Chhattesh Pujara
-
కౌంటీలకు భారత క్రికెటర్లు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన ఏడుగురు టెస్టు క్రికెటర్లు ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడనున్నారు. చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, పృథ్వీ షా, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మలు విండీస్‌తో జరగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సిరీస్‌కు ముందు కౌంటీ క్రికెట్ ఆడతారని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. వీరిలో పుజారాకు ఇప్పటికే యార్క్‌షైర్‌తో మూడేళ్ల ఒప్పందం ఉంది. దీంతో అతను ఆ జట్టుతో కొనసాగుతాడు. త్వరలో బోర్డు పరిపాలక కమిటీ (సీఓఏ) నుంచి ఆమోదం రాగానే రహానే హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలున్నాయి. ప్రపంచకప్ ముగిశాక జూలై, ఆగస్టులో టెస్టు చాంపియన్‌షిప్ సిరీస్ జరుగుతుంది. అందుకోసం భారత ఆటగాళ్లకు విదేశీ గడ్డపై మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించాలని బోర్డు భావించింది. దీంతో లెస్టర్‌షైర్, ఎస్సెక్స్, నాటింగ్‌హమ్‌షైర్‌లతో బీసీసీఐ సంప్రదింపులు జరిపింది. మూడు, నాలుగు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిస్తే టెస్టు క్రికెటర్లకు మేలు జరుగుతుందని బోర్డు భావించిందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. గతేడాది ఇంగ్లండ్‌లో భారత పర్యటనకు ముందే అక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ సర్రేతో కౌంటీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ గాయం కారణంగా కోహ్లి కౌంటీలు ఆడలేకపోయాడు. -
విదర్భ... విజయం ముంగిట
సౌరాష్ట్రకు రంజీ ఫైనల్ మరో‘సారీ’ చెప్పేసింది. పరాజయానికి బాట వేసింది. విదర్భ వరుసగా విజయగర్వానికి సిద్ధమైంది. కీలకమైన పుజారాను డకౌట్ చేయడంతోనే మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చుకున్న విదర్భ... ప్రత్యర్థి 60 పరుగులైనా చేయకముందే సగం వికెట్లను పడగొట్టింది. నాగ్‌పూర్: డిఫెండింగ్ చాంపియన్ విదర్భ రంజీ టైటిల్‌ను నిలబెట్టుకునేందుకు సై అంటోంది. భారత స్టార్ చతేశ్వర్ పుజారా అందుబాటులో ఉన్న సౌరాష్ట్ర జట్టు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక విలవిల్లాడుతోంది. విదర్భ చాంపియన్‌షిప్‌కు ఐదు వికెట్ల దూరంలో ఉంటే... లోయర్ ఆర్డర్, టెయిలెండేర్లే ఉన్న సౌరాష్ట్ర ఇంకా 148 పరుగులు చేయాల్సివుంది. విదర్భను ఆదిత్య సర్వతే తన ఆల్‌రౌండ్ షోతో నిలబెట్టాడు. నాలుగో రోజు ఆటలో బ్యాటింగ్‌లో విఫలమైన విదర్భ బౌలింగ్‌లో జూలు విదిల్చింది. మొత్తానికి బుధవారం ఆటను ఇరు జట్ల బౌలర్లు శాసించారు. ముందుగా 55/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 92.5 ఓవర్లలో 200 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదిత్య సర్వతే (49; 5 ఫోర్లు) ఒక్కడే ప్రత్యర్థి బౌలింగ్‌కు ఎదురు నిలిచాడు. సౌరాష్ట్ర బౌలర్ ధర్మేంద్రసింగ్ జడేజా (6/96) స్పిన్ ఉచ్చులో 73 పరుగులకే 5 వికెట్లను కోల్పోయిన విదర్భను టెయిలెండర్ ఆదిత్య 200 పరుగుల దాకా లాక్కొచ్చాడు. మోహిత్ కాలే 38, గణేశ్ సతీశ్ 35 పరుగులు చేశారు. కమలేశ్ మక్వానాకు 2 వికెట్లు దక్కాయి. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌరాష్ట్రను సర్వతే (3/13)స్పిన్‌తో కొట్టాడు. ఓపెనర్లు హర్విక్ దేశాయ్ (8), స్నెల్ పటేల్ (12)లతో పాటు పుజారా (0)ను ఖాతా తెరువకుండానే సాగనంపాడు. క్వార్టర్స్, సెమీస్‌లో జట్టును నడిపించిన పుజారా ఫైనల్లో మాత్రం చేతులెత్తేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఒక పరుగే చేశాడు. అర్పిత్ వాసవద (5)ను ఉమేశ్, షెల్డన్ జాక్సన్ (7)ను అక్షయ్ వఖారే పెవిలియన్ చేర్చడంతో సౌరాష్ట్ర 55 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి విశ్వరాజ్ జడేజా (23 బ్యాటింగ్, 3 ఫోర్లు), కమలేశ్ మక్వానా (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. -
తొలి టైటిల్ వేటలో సౌరాష్ట్ర
నాగ్‌పూర్: భారత స్టార్లు చతేశ్వర్ పుజారా, ఉమేశ్ యాదవ్‌ల మధ్య ఆసక్తికర పోరుకు రంజీ ఫైనల్ వేదిక కానుంది. నేటి నుంచి సౌరాష్ట్ర, డిఫెండింగ్ చాంపియన్ విదర్భ జట్ల మధ్య టైటిల్ పోరు జరుగనుంది. విదర్భ జట్టు వసీమ్ జాఫర్ అండతో వరుసగా రెండో టైటిల్ సాధించాలని భావిస్తుండగా... పుజారా అందుబాటులో ఉన్న సౌరాష్ట్ర ఈ సారైన విజేతగా నిలవాలని ఆశిస్తోంది. గతంలో ఈ జట్టు 2012–13, 2015–16 సీజన్లలో ఫైనల్ చేరినా... ఈ రెండు సార్లు ముంబై ధాటికి రన్నరప్‌గా సంతృప్తి పడింది. ఈ సారి ముంబై ‘ఫోబియా’ లేదు. దీంతో ముచ్చటగా మూడో ప్రయత్నంలోనైనా రంజీ కలను నెరవేర్చుకోవాలనే పట్టుదలతో సౌరాష్ట్ర ఉంది. ఈ జట్టు ఆశలన్నీ పుజారాపైనే పెట్టుకుంది. ఆస్ట్రేలియా పర్యటన మొదలు ఇప్పటివరకు అతని జోరు అద్భుతంగా కొనసాగుతోంది. కర్ణాటకతో జరిగిన సెమీస్‌లో క్లిష్ట పరిస్థితిలో బ్యాటింగ్‌కు దిగిన పుజారా విలువైన శతకంతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ జట్టుకు 9వ నంబర్ ఆటగాడి వరకు బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. మరోవైపు వెటరన్ వసీం జాఫర్ ఫామ్‌తో విదర్భ పటిష్టంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో నిలకడకు మారుపేరైన జాఫర్ ఇప్పటికే 1003 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీ సహా నాలుగు శతకాలున్నాయి. జట్టుకు అతనే బలం. అతను క్రీజులో నిలబడితే ప్రత్యర్థులకు కష్టాలు తప్పవు. ఈ జట్టులోనూ టెయిలెండర్లు సైతం పరుగులు జతచేయగలరు. గత 10 మ్యాచ్‌ల్లో తుది జట్టులో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ 30 పైచిలుకు సగటును నమోదు చేశారు. జాఫర్‌తో పాటు కెప్టెన్ ఫైజ్ ఫజల్ (786 పరుగులు), యువ బ్యాట్స్‌మన్ అక్షయ్ వాడ్కర్ (680) చక్కని ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లోనే 21 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో రెండు దీటైన జట్ల మధ్య హోరాహోరీ సమరం జరిగే అవకాశముంది. -
బౌలర్లూ.. పంచ్ కొట్టండి
‘బౌలర్లు బాధ్యత సమర్థంగా నెరవేర్చారు... బ్యాట్స్‌మెనే చేతులెత్తేశారు...’ ఈ ఏడాది విదేశాల్లో టీమిండియా ఓటమి పాలైన ప్రతి సందర్భంలోనూ వినిపించిన మాట ఇది. ఇప్పుడు మాత్రం సీన్ తిరగబడింది. కోహ్లి బృందం తిరుగులేని బ్యాటింగ్‌తో... బౌలర్లకు పెద్ద పని కల్పించింది. ఇకవారు బంతితో ‘నాకౌట్ పంచ్’ ఇస్తే... బాక్సింగ్ డే టెస్టు మన వశమవుతుంది. మరో మూడు రోజుల ఆట మిగిలున్నప్పటికీ శుక్రవారం మ్యాచ్ సాగే తీరు ఫలితాన్ని చూచాయగా చెప్పనుంది. మెల్బోర్న్: బ్యాట్స్‌మెన్ బాధ్యత నెరవేర్చడంతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకొంది. బౌలర్లు ప్రత్యర్థి పతనాన్ని శాసిస్తే విజయం... లేదంటే డ్రా... ఈ రెండూ ఇప్పుడు కోహ్లి సేన చేతుల్లోనే ఉన్నాయి. అనూహ్యమైతే తప్ప ఆస్ట్రేలియా చేతిలో మన జట్టు ఓటమికి ఆస్కారం లేనట్లే. దీనికిముందు ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారా (319 బంతుల్లో 106; 10 ఫోర్లు) సెంచరీకి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి (204 బంతుల్లో 82; 9 ఫోర్లు), రోహిత్ శర్మ (114 బంతుల్లో 63 నాటౌట్; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో మెరవడంతో గురువారం భారత్ 443/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 215/2తో రెండో రోజు ఉదయం ఆట కొనసాగించిన జట్టును పుజారా, కోహ్లికి సురక్షిత స్థితికి చేర్చారు. రోహిత్, రహానే (76 బంతుల్లో 34; 2 ఫోర్లు), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (76 బంతుల్లో 39; 3 ఫోర్లు) దానిని మరింత మెరుగుపర్చారు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ (3/72)కు మూడు వికెట్లు దక్కాయి. స్టార్క్ (2/87) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 6 ఓవర్ల పాటు సాగిన తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు వికెట్ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్ (3 బ్యాటింగ్), హారిస్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోరుకు ఆసీస్ మరో 435 పరుగులు వెనుకబడి ఉంది. చతేశ్వర్ శతకానికి... తలా కొంత తొలి రోజు సరిగ్గా మూడో సెషన్లో జత కలిసిన పుజారా–కోహ్లి జోడీ గురువారం లంచ్ వరకు వికెట్ ఇవ్వకుండా ఆడింది. కమిన్స్ వేసిన ప్రారంభ ఓవర్ చివరి బంతికి మూడు పరుగులు తీసిన కోహ్లి అర్ధ శతకం (110 బంతుల్లో) అందుకున్నాడు. కమిన్స్ కట్టుదిట్టంగానే కనిపించినా, మరో పేసర్ స్టార్క్ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. హాజల్‌వుడ్, లయన్‌ను బరిలో దించినా ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో లయన్ బౌలింగ్‌లో మిడాఫ్ దిశగా బౌండరీ కొట్టిన పుజారా సెంచరీ (280 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. కెరీర్లో అతడికిది 17వది కాగా... ఈ సిరీస్‌లో రెండోది కావడం విశేషం. 277/2తో భారత్ లంచ్‌కు వెళ్లింది. తొలి సెషన్లో 62 పరుగులే రావడం, జట్టు స్కోరు మోస్తరుగానే ఉండటంతో విరామం తర్వాత కోహ్లి జోరు పెంచే యత్నం చేశాడు. మిడాన్ దిశగా చక్కటి బౌండరీతో స్టార్క్‌పై ఎదురుదాడికి దిగాడు. అయితే, ఆ వెంటనే వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా పంపబోయి బౌండరీ లైన్ వద్ద ఫించ్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో మూడో వికెట్‌కు 170 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. మూడు ఓవర్ల వ్యవధిలోనే పుజారా ఇన్నింగ్స్ ముగిసింది. కమిన్స్ వేసిన బంతి తక్కువ ఎత్తులో వచ్చి పుజారా వికెట్లను పడగొట్టింది. ఇక్కడి నుంచి మరో వికెట్ పడకుండా టీ బ్రేక్ వరకు రహానే, రోహిత్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. రహానే ధాటిగా ఆడాడు. విరామం అనంతరం వీరిద్దరూ లయన్ బౌలింగ్‌లో వరుస బంతుల్లో లైఫ్‌లు పొందారు. రోహిత్ గాడిన పడిన దశలో రహానే లయన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. కొత్త బంతితో ఫించ్ బౌలింగ్‌కు రాగా రోహిత్ సింగిల్‌తో అర్ధ శతకం (97 బంతుల్లో) అందుకున్నాడు. రోహిత్, రిషభ్ పంత్ దూకుడు చూపడంతో 20 ఓవర్లలో 76 పరుగులు సమకూరాయి. జట్టు స్కోరు కూడా 400 దాటింది. భారీ షాట్ కొట్టే ఊపులో పంత్ ఔటవ్వడం, జడేజా (4)ను హాజల్‌వుడ్ పెవిలియన్ చేర్చడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఓపెనర్ల కంగారు... ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 6 ఓవర్లపాటే సాగగా... వాటిలోనే ఓపెనర్లు ఫించ్, హారిస్ ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కొన్నారు. భారత పేసర్లు ఇషాంత్, బుమ్రా తొలి ఓవర్ నుంచే వారిని ఒత్తిడిలోకి నెట్టారు. బుమ్రా వేసిన చివరి రెండు ఓవర్లలో అయితే ఫించ్, హారిస్ బంతి బంతికి గండమే అన్నట్లు కనిపించారు. అప్పటికీ, రోజు చివరి బంతి ఫించ్ బ్యాట్ అంచును తాకి మూడో స్లిప్‌లో ఉన్న కోహ్లి ముందుపడింది. పిచ్ ఏం చేస్తుందో? ఆస్ట్రేలియా... భారత తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకుంటే మ్యాచ్‌కు ‘డ్రా’ ఫలితమే మిగులు తుంది. దీనిని నివారించాలంటే శుక్రవారం భారత బౌలర్లు కంగారూ బ్యాట్స్‌మెన్ పని పట్టాలి. రెండో రోజు బుమ్రా బౌలింగ్ చూస్తే ఇది నెరవేరేలానే కనిపిస్తోంది. ఇషాంత్, షమీ మెరిస్తే, జడేజా కూడా ఓ చేయేస్తే తిరుగుండదు. అయితే, పిచ్ ఎలా స్పందిస్తుందన్నదే అంతుబట్టకుండా ఉంది. గురువారం కొన్ని బంతులు తక్కువ ఎత్తులో వచ్చి పరీక్ష పెట్టాయి. పుజారా, రహానే అలాంటి బంతులకే ఔటయ్యారు. ఇవికాక ఆసీస్ బౌలర్లు పడగొట్టిన వికెట్లలో మూడు షార్ట్ బంతులకు వచ్చినవే. దీన్నిబట్టి పిచ్ అస్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో రాణించిన ఆసీస్ స్పిన్నర్ లయన్ మెల్బోర్న్లో తేలిపోయాడు. అయితే, ఎండతో పాటు సహజంగా ఏర్పడిన పగుళ్లను సద్వినియోగం చేసుకుంటే జడేజా వికెట్లు పడగొట్టే వీలుంటుంది. కోహ్లి రికార్డు... విదేశాల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్ (2002లో 1137 పరుగులు) పేరిట ఉన్న రికార్డును విరాట్ కోహ్లి బద్దలు కొట్టాడు. ఈ ఏడాది విదేశీ గడ్డపై కోహ్లి మొత్తం 1138 పరుగులు చేశాడు. మెల్బోర్న్ వేదికగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. 2014లో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 169, రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు సాధించాడు. స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: హనుమ విహారి (సి) ఫించ్ (బి) కమిన్స్ 8; మయాంక్ (సి) పైన్ (బి) కమిన్స్ 76; పుజారా (సి) కమిన్స్ 106; విరాట్ కోహ్లి (సి) ఫించ్ (బి) స్టార్క్ 82; అజింక్య రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్ 34; రోహిత్ శర్మ (నాటౌట్) 63; రిషభ్ పంత్ (సి) ఖాజా (బి) స్టార్క్ 39; రవీంద్ర జడేజా (సి) పైన్ (బి) హాజల్‌వుడ్ 4; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (169.4 ఓవర్లలో 7 వికెట్లకు) 443 డిక్లేర్డ్. వికెట్ల పతనం: 1–40; 2–123, 3–293, 4–299, 5–361, 6–437, 7–443. బౌలింగ్: స్టార్క్ 28–7– 87–2; హాజల్‌వుడ్ 31.4–10–86–1; లయన్ 48–7–110–1; కమిన్స్ 34–10–72–3; మిచెల్ మార్‡్ష 26–4–51–0; ఫించ్ 2–0–8–0. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: హారిస్ (బ్యాటింగ్) 5; ఫించ్ (బ్యాటింగ్) 3; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 8. బౌలింగ్: ఇషాంత్ శర్మ 2–1–2–0; బుమ్రా 3–1–6–0; రవీంద్ర జడేజా 1–1–00. -
కౌంటీ క్రికెట్లో పుజారా
లండన్: ఐపీఎల్లో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయకపోవడంతో ఖాళీగా ఉన్న భారత టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లోని కౌంటీ క్రికెట్లో ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకుముందు డెర్బీషైర్, యార్క్‌షైర్ జట్ల తరఫున ఆడిన పుజారా... తాజాగా నాటింగ్‌హామ్‌షైర్ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఆ జట్టు డైరెక్టర్ మైక్ న్యూయెల్ గురువారం ధ్రువీకరించారు. ‘గ్లౌస్టర్‌షైర్, గ్లామోర్గాన్, డెర్బీషైర్ జట్లతో జరిగే మ్యాచ్‌ల్లో పుజారా నాటింగ్‌హామ్ తరఫున ఆడతాడు. పుజారా రూపంలో మాకు వరల్డ్ క్లాస్ క్రికెటర్ దొరికాడు’ అని న్యూయెల్ అన్నారు. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ స్థానాన్ని పుజారా భర్తీ చేయనున్నాడు. ‘మాకు బౌలర్ లోటు ఉన్నప్పటికీ, ఆ స్థానంలో నాణ్యమైన బ్యాట్స్‌మెన్ దొరకడం మా జట్టుకు మేలు చేసే అంశం’ అని న్యూయెల్ అన్నారు. మరోవైపు కౌంటీ క్రికెట్ ఆడటానికి సిద్ధంగా ఉన్నట్లు పుజారా స్పష్టం చేశాడు.