notificaton
-
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్
– అదే రోజు నుంచి నామినేషన్లు కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి లోకల్ అథారిటీ నియోజకవర్గం ఎన్నికలకు మంగళవారం జాయింట్ కలెక్టర్, రిటర్నింగ్ అధికారి సి.హరికిరణ్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అదే రోజు నుంచి నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 28వ తేదీ వరకు నామినేషన్లు వేయవచ్చు. మార్చి1న నామినేషన్లను పరిశీలిస్తారు. మార్చి 3వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జాయింట్ కలెక్టర్ చాంబరులోనే నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. నామినేషన్లు సమర్పించేవారు విధిగా ఆస్తులు, కేసులపై అపడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఫారం– 26 ద్వారా అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలు.. నామినేషన్ల దాఖలుకు రూ.5వేలు, ఇతరులు రూ.10వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఒక అభ్యర్థి డిపాజిట్‌పై నాలుగు సెట్ల నామినేషన్లు ఇవ్వవచ్చునని అసిస్టెంటు రిటర్నింగ్ అధికారి, డీఆర్ఓ గంగాధర్‌గౌడు తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. అయితే లోకల్ అథారిటీ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న పది మంది ప్రతిపాదించాల్సి ఉంది. నామినేషన్ల దాఖలుకు రిటర్నింగ్ అధికారి చాంబరులోకి అభ్యర్థితో సహా అయిదుగురిని మాత్రమే అనుమతిస్తారు. -
ఎంటెక్ స్పాన్సర్డ్ సీట్లకు దరఖాస్తు
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలోని ఎంటెక్ స్పాన్సర్డ్ విభాగంలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య ఓ.అనీల్‌కుమార్ తెలిపారు. దరఖాస్తువిధానం, ఫీజు వివరాలు,అర్హత, సీట్ల సంఖ్య తదితర వివరాలను ఏయూ వెబ్సైట్ నుంచి పొందవచ్చును. ఆగష్టు 4వ తేదీలోగా పూర్తిచేసిన దరఖాస్తులను అందజేయాలి. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు తమ విద్యార్హతలు, అనుభవాలను తెలియజేసే ధ్రువపత్రాలను తీసుకురావాలి. కౌన్సెలింగ్ ఫీజుగా రూ 1000, ఎస్సీ,ఎస్టీలు రూ 500 చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశం పొందినవారు వెంటనే సంబంధిత ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఆగష్టు 7వ తేదీన ఉదయం 9 గంటలకు కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, జియో ఇంజనీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్, నానో టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులకు మద్యాహ్నం 2 గంటలకు కంప్యూటర్‌సైన్స్, సిస్టమ్స్ ఇంజినీరింగ్, ఈసిఈ, ఇనుస్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, మెటలర్జీ కోర్సులకు ప్రవేశాలు జరుపుతారు. ప్రవేశాలు ఏయూ ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో మాత్రమే జరుగుతాయి. -
విద్యుత్ సబ్ ఇంజినీర్ పోస్టుల నోటిఫికేషన్
హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర ప్రారంభమైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) 153 సబ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి శనివారం ప్రకటన జారీ చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. త్వరలో tssouthernpower.comవెబ్సైట్లో నోటిఫికేషన్‌ను ఉంచనున్నారు. ఇదిలా ఉండగా.. త్వరలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) నుంచి 314, జెన్కో నుంచి 92, ట్రాన్స్‌కో నుంచి 174 సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ కానున్నాయి. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో 733 సబ్ ఇంజినీర్ పోస్టులతో పాటు 1948 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి గత జూలైలోనే ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే ఏఈ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. త్వరలో తుది జాబితాలను ప్రకటించేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.