రైతులకు షాక్
సాక్షి, నరసరావుపేట: జిల్లాలోని అనేక మండలాల్లోని రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 1.15 లక్షల విద్యుత్ మోటార్ల కింద సుమారు మూడున్నర లక్షల ఎకరాల్లో పంటలు సాగులో వున్నాయి. ముఖ్యంగా పత్తి, మిర్చి వంటి వాణిజ్యపంటలను లక్షల పెట్టుబడులతో సాగు చేస్తూ పంట చేతికొచ్చేవరకు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
పత్తి , మిర్చికి సంబంధించి ఎకరాకు సుమారు 50 నుంచి 70 వేల రూపాయల పెట్టుబడులు పెట్టి పంట చేతికొచ్చే సమయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా లేక నీరు తగ్గి పొలాలు తడవక ఎండిపోతున్నాయి. వ్యవసాయ మోటార్లకు ఏడు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం, విద్యుత్‌శాఖ అధికారులు మాట నిలబెట్టుకోకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
2, 3 విడతలుగా కేవలం 4 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా జరుగుతుందని రైతులు వాపోతున్నారు. అది కూడా అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇస్తుండటంతో పొలాలకు నీటిని పెట్టుకోలేకపోతున్నామని చె బుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు అర్ధరాత్రి, అపరాత్రని లేకుండా పొలాల్లోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
విద్యుత్ సరఫరా చేయలేకపోతున్నాం .. జిల్లాలో మొత్తం 11.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. ప్రస్తుతం 8.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే సరఫరా అవుతుంది. వ్యవసాయ విద్యుత్ విషయానికొస్తే జిల్లాలో మొత్తం 1.15 లక్షల విద్యుత్ మోటార్లు ఉన్నాయి.వీటికి 1.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు విడతలుగా ఏడుగంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాం. సరఫరా తక్కువగా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాల్లో ఏడుగంటలు విద్యుత్ సరఫరా చేయలేకపోతున్న మాట వాస్తవమే.