ఇప్పటికింకా నా వయస్సు
నిండా అరవై ఐదేళ్లే!
న్యూఢిల్లీ: ఆమె వయసు 65 సంవత్సరాలు ... సాధారణంగా ఈ వయసులో చాలా మంది మంచానికి పరిమితమైతే, కాస్త చేవ ఉన్నవారు నాలుగు అడుగుల మార్నింగ్ వాక్‌తో సరిపెడతారు. ఇక కంటిచూపునకు సంబంధించిన సమస్యలు రావడం సరేసరి! కానీ ఢిల్లీకి చెందిన నిర్మల్ యాదవ్ మాత్రం అలా ఆగిపోలేదు. వయసు అరవై ఐదేళ్లు అయితేనేమి, ఆటలో మేటినే అంటూ తుపాకీ చేత పట్టి రికార్డులపై గురి పెట్టింది. జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో చెలరేగి ఔరా అనిపించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (వెటరన్ విభాగం)లో నిర్మల్ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పి స్వర్ణం సొంతం చేసుకుంది. మొత్తం 400 పాయింట్లకుగాను ఆమె 341 పాయింట్లు స్కోరు చేయడం విశేషం. మాజీ మేజర్ జనరల్ భార్య అయిన ఆమె, ఇటీవలే జైపూర్‌లోనూ జరిగిన కర్నిసింగ్ స్మారక షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఢిల్లీలోని టాప్‌గన్ షూటింగ్ అకాడమీలోనే ఆమె రెండేళ్ల క్రితం శిక్షణ ప్రారంభించి వరుస విజయాలు అందుకోవడం విశేషం. తాజా రికార్డుపై ఆమె మాట్లాడుతూ ‘రికార్డు నెలకొల్పడం చాలా ఆనందంగా ఉంది. ఇదే ఉత్సాహంతో మరింత మెరుగైన ప్రదర్శన కోసం శ్రమిస్తాను’ అని చెప్పింది.
బోర్డు ‘పాలకుల’ ఎంపిక రేపు!
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బీసీసీఐ వ్యవహారాలను నడిపించేందుకు ముగ్గురు అడ్మినిస్ట్రేటర్ల ఎంపిక శుక్రవారం జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి గురువారమే ఈ పేర్లను ప్రకటించాల్సి ఉన్నా, అది వాయిదా పడింది. ఈ కేసు కోర్టు జాబితా క్రమంలో 20వ తేదీన ఉందని, తాను కూడా కొన్ని పేర్లను ప్రతిపాదించబోతున్నట్లు బీహార్ సంఘం కార్యదర్శి ఆదిత్యవర్మ వెల్లడించారు.