సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు చెందిన న్యాయవాది పి.నిరూప్‌రెడ్డికి సుప్రీంకోర్టు ఫుల్‌కోర్టు సీనియర్ న్యాయవాది హోదా కల్పించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ హోదా పొందిన తొలి వ్యక్తి నిరూప్‌రెడ్డి కావడం విశేషం. మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ న్యాయవాది, మాజీ స్పీకర్, మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి కుమారుడైన నిరూప్‌రెడ్డి 30 ఏళ్లుగా సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. రాజ్యాంగపరమైన అంశాలతోపాటు చట్టాలపై మంచి పట్టున్న న్యాయవాదిగా గుర్తింపు పొందిన ఆయన వాదనలు వినిపించిన 31 కేసుల్లో తీర్పులు రికార్డు (రిపోర్టబుల్) అయ్యాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ అడ్వొకేట్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా సేవలందించిన సీనియర్ న్యాయవాది వీఆర్ రెడ్డి, పూర్వ సొలిసిటర్ జనరల్ గోపాల సుబ్రమణ్యంతోనూ కలిసి ప్రాక్టీస్ చేశారు. 2013–18 సంవత్సరాల మధ్య గోవా, ఢిల్లీ రాష్ట్రాల తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. కాగా, హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసిన జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి, జస్టిస్ నౌషద్ అలీతోపాటు ఢిల్లీలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో ఇద్దరు న్యాయవాదులు అన్నం డీఎన్ రావు, యడవల్లి ప్రభాకర్‌రావులకు కూడా సుప్రీంకోర్టు సీనియర్ హోదా కల్పించింది. డీఎన్ రావు.. సుప్రీం న్యాయవాదిగా, అడ్వొకేట్ ఆన్ రికార్డు (ఏవోఆర్)గా ప్రాక్టీస్ చేసిన అన్నం సుబ్బారావు కుమారుడు.
Comments
Please login to add a commentAdd a comment