No faculty
-
ఫ్యాకల్టీ లేని ‘డైట్’ కళాశాల
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భవిష్యత్తు ఉపాధ్యాయులను తయారు చేసేందుకు రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల్లో అనేక ఏళ్ల నుంచి కొనసాగుతున్న ‘డైట్’(ప్రభుత్వ జిల్లా విద్యా, శిక్షణ సంస్థ) కళాశాలలు అధ్యాపకులు లేకుండానే కొనసాగుతున్నాయి. పది ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో 1989 నుంచి ఏటా వందల మంది విద్యార్థులు తాము సాధించిన ర్యాంకుల ద్వారా డీఎడ్ కోర్సుల్లో చేరుతున్నారు. నల్లగొండ, ఖమ్మం కళాశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉండగా, మిగిలిన వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, వికారాబాద్ కళాశాలల్లో తెలుగు, ఆంగ్లంతో పాటు ఉర్దూ మాధ్యమం కూడా ఉంది. అయితే ఇవి గత మూడేళ్లుగా అధ్యాపకులు లేకుండానే నడుస్తున్నాయి. పది చోట్ల 290 మంది టీచింగ్ స్టాఫ్ ఉండాల్సి ఉంది. అయితే మొత్తం రాష్ట్రంలోని 10 కళాశాలల్లో కలిపి 300 మందికి గాను కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. ఉర్దూ మీడియం లేని ఖమ్మం, నల్లగొండ కళాశాలల్లో 24 మంది అధ్యాపకులు, మిగిలిన 8 కళాశాలల్లో 29 మంది చొప్పున అధ్యాపకులు ఉండాలి. అయితే ఎక్కడా కూడా సరిపడా అధ్యాపకులు లేకపోగా, ఉన్న అధ్యాపకులు, ప్రిన్సిపపాళ్లు వివిధ జిల్లాలకు ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. దీంతో నామమాత్రంగా ఉన్న అధ్యాపకులు సైతం అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. దీనివల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. అంతా అస్తవ్యస్తం.. నిజామాబాద్ డైట్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉండగా, ఒకే ఒక్క అధ్యాపకుడు ఉన్నారు. ఆ అధ్యాపకుడు కూడా ఆసిఫాబాద్ డీఈవోగా వ్యవహరిస్తున్నారు. మెదక్ కళాశాలలో రెగ్యులర్ ప్రిన్సిపల్, ఒకే ఒక్క అధ్యాపకుడు ఉన్నారు. వరంగల్ కళాశాలలో అధ్యాపకులు ఎవరూ లేరు. కళాశాల ప్రిన్సిపల్ యాదాద్రి భువనగిరి డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ కళాశాలలో అధ్యాపకులు లేరు. రెగ్యులర్ ప్రిన్సిపల్ ఉన్నారు. వికారాబాద్ కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు ఉండగా, ప్రిన్సిపల్ లేరు. నల్లగొండ కళాశాలలో ఒకే ఒక్క అధ్యాపకుడు ఉండగా, ప్రిన్సిపల్ లేరు. కరీంనగర్ కళాశాలలో ప్రిన్సిపల్ లేకపోగా, ఉన్న ముగ్గురు అధ్యాపకుల్లో ఒకరు జగిత్యాల డీఈవోగా వ్యవహరిస్తున్నారు. ఆదిలాబాద్ కళాశాలలో ప్రిన్సిపల్ లేకపోగా ఇద్దరు అధ్యాపకులు ఉన్నారు. వీరిలో ఒకరు నిర్మల్ డీఈవోగా ఉన్నారు. ఖమ్మం కళాశాలలో ఇద్దరు అధ్యాపకులు ఉండగా, ఒకరు భద్రాద్రి కొత్తగూడెం డీఈవోగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్ కళాశాలలో నలుగురు అధ్యాపకులు ఉండగా, అందులో ముగ్గురు వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాలకు డీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయా కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీలు, రిటైర్డ్ లెక్చరర్లతో పాఠాలు బోధిస్తున్నప్పటికీ.. అంతంతమాత్రమేనని విమర్శలు ఉన్నాయి. నిజామాబాద్ కళాశాలలో పూర్వ విద్యార్థులతో తరగతులు చెప్పిస్తున్నారు చదవండి: అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం -
కంప్యూటర్ చదువు కలేనా?
పెదనడిపల్లి(చీపురుపల్లి రూరల్),న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య లక్ష్యం గాడి తప్పుతోంది. జిల్లాలో గల 175 జిల్లాపరిషత్ సక్సెస్ ఉన్నత పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 2002లో ఈ కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఉన్నత పాఠశాలకు 11 కంప్యూటర్లను,వాటికి సంబంధించిన పరికరాలను అందజేసింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున 350 మంది కంప్యూటర్ బోధకులను తాత్కాలిక వేతనం రూ 2 వేలు చెల్లిస్తూ నియమించింది. మొదట్లో ఈ పాఠశాలల కంప్యూటర్ విద్యాబోధన బాధ్యతను నిట్ సంస్థకు అప్పగించింది.తరువాత కాలంలో విద్యాబోధకులు తమకు చెల్లిస్తున్న వేతనాన్ని పెంచాలని 2008లో నిట్ సంస్థపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మేరకు వారి వేతనం రూ 3100కు పెరిగింది. మళ్లీ 2011లో ఈ పాఠశాలల కంప్యూటర్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఐఈజీ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ బోధకుల జీతాలను రూ 1900కు కుదించింది. దీనికి తోడు కంప్యూటర్ విద్య నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను కూడా సక్రమంగా అందజేయకపోవడం,పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించకపోవడంతో కంప్యూటర్ విద్య ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఇన్ని కష్టాల నడుమ కంప్యూటర్ బోధకులు తక్కువ వేతనానికి కూడా పాఠశాలలో తరగతులు నిర్వహించే వారు. ఈ కంప్యూటర్ విద్యను అందించేటప్పుడు మొదట్లో ఒక ప్రైవేటు సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ నెలతో కంప్యూటర్ టీచర్స్ గడువు పూర్తయ్యింది. దీంతో నెల రోజులుగా కంప్యూటర్ టీచర్స్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లకు పరిమితమైన ఉపాధ్యాయులకు జీతాలు లేక విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందక ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. సామగ్రికి భద్రత కరువు ఇదిలా ఉండగా సక్సెస్ పాఠశాలలకు ప్రభుత్వం అందించిన కంప్యూటర్ సామగ్రికి భద్రత లేకుండా పోతోంది. చీపురుపల్లి మండలంలో 5 జిల్లా పరిషత్ బాలుర, బాలిక ఉన్నత పాఠశాలలకు ఈ పథకంలో భాగంగా కంప్యూటర్లను, వాటికి సంబంధించిన పరికరాలను అందజేసినప్పటికీ ఏదో ఒకరకమైన సాంకేతిక లోపంతో మరమ్మతుకు గురవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా వీటిని భద్రపరచడం మరో ప్రధాన సమస్యగా మారింది. మండలంలోని పెదనడిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సీపీయూలు మూడేళ్ల క్రితం దొంగతనానికి గురయ్యాయి. సీపీయూలు చోరీకి గురవడంతో అప్పటినుంచి ఆ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య పూర్తిగా దూరమైంది. నేటికీ ఈ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం అందజేసిన కంప్యూటర్లలో సుమారు 70 శాతం మరమ్మతుల్లో ఉండడంతో విద్యార్థులకు విద్యను అందించలేని పరిస్థితి. మిగిలి ఉన్న కంప్యూటర్లతో బోధన చేద్దామా అనుకుంటే ఇదే సమయంలో నిత్యం విద్యుత్ కోతలతో కంప్యూటర్ విద్య దూరమైపోతోంది. అంతేకాకుండా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించకపోవడంతో కంప్యూటర్లు ఉన్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు. ‘కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని పనిచేయని కంప్యూటర్లకు మరమ్మతులు చేయించి, పాఠశాలల్లో ఈ విద్యకు అందుబాటులో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించాలి. దీంతో పాటు ప్రభుత్వమే కంప్యూటర్ బోధకులను నియమించినట్లయితే మళ్లీ విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందుతుం’దని ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.