చర్చలు విఫలం!
సాక్షి, చెన్నై : ఎన్ఎల్సీ యాజమాన్యం, కార్మికుల మధ్య సాగిన చర్చలు విఫలమయ్యాయి. యాజమాన్యం నడ్డి విరిచేందుకు సమ్మె తప్పదని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. బుధవారం అర్ధరాత్రి లేదా, గురువారం నుంచి సమ్మె బాట పట్టే రీతిలో కార్మిక సంఘాలు సంప్రదింపుల్లో మునిగాయి. కడలూరు జిల్లా నైవేలిలోని లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్ఎల్సీ) ఎప్పుడూ వార్తల్లోనే ఉంటోంది. ఇక్కడ నేల బొగ్గు తవ్వకాలు, విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ సాగుతుండడంతో కార్మికులు తరచూ ఆందోళనబాట పట్టడం పరిపాటిగా మారింది. ఏడాదికోమారు సమ్మె సైరన్‌ను తప్పనిసరిగా కార్మిక సంఘాలు మోగిస్తూనే వస్తున్నాయి. ఇందుకు కారణం యాజమాన్య వైఖరి, 20 ఏళ్లకు పైగా ఇందులోని పది వేల మంది కార్మికులు ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను పర్మినెంట్ చేయాలని, వేతనాలు పెంచాలని, అలవె న్సులు ప్రకటించాలన్న డిమాండ్లను యాజమాన్యం ముందు ఉంచినా ఫలితం శూన్యం.
ఇది వరకు యాజమాన్యంతో చర్చలు జరుపుతూ వచ్చిన కార్మిక సంఘాలు, చివరకు కార్మిక సంక్షేమ అధికారి సమక్షంలో చర్చలకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు 15 సార్లు చర్చలు జరిగాయి. అయితే, ఎన్ఎల్సీ యాజమాన్యం మాత్రం మెట్టు దిగలేదు. సమ్మె అనివార్యం కావడంతో గత నెల పది కార్మిక సంఘాలు సంయుక్తంగా సమ్మె నోటీసు జారీ చేశాయి.చర్చలు విఫలం : కార్మిక సంఘాలు సమ్మె నోటీసు జారీ చేయడంతో పాటుగా రోజుకో రూపంలో నిరసనలకు దిగడంతో యాజమాన్యం తగ్గింది. పుదుచ్చేరిలోని కార్మిక సంక్షేమ అధికారి సమక్షంలో చర్చలకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం తొమ్మిది కార్మిక సంఘాలు ఈ చర్చలకు హాజరయ్యాయి. అయితే, పట్టు వదలని విక్రమార్కుడిలాగా యాజమాన్యం వ్యవహరించడంతో ఆ సంఘాలు చర్చల్ని బహిష్కరించి బయటకు వచ్చాయి.
చర్చలు విఫలమయ్యాయని, బుధవారం అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నామని ప్రకటించాయి. అదే సమయంలో జీవా ఒప్పంద కార్మికులు చర్చలకు దూరంగా ఉండడంతో, వారితో కార్మిక సంక్షేమ అధికారి సమక్షంలో బుధవారం బుజ్జగింపు యత్నాలు జరిగాయి. అయితే, ఆ చర్చలు సైతం విఫలం కావడంతో సమ్మెకు రెడీ అవుతున్నామని జీవా ఒప్పంద కార్మిక సంఘం ప్రకటించింది. అయితే, సమ్మె బుధవారం అర్ధరాత్రి నుంచి చేపట్టాలా..? లేదా, గురువారం నుంచి చేపడుదామా...? అన్న విషయంగా కార్మిక సంఘాల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. రాత్రి జరగనున్న పది సంఘాలు సంయుక్త సమావేశం అనంతరం సమ్మె సైరన్ మోగించేందుకు కార్మికులు రెడీ అయ్యారు.
రంగంలోకి బలగాలు: కార్మికులు సమ్మె సైరన్ మోగించనుండడంతో నైవేలి పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కేంద్ర బలగాల్ని రంగంలోకి దించారు. కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్న పక్షంలో ఆస్తుల పరిరక్షణ లక్ష్యంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. బుధవారం ఉదయం నుంచే నైవేలిలోని ఎన్ఎల్సీ ప్రధాన కార్యాలయం, నగర కార్యాలయం, భూగర్భ కార్యాలయం, మూడు విద్యుత్ యూనిట్లకు సంబంధించిన ఆ కార్యాలయాలన్నీ తమ ఆధీనంలోకి కేంద్ర భద్రతా బలగాలు తీసుకున్నాయి. కార్మికులు ఆందోళనలు, నిరసనలకు యత్నించినా, నేలబొగ్గు తవ్వకాల ప్రదేశాలు, విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల వైపుగా వెళ్లేందుకు యత్నించినా అడ్డుకునే విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు.
కార్మికులు సమ్మె బాట పట్టినా, విద్యుత్ ఉత్పత్తికి ఎలాంటి ఆటంకం ఉండబోదని, నేలబొగ్గు నిల్వ పుష్కలంగా ఉన్నట్టు ఎన్ఎల్సీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, ఎన్ఎల్సీ కార్మిక సంఘాల నాయకులు, సుకుమార్, పరమ శివన్‌లు మీడియాతో మాట్లాడుతూ, ఎన్ఎల్సీ లాభాల బాటలో పయనిస్తోందని వివరించారు. ఒప్పంద కార్మికులు రేయింబవళ్లు ఏళ్ల తరబడి శ్రమించే ఈ సంస్థ లాభాలను ఆర్జిస్తూ ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. అయితే, ఒప్పంద కార్మికుల సంక్షేమం మీద యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. అందుకే సమ్మె సైరన్ మోగించే తీరాలన్న నిర్ణయానికి వచ్చామని ప్రకటించారు.