పుజారాకు ఎన్ని కష్టాలో..!
న్యూఢిల్లీ: ఊరందరిదీ ఓదారయితే.. ఉలిపికట్టది మరోదారి అన్నట్లుగా తయారయింది భారత స్టార్ క్రికెటర్ చతేశ్వర్ పుజారా పరిస్థితి. టెస్టు క్రికెట్ లో అత్యుత్తమ ఆటగాళ్లలో పుజారా ఒకడు. అయితే భారత క్రికెటర్లు, రంజీ ప్లేయర్లతో పాటు విదేశీ క్రికెటర్లు సైతం హాయిగా కోట్లు గడిస్తూ ఐపీఎల్ లో ఆడుతుంటే.. పుజారా మాత్రం ఇంగ్లండ్ లోని కౌంటీ క్రికెట్ ఆడేందుకు విదేశానికి వెళ్లాల్సి వస్తోంది. క్రికెటర్ వన్డేలు, ట్వంటీ20లు లాంటి పొట్టి ఫార్మాట్లో రాణించినా.. టెస్టు ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్య వహించాలన్నది ప్రతి ఒక్క ఆటగాడి కల. ఆస్ట్రేలియా జట్టులో వందల కొద్ది వన్డేలు, ట్వంటీ20లు ఆడినా.. టెస్టుల్లో జాతీయ జట్టులో అవకాశం ఇవ్వలేదని కన్నీటి పర్యంతమైన క్రికెటర్లు ఉన్నారు. కానీ పుజారా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.
గ్లౌస్టర్‌షైర్, గ్లామోర్గాన్, డెర్బీషైర్ జట్లతో జరిగే మ్యాచ్‌ల్లో నాటింగ్‌హామ్ తరఫున పుజారా ఆడతాడు. పుజారా రూపంలో మాకు వరల్డ్ క్లాస్ క్రికెటర్ దొరికాడు అని వాళ్లు సంబరపడుతున్నారు. ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ స్థానాన్ని పుజారా భర్తీ చేయబోతున్నాడు. బౌలర్ లోటు ఉన్నప్పటికీ, ఆ స్థానంలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ దొరకడం మా జట్టుకు మేలు చేసే అంశమని నాటింగ్ హామ్ జట్టు డైరెక్టర్ మైక్ న్యూయెల్ చెప్పాడు. ఈనెల రెండో వారం పుజారా జట్టుతో కలిసే అవకాశం ఉంది. గతంలో డెర్బీషైర్, యార్క్‌షైర్ తరఫున కౌంటీల్లో పాల్గొన్నాడు.
పొట్టి ఫార్మాట్ (వన్డేలు, ట్వంటీ20లు) లో అతడు రాణించలేడన్న ముద్రవేస్తున్నారు. అలాంటి ప్రచారం జరగడంతోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఏ ఫ్రాంచైజీ అతడిని కొనుగోలు చేయలేదు. దీనిపై రవిశాస్త్రి లాంటి సీనియర్ బహిరంగంగానే విమర్శలు చేశాడు. పుజారా లాంటి ఆటగాడిని కనీస ధర 2 కోట్ల కంటే ఎక్కువ పెట్టినా తీసుకోవాలని, అతడి టెక్నిక్ అంత కచ్చితంగా ఉంటుందంటూ మద్ధతు తెలిపాడు. మొదట్లో ఎవరూ కొనుగోలు చేయని భారత ఆటగాళ్లు ఇషాంత శర్మను పంజాబ్ జట్టు, ఇర్ఫాన్ పఠాన్ ను గుజరాత్ లయన్స్ తీసుకున్న విషయం తెలిసిందే.