నోటీసు బోర్డుల్లో టీచర్ల ఫొటోలు
డూప్లికేట్ టీచర్లను నివారించేందుకు విద్యా శాఖ చర్యలు
కేంద్రం ఆదేశాల మేరకు ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో రెగ్యులర్ టీచర్‌కు బదులు మరొకరిని పెట్టి బోధిస్తున్న పద్ధతికి చెక్ పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అన్ని పాఠశాలల్లో ఆయా పాఠశాలలకు కేటాయించిన టీచర్ల ఫొటోలను నోటీసు బోర్డుల్లో పెట్టాలని మండల విద్యాధికారులను, ఎంఈవోలను ఆదేశించింది. తద్వారా ఆ పాఠశాలకు చెందిన రెగ్యులర్ టీచర్ ఎవరు? బడికి వస్తున్నది ఎవరన్నది గ్రామ ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు.
తద్వారా డూప్లికేట్ టీచర్లను నివారించవచ్చని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఫొటోలను వచ్చే 15 రోజుల్లోగా నోటీసు బోర్డులో పెట్టాలని స్పష్టం చేసింది. ఇందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించిందని, దీనిని కచ్చితంగా అమలు చేయాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా డెరైక్టరేట్ ప్రొసీడింగ్స్ (ఆర్సీ నంబరు 1497) జారీ చేసింది.
21 నుంచి సెర్చ్ కమిటీల భేటీలు: రాష్ట్రం లోని యూనివర్సిటీలకు వైస్ చాన్స్‌లర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఈ నెల 21 నుంచి వీసీల ఎంపికకు నియమించిన సెర్చ్ కమిటీలు భేటీ కానున్నాయి. వరుసగా ఒక్కో రోజు ఒక్కో యూనివర్సిటీకి సంబంధించిన సెర్చ్ కమిటీ సమావేశం కానుంది. ఆ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ముగ్గురి పేర్లను ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నాయి. ఆ ముగ్గురిలో ఒక్కరిని ప్రభుత్వం వీసీలుగా నియమించనుంది. ఈ ప్రక్రియ ఈ నెల 21న ప్రారంభించడం సాధ్యం కాకపోతే 22వ తేదీ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది.