నా భార్యకు మాత్రమే కింగ్‌ను: హీరో
ముంబై: బాలీవుడ్లో, ముఖ్యంగా ఖాన్ త్రయంలో కలెక్షన్ల వేటలో ముందున్నది ఆమిర్ ఖాన్. తన రికార్డులను తనే బద్దలు కొడుతూ ఆమిర్ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. వందల కోట్ల క్లబ్‌లు ఒక్కోటి దాటేస్తూ పోతున్నాడు. ఆమిర్ తాజా చిత్రం దంగల్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే తాను ఈ బాక్సాఫీసు రికార్డుల గురించి ఆలోచించనని, బాక్సాఫీసు కింగ్ కాదని వినమ్రంగా చెబుతున్నాడు. తాను బాక్సాఫీసు కింగ్ కాదు, కిరణ్ (భార్య కిరణ్ రావు)కు మాత్రమే కింగ్‌ను అని ఆమిర్ చమత్కరించాడు.
దంగల్ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ముంబైలో ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీలో ఆమిర్ పాల్గొన్నాడు. ఈ పార్టీలో ఆమిర్ మాట్లాడుతూ.. ఎంత బిజినెస్ చేయగలదు అనే ఆలోచనతో తాను సినిమాలను అంగీకరించనని, తన హృదయానికి దగ్గరగా ఉన్న కథలనే ఎంచుకుంటానని చెప్పాడు. తారే జమీన్ పర్, ఇడియట్స్, రంగ్ దే బసంతి, సర్ఫరోష్ సినిమాల్లో నటించినపుడు తానెప్పుడూ ఇవి భారీ బిజినెస్ చేస్తాయని ఆలోచించలేదని అన్నాడు. ఇందుకు దంగల్ ఉదాహరణ అని చెప్పాడు. ఈ సినిమాలో వయసు మీరిన, ఎక్కువ బరువున్న రెజ్లర్ పాత్రలో నటించానని, బ్లాక్ బస్టర్ కావడానికి రోమాంటిక్ సాంగ్స్ లేవని, అలాగే ప్రత్యేక ఫార్ములా అంటూ లేదని, ఇలాంటప్పుడు భారీ హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదని అన్నాడు.
నితేష్ తివారీ దర్శకత్వం వహించిన దంగల్ విదేశీ మార్కెట్లో 200కు పైగా కోట్ల రూపాయలు, దేశంలో దాదాపు 400 కోట్ల రూపాయలకు దగ్గరగా వసూలు చేసింది. హరియాణ కుస్తీవీరుడు మహావీర్ సింగ్ ఫోగట్, ఆయన కూతుళ్లను ఛాంపియన్లుగా మలచడాన్ని కథాంశంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు.