'రోడ్లపైకి వస్తే నిప్పంటించడం ఖాయం'
ముంబయి: రాష్ట్రంలో ఆటోరిక్షాల అనుమతులు మరాఠేతరులకే అధికంగా ఇస్తున్నారని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఆరోపించింది. 70శాతం ఆటో పర్మిట్లు రాష్ట్రేతరులకే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ఆటోలన్నింటిని గుర్తించి తగులబెడతామంటూ బహిరంగ ప్రకటన చేసింది. తన పార్టీ కార్యకర్తలు అలాంటి ఆటోలు రోడ్లపై కనిపిస్తే నిప్పుపెట్టడం ఖాయం అని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే చెప్పారు. పార్టీ పదో వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
'కొత్త పర్మిట్ తీసుకున్న మహారాష్ట్రేతర ఆటో కనిపిస్తే ఆపేస్తాం. అందులోని ప్రయాణీకులను దించివేసి ఆ ఆటోను కాల్చివేస్తాం.. రాష్ట్ర రవాణాశాఖను చూసుకుంటున్న శివసేన ఈ విషయంలో ఏం చేస్తోంది చెప్పాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న అనుమతులు కాకుండా త్వరలోనే మరో 70 వేల మహారాష్ట్రేతరులకు అనుమతులు ఇవ్వబోతున్నారని వాటిని ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.