Nirup Reddy
-
నిరూప్‌రెడ్డికి సీనియర్ న్యాయవాది హోదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన న్యాయవాది పి.నిరూప్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఫుల్‌కోర్టు సీనియర్ న్యాయవాది హోదా కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ హోదా పొందిన తొలి వ్యక్తి నిరూప్‌రెడ్డి కావడం విశేషం. మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి కుమారుడైన నిరూప్‌రెడ్డి 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందిన ఆయన వాదనలు వినిపించిన 31 కేసుల్లో తీర్పులు రికార్డు (రిపోర్టబుల్) అయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ అడ్వొకేట్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా సేవలందించిన సీనియర్ న్యాయవాది వీఆర్ రెడ్డి, పూర్వ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణ్యంతోనూ కలిసి ప్రాక్టీస్ చేశారు. 2013–18 సంవత్సరాల మధ్య గోవా, ఢిల్లీ రాష్ట్రాల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. కాగా, హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి, జస్టిస్ నౌషద్ అలీతోపాటు ఢిల్లీలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు న్యాయవాదులు అన్నం డీఎన్ రావు, యడవల్లి ప్రభాకర్‌రావులకు కూడా సుప్రీంకోర్టు సీనియర్ హోదా కల్పించింది. డీఎన్ రావు.. సుప్రీం న్యాయవాదిగా, అడ్వొకేట్ ఆన్ రికార్డు (ఏవోఆర్)గా ప్రాక్టీస్ చేసిన అన్నం సుబ్బారావు కుమారుడు. -
కాలుష్య కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం
పటాన్చెరు : కాలుష్య కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని జాతీయ హరిత ధర్మాసనం తీర్పు చెప్పింది. తమ తీర్పులను అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా నోటీసులు జారీ చేసింది. జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, జిన్నారం, కోహీర్ మండలాల్లో 23 గ్రామాలకు చెందిన రైతులకు రూ. 76 లక్షలు చెల్లించాల్సి ఉన్నా, అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకవపోవడంతో రైతుల పక్షాన సుప్రీంకోర్టు న్యాయవాది నిరూప్‌రెడ్డి ధర్మాసనాన్ని ఆశ్రయించారు కాలుష్యం కారణంగా నష్టపోతున్న రైతుల తరఫున గత కొన్నేళ్లుగా ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం 17 అంశాలపై ఆయన న్యాయ పోరాటం చేశారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (జాతీయ హరిత ధర్మాసనం) ప్రిన్సిపల్ బెంచ్ ఎదుట ఈ కేసు సోమవారం విచారణకు వచ్చింది. జస్టిస్ స్వతంత్రకుమార్ తీర్పును వెలువరిస్తూ రైతులకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో విఫలమైన ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. ఎనిమిది నెలల క్రితం తాము ఇచ్చిన తీర్పును ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర పీసీబీ, కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు కూడా ఈ నోటీసులు జారీచేశారు. రైతులు ఎదుర్కొంటున్న 12రకాల అంశాలపై పరిష్కారం ఎందుకు చూపలేదంటూ నోటీసులు జారీ చేశారు. తీర్పులో ప్రధానంగా రూ. 76 లక్షల పరిహారానికి సంబంధించిన ధర్మాసన ఆదేశాల ధిక్కరణ ప్రధానమైంది. అలాగే 23 చెరువులు, కుంటలు కాలుష్య కారణంగా పాడైనప్పటికీ వాటి పునరుద్ధరణ ఎందుకు చేపట్టలేదో తదితర అంశాలపై ధర్మాసనం ముందు న్యాయవాది నిరూప్‌రెడ్డి వాదించారు. కాలుష్యం కారణంగా నాలుగు మండలాల్లో మనిషి డీఎన్ఏలో మార్పులు సంభవించాయని, వాటిని అధ్యయనం చేసి ప్రత్యేక ఆసుపత్రి, చికిత్సా విధానం రూపొందించాలని వాదించారు.