అవయవదానంపై ముస్లింల నిరాసక్తత
హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన 'జీవన్ దాన్' స్కీమ్ తెలంగాణలో విజయంసాధించినంతగా మరెక్కడా సాధించలేదు. అవయవదానం కోసం ప్రత్యకంగా తెచ్చిన ఈ స్కీమ్ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన 241 మంది వ్యక్తులు తమ అవయవాలను సేకరించి 1,000మందికి ప్రాణదానం చేశారు. అయితే అవయవదానం ఆవశ్యకతను ముస్లింలకు తెలియపర్చడంలో మాత్రం అధికార యంత్రాంగం విఫలమైందని తాజాగా వెల్లడయింది.
ముస్లిం కుటుంబాలకు చెందిన చాలా మంది అవయవదానానికి సరేమీరా అంటున్నారు. వీరిలో గ్రహీతల కుటుంబాలు కూడా ఉండటం గమనార్హం. 2013లో ప్రారంభమైన జీవన్ దాన్ స్కీమ్ ద్వారా ఇప్పటివరకూ 39మంది ముస్లింలు అవయదానాన్ని పొందారు. కానీ దానం చేసుందుకు మాత్రం ఒక్కరూ ముందుకు రాలేదని జీవన్ దాన్ కో-ఆర్డినేటర్ డా.జీ స్వర్ణలత చెప్పారు. ఈ విషయంలో ముస్లిం మత పెద్దల సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో మైనారిటీలు నడుపుతున్న రెండు ఆసుపత్రులు జీవన్ దాన్ లో చేరేందుకు నిరాసక్తతను ప్రదర్శించాయని, ఆ రెండు ఆసుపత్రుల్లో 2,849 మందికి అవయవాల అవసరం ఉన్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆశ్చర్యం కలిగించే విషయమని, మతపరమైన అడ్డంకుల వల్లే ముస్లింలు అవయవదానాలకు ముందుకు రాకపోవడానికి గల కారణం అయిఉండొచ్చని డాక్టర్ స్వర్ణలత అంటున్నారు.