పెదనడిపల్లి(చీపురుపల్లి రూరల్),న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కంప్యూటర్ విద్య లక్ష్యం గాడి తప్పుతోంది. జిల్లాలో గల 175 జిల్లాపరిషత్ సక్సెస్ ఉన్నత పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం 2002లో ఈ కంప్యూటర్ విద్యను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఉన్నత పాఠశాలకు 11 కంప్యూటర్లను,వాటికి సంబంధించిన పరికరాలను అందజేసింది. జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాలకు ఇద్దరు చొప్పున 350 మంది కంప్యూటర్ బోధకులను తాత్కాలిక వేతనం రూ 2 వేలు చెల్లిస్తూ నియమించింది. మొదట్లో ఈ పాఠశాలల కంప్యూటర్ విద్యాబోధన బాధ్యతను నిట్ సంస్థకు అప్పగించింది.తరువాత కాలంలో విద్యాబోధకులు తమకు చెల్లిస్తున్న వేతనాన్ని పెంచాలని 2008లో నిట్ సంస్థపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మేరకు వారి వేతనం రూ 3100కు పెరిగింది. మళ్లీ 2011లో ఈ పాఠశాలల కంప్యూటర్ నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఐఈజీ సంస్థకు అప్పగించింది. ఈ సంస్థ బోధకుల జీతాలను రూ 1900కు కుదించింది.
దీనికి తోడు కంప్యూటర్ విద్య నిర్వహణకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను కూడా సక్రమంగా అందజేయకపోవడం,పాఠశాలల్లో ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కల్పించకపోవడంతో కంప్యూటర్ విద్య ఉన్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఇన్ని కష్టాల నడుమ కంప్యూటర్ బోధకులు తక్కువ వేతనానికి కూడా పాఠశాలలో తరగతులు నిర్వహించే వారు. ఈ కంప్యూటర్ విద్యను అందించేటప్పుడు మొదట్లో ఒక ప్రైవేటు సంస్థతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ నెలతో కంప్యూటర్ టీచర్స్ గడువు పూర్తయ్యింది. దీంతో నెల రోజులుగా కంప్యూటర్ టీచర్స్ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇళ్లకు పరిమితమైన ఉపాధ్యాయులకు జీతాలు లేక విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందక ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి.
సామగ్రికి భద్రత కరువు
ఇదిలా ఉండగా సక్సెస్ పాఠశాలలకు ప్రభుత్వం అందించిన కంప్యూటర్ సామగ్రికి భద్రత లేకుండా పోతోంది. చీపురుపల్లి మండలంలో 5 జిల్లా పరిషత్ బాలుర, బాలిక ఉన్నత పాఠశాలలకు ఈ పథకంలో భాగంగా కంప్యూటర్లను, వాటికి సంబంధించిన పరికరాలను అందజేసినప్పటికీ ఏదో ఒకరకమైన సాంకేతిక లోపంతో మరమ్మతుకు గురవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా వీటిని భద్రపరచడం మరో ప్రధాన సమస్యగా మారింది. మండలంలోని పెదనడిపల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో సీపీయూలు మూడేళ్ల క్రితం దొంగతనానికి గురయ్యాయి. సీపీయూలు చోరీకి గురవడంతో అప్పటినుంచి ఆ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్య పూర్తిగా దూరమైంది. నేటికీ ఈ పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. జిల్లాలోని పాఠశాలలకు ప్రభుత్వం అందజేసిన కంప్యూటర్లలో సుమారు 70 శాతం మరమ్మతుల్లో ఉండడంతో విద్యార్థులకు విద్యను అందించలేని పరిస్థితి. మిగిలి ఉన్న కంప్యూటర్లతో బోధన చేద్దామా అనుకుంటే ఇదే సమయంలో నిత్యం విద్యుత్ కోతలతో కంప్యూటర్ విద్య దూరమైపోతోంది.
అంతేకాకుండా ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించకపోవడంతో కంప్యూటర్లు ఉన్నప్పటికీ ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు. ‘కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుని పనిచేయని కంప్యూటర్లకు మరమ్మతులు చేయించి, పాఠశాలల్లో ఈ విద్యకు అందుబాటులో ఇంటర్‌నెట్ సౌకర్యాన్ని కల్పించాలి. దీంతో పాటు ప్రభుత్వమే కంప్యూటర్ బోధకులను నియమించినట్లయితే మళ్లీ విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందుతుం’దని ఇటు ఉపాధ్యాయులు, అటు విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు.