ప్రత్యేక హోదాకు మంగళం!
కొంప ముంచే నిర్ణయాలన్నిటిలాగే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అసాధ్యమన్న ప్రకటన కూడా ప్రజానీకం ఆదమరచి నిదురిస్తున్న వేళ వెలువడింది. ప్రత్యేక ప్యాకేజీయా... ప్రత్యేక హోదానా అన్న విషయంలో రెండున్నరేళ్లుగా టీడీపీ, బీజేపీలు సాగిస్తున్న ఎడతెగని నాటకానికి తెరపడింది. చావు కబురు చల్లగా చెప్పినట్టు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాత్రి పదకొండు కావస్తుండగా హోదా అసాధ్యమంటూ చేసిన ప్రకటనను మరికాస్త సమయం గడిచాక, అర్ధరాత్రి ముహూర్తం చూసుకుని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించి కర్మకాండ పూర్తయిందనిపించారు. ఈ మాత్రం దానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆపసోపాలు పడుతున్నట్టు టీడీపీ నేతలు ఢిల్లీలో రోజంతా పోజు కొట్టారు. లీకుల మీద లీకులిస్తూ జనంలో ఉత్కంఠ పెంచారు.
కేంద్రంలో తమ పార్టీ తరఫున ఉన్న ఏకైక కేబినెట్ మంత్రి అశోక్ గజపతి రాజునూ, టీడీపీపీ నేత తోట నరసింహంనూ పక్కకునెట్టి సహాయమంత్రి సుజనా చౌదరినీ, ఎంపీ సీఎం రమేష్‌నూ ముందుపెట్టి ఈ తతంగాన్నంతా నడిపినప్పుడే జరగబోయేదేమిటో అందరూ ఊహించారు. చేసేది వంచనే అయినా దాన్ని ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రదర్శించడం చంద్రబాబుకు అలవాటు. అలాగైతేనే జనం అంత తొందరగా పోల్చుకోలేరని ఆయన ప్రగాఢ విశ్వాసం. గద్దెనెక్కింది మొదలు ఆయన మాటల తీరు, వ్యవహారశైలి గమనిస్తే ఇది అర్ధమవుతుంది.
తమకు ఓటేస్తే పదిహేనేళ్ల పాటు ప్రత్యేక హోదా తీసుకొస్తామని 2014 ఎన్నికల సందర్భంగా అనేక సభల్లో చంద్రబాబు ప్రకటించారు. తామూ, బీజేపీ మిత్రులం గనుక అధికారం అందీ అందగానే ప్రత్యేక హోదాతో ఏపీని భూలోక స్వర్గం చేస్తామని నమ్మబలికారు. గద్దెనెక్కిన కొన్నాళ్లకే ఆయనలో మార్పువచ్చింది. ప్రత్యేక హోదాపై కాకమ్మ కథ లతో కొన్నాళ్లూ, మౌనంగా కొన్నాళ్లూ కాలం గడిపారు. అమరావతి శంకుస్థాపన కొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని ప్రత్యేక హోదా గురించి అడగటానికి ఆయన నోరు పెగల్లేదు. అతి కష్టంపై ‘ప్యాకేజీ’ అన్నమాట ఒకటి వాడారు.
అదేమిటని విస్తుపోయినవారిని ఆ రెండూ ఒకటేనని దబాయించారు. మరికొన్నాళ్లకు జనం సహనం కోల్పోయే స్థితికి చేరుకుంటున్న వైనాన్ని గ్రహించి మాట్లాడక తప్పదన్న నిర్ణయానికొచ్చినా... ఇంకా అస్పష్టతలోనే పొద్దుపుచ్చాలనుకున్నారు. ‘ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా...ఏమొస్తుంది దాని వల్ల?’ అంటూ తర్కం లేవదీశారు. ‘ప్రత్యేక హోదా కేంద్రం ఇస్తానంటే వద్దంటానా...?’ అని మళ్లీ ఆ నోటితోనే అన్నారు. ప్రధాన ప్రతిపక్షం విడవకుండా పోరాడుతుంటే ఇక తప్పదన్నట్టు ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్యని గొంతు సవరించారు. వెగటు పుట్టించే ఎడ తెగని సీరియల్ మాదిరి ఇదంతా సాగింది.
సంక్లిష్ట పరిస్థితుల్లో సైతం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే, నెరవేర్చడమే రాజకీయ స్వచ్ఛతకు నిదర్శనమని ఒక అమెరికన్ రచయిత అంటాడు. రాష్ట్ర విభజన బిల్లు పెద్దల సభ ముందుకొచ్చినప్పుడు కొత్త రాష్ట్రానికి అయిదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రకటించినప్పుడు విపక్షంలో ఉండి ‘అయిదు కాదు...పది’ అంటూ ఆయనతో వాదనకు దిగి ఒప్పించింది ప్రస్తుత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడే. ఇప్పుడు ఆయనే పదవిలోకొచ్చి ‘పది కాదు గదా... అయిదు కూడా కుదరద’ంటున్నారు.
అందుకు పద్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సులను చూపుతున్నారు. అప్పుడు యూపీఏ సర్కారు ఇస్తామ నడం, మరింతగా ఇవ్వమని తాము కోరడం సబబేగానీ ఈ కొత్త సిఫార్సులతో అంతా తలకిందులైందని చెబుతున్నారు. చెప్పేవారికి వినేవాళ్లు లోకువంటారు. 13వ ఆర్ధిక సంఘం అమలులో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను దాని ప్రకారమే నెరవేర్చాలి. దేశ పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీ కొత్త సంఘం సిఫా ర్సులతో రద్దయి పోతుందనడంలో అర్ధమేమైనా ఉందా? అదే జరుగుతుంద నుకున్నప్పుడు ఇక చట్టసభలు దండగ.
ఇంతమంది ప్రజా ప్రతినిధులు ఒకచోట చేరడం... చర్చలు, తీర్మానాలు, హామీలు వృథా. ఆ సంఘం చెప్పినట్టు విని పరిపాలిస్తే సరిపోతుంది. అసలు విభజన చట్టంలో అన్నీ అస్పష్టంగా ఉన్నాయని కూడా వెంకయ్య అంటున్నారు. మరి విభజన బిల్లు ముసాయిదాను ప్రవేశ పెట్టింది కాంగ్రెస్ నేతృత్వంలోని సర్కారైతే, దానికి మద్దతు తెలిపింది ఆనాడు బీజేపీయే. ఇరుపక్షాల్లోనూ పాలనలో తలపండిన వారున్నారు. బిల్లు మొహం చూసి దాని అంతరార్ధమేమిటో, అందులోని లొసుగులేమిటో క్షణంలో విప్పి చెప్పగల సమర్థులు వారు. అస్పష్టంగా ఉన్నదనుకున్నప్పుడు మరి కొన్ని రోజులు సమయం తీసుకునైనా బిల్లును సరిచేయించాల్సింది. అలా ఎందుకు చేయలేక పోయారో ఆయనే చెప్పాలి.
అరుణ్ జైట్లీ తాయిలాలుగా ప్రకటించినవన్నీ విభజన చట్టంలోని హామీలే. ఆయన కొత్తగా చేసింది ఒకటుంది. ఆ చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి దాని నిర్మాణం బాధ్యతలు పూర్తిగా తామే తీసుకుంటామన్న హామీని ఆయన మార్చేశారు. ఇప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తామన్నారు. రాజధాని నిర్మాణం పేరిట బాబు సర్కారు సాగిస్తున్న నాటకాన్ని గమనిస్తే పోల వరం ప్రాజెక్టు బాధ్యతలు తీసుకుని ఏం చేయబోతారో ఎవరికైనా అర్ధమవుతుంది. భూ సేకరణ, నిర్వాసితుల సహాయ పునరావాసం వగైరాలకయ్యే వ్యయం జోలికి కేంద్రం వెళ్లదల్చుకోలేదని జైట్లీ ప్రకటనతో స్పష్టమవుతోంది.
ఫలితంగా ఆ ప్రాజె క్టుకు ఇప్పట్లో మోక్షం కలిగేలా కనబడటం లేదు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి వందలాది పరిశ్రమలు వస్తాయని, ఉపాధి దొరుకుతుందని, నిరుద్యోగ బెడద తీరుతుందని ఎదురుచూస్తున్న యువత ఆశలపై టీడీపీ, బీజేపీలు చన్నీళ్లు చల్లాయి. ప్రధాని మోదీ విదేశాల్లో ఉండగా ఎందుకింత హడావుడిపడ్డారో, కేంద్రం చెప్పిందే తడవుగా బాబు ఎందుకు తలాడించారో రాబోయే రోజుల్లో తేటతెల్లమవుతుంది. శనివారం జరగబోయే రాష్ట్ర బంద్‌లో అయిదు కోట్లమంది ఆకాంక్షలేమిటో వ్యక్తమయ్యాకైనా రెండు పార్టీలూ తమ తప్పిదాన్ని సరిచేసు కోకపోతే చరిత్ర క్షమించదు.