భారత్ నుంచి మళ్లీ డాట్సన్ ‘గో’..
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ .. భారత్‌లో తమ డాట్సన్ బ్రాండ్ కార్లను నిలిపివేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయంగా వ్యాపార పునర్వ్యవస్థీకరణ వ్యూహాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ‘చెన్నై ప్లాంటులో (రెనో నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా) డాట్సన్ రెడీ–గో ఉత్పత్తి నిలిపివేశాం. అయితే, స్టాక్ ఉన్నంత వరకూ వాటి విక్రయాలు కొనసాగుతాయి. డాట్సన్ కొనుగోలు చేసిన ప్రస్తుత, భవిష్యత్ కస్టమర్లకు యథాప్రకారంగా దేశవ్యాప్త డీలర్షిప్ నెట్వర్క్ ద్వారా ఆఫ్టర్ సేల్స్ సర్వీసులు, విడిభాగాలు అందుబాటులో ఉంచడం, వారంటీపరమైన సపోర్ట్ అందించడం కొనసాగిస్తాం‘ అని నిస్సాన్ ఇండియా తెలిపింది.
కంపెనీ ఇప్పటికే డాట్సన్ బ్రాండ్‌లో ఎంట్రీ లెవెల్ చిన్న కారు గో, కాంపాక్ట్ మల్టీపర్పస్ వాహనం గో ప్లస్ మోడల్స్ ఉత్పత్తి ఆపేసింది. డాట్సన్ బ్రాండ్‌ను నిస్సాన్ నిలిపివేయడం ఇదే తొలిసారి కాదు. 1986లో ఆపేసే నాటికి డాట్సన్ భారత్ సహా 190 దేశాల్లో అమ్ముడయ్యేది. మళ్లీ చాలాకాలం తర్వాత 2013లో డాట్సన్ బ్రాండ్ భారత మార్కెట్‌కు తిరిగి వచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో అమ్మకాలు నమోదు కాలేదు. మిగతా మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో 2020లోనే రష్యా, ఇండోనేసియా మార్కెట్లలో డాట్సన్‌ను ఆపేసిన నిస్సాన్ అటు పై క్రమంగా భారత్, దక్షిణాఫ్రికాలో కూడా నిలిపివేయాలని నిర్ణయించుకుంది.