. ఒక్కదాన్నే అన్నన్ని కూరగాయలు మోస్తూ ఆటోచార్జీలు భరిస్తూ తెచ్చుకోవడం భలే కష్టంగా ఉండేది. ఇప్పుడు ఆ బాధ లేదు. మా ఏరియాలో ఎవ్రీ ఫ్రైడే సంతొస్తోంది గుమ్మం ముందుకే. ఎవరి హెల్ప్ లేకుండా ఎంచక్కా ఇంటిల్లిపాదికి కావల్సిన కూరలు, పళ్లూ తెచ్చిపడేస్తున్నాను. ఇంట్లోకి అవసరమైన చిన్న చిన్న స్టీల్ సామాను, పూజ సామగ్రీ దొరుకుతుండడంతో బెడదనిపించడంలేదు. ఎక్కువెక్కువ మోసుకెళ్లకుండా హాయిగా రెండు మూడు ట్రిప్పుల్లో తీసుకెళ్తా’ వివరించారు మోతీనగర్‌కి చెందిన చల్లపల్లి పార్వతి.
 
 మంచి డిమాండ్..
 మోతీనగర్ వాడసంతలో పూలమ్మె సాలమ్మ ‘పెద్దపెద్ద మార్కెట్లలో మాకు జాగుండదు. మారుబేరానికి కావల్సిన పెట్టుబడీ మా దగ్గర లేదు. కాబట్టి ఇలాంటి అంగట్ల మాకు మంచి డిమాండ్’ అని స్పందించింది.
 
 ఫోర్ టు టెన్..
  వరకుసాగే ఈ అంగళ్లల్లో వీథి లైట్లు సరిగ్గా లేక మసక చీకటి అటు వ్యాపారస్తులను ఇటు కొనుగోలు దారులను ఇబ్బంది పెట్టేది మొన్నటిదాకా. ‘నెస్సెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్’ అన్నట్టుగా.. ఈ ఇబ్బందిని తొలగించడానికి బ్యాటరీ లైట్స్‌ను అద్దెకిచ్చే వ్యాపారమూ జోరందుకుంది అన్నిచోట్లా. మార్కెట్ మొదలవగానే ఈ లైట్లను ఇచ్చి మార్కెట్ ముగియగానే తీసుకెళ్తారు. ఆరుగంటలకు పది రూపాయలు అద్దె వసూలు చేస్తున్నారు. తాజా కూరలు.. సరసమైన ధరలు.. గుమ్మం ముందే దుకాణం.. ఎగువ, దిగువ, మధ్యతరగతివాళ్లకు ఇంతకన్నా అనుకూలం ఇంకేముంటుంది! అయితే బంజారాహిల్స్ లాంటి పోష్ లొకాటీల్లోనే ముందు ఈ సంతలు దర్శనమివ్వడం కొసమెరుపు!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement