కౌంటీ క్రికెట్‌లో పుజారా
లండన్: ఐపీఎల్‌లో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోవడంతో ఖాళీగా ఉన్న భారత టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకుముందు డెర్బీషైర్, యార్క్‌షైర్ జట్ల తరఫున ఆడిన పుజారా... తాజాగా నాటింగ్‌హామ్‌షైర్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు డైరెక్టర్ మైక్ న్యూయెల్ గురువారం ధ్రువీకరించారు. ‘గ్లౌస్టర్‌షైర్, గ్లామోర్గాన్, డెర్బీషైర్ జట్లతో జరిగే మ్యాచ్‌ల్లో పుజారా నాటింగ్‌హామ్ తరఫున ఆడతాడు.
పుజారా రూపంలో మాకు వరల్డ్ క్లాస్ క్రికెటర్ దొరికాడు’ అని న్యూయెల్ అన్నారు. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ స్థానాన్ని పుజారా భర్తీ చేయనున్నాడు. ‘మాకు బౌలర్ లోటు ఉన్నప్పటికీ, ఆ స్థానంలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ దొరకడం మా జట్టుకు మేలు చేసే అంశం’ అని న్యూయెల్ అన్నారు. మరోవైపు కౌంటీ క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు పుజారా స్పష్టం చేశాడు.