బౌలర్లూ.. పంచ్‌ కొట్టండి | The team made a huge score and turned the match on | Sakshi
Sakshi News home page

బౌలర్లూ.. పంచ్‌ కొట్టండి

Published Fri, Dec 28 2018 2:38 AM | Last Updated on Fri, Dec 28 2018 8:30 AM

The team made a huge score and turned the match on - Sakshi

‘బౌలర్లు బాధ్యత సమర్థంగా నెరవేర్చారు... బ్యాట్స్‌మెనే చేతులెత్తేశారు...’ ఈ ఏడాది విదేశాల్లో టీమిండియా ఓటమి పాలైన ప్రతి సందర్భంలోనూ వినిపించిన మాట ఇది. ఇప్పుడు మాత్రం సీన్‌ తిరగబడింది. కోహ్లి బృందం తిరుగులేని బ్యాటింగ్‌తో... బౌలర్లకు పెద్ద పని కల్పించింది. ఇకవారు బంతితో ‘నాకౌట్‌ పంచ్‌’ ఇస్తే... బాక్సింగ్‌ డే టెస్టు మన వశమవుతుంది. మరో మూడు రోజుల ఆట మిగిలున్నప్పటికీ శుక్రవారం మ్యాచ్‌ సాగే తీరు ఫలితాన్ని చూచాయగా చెప్పనుంది.   

మెల్‌బోర్న్‌: బ్యాట్స్‌మెన్‌ బాధ్యత నెరవేర్చడంతో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోరు సాధించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకొంది. బౌలర్లు ప్రత్యర్థి పతనాన్ని శాసిస్తే విజయం... లేదంటే డ్రా... ఈ రెండూ ఇప్పుడు కోహ్లి సేన చేతుల్లోనే ఉన్నాయి. అనూహ్యమైతే తప్ప ఆస్ట్రేలియా చేతిలో మన జట్టు ఓటమికి ఆస్కారం లేనట్లే. దీనికిముందు ‘నయా వాల్‌’ చతేశ్వర్‌ పుజారా (319 బంతుల్లో 106; 10 ఫోర్లు) సెంచరీకి తోడు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (204 బంతుల్లో 82; 9 ఫోర్లు), రోహిత్‌ శర్మ (114 బంతుల్లో 63 నాటౌట్‌; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలతో మెరవడంతో గురువారం భారత్‌ 443/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 215/2తో రెండో రోజు ఉదయం ఆట కొనసాగించిన జట్టును పుజారా, కోహ్లికి సురక్షిత స్థితికి చేర్చారు. రోహిత్, రహానే (76 బంతుల్లో 34; 2 ఫోర్లు), వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (76 బంతుల్లో 39; 3 ఫోర్లు) దానిని మరింత మెరుగుపర్చారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ (3/72)కు మూడు వికెట్లు దక్కాయి. స్టార్క్‌ (2/87) రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 6 ఓవర్ల పాటు సాగిన తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు వికెట్‌ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫించ్‌ (3 బ్యాటింగ్‌), హారిస్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. భారత్‌ స్కోరుకు ఆసీస్‌ మరో 435 పరుగులు వెనుకబడి ఉంది. 

చతేశ్వర్‌ శతకానికి... తలా కొంత 
తొలి రోజు సరిగ్గా మూడో సెషన్‌లో జత కలిసిన పుజారా–కోహ్లి జోడీ గురువారం లంచ్‌ వరకు వికెట్‌ ఇవ్వకుండా ఆడింది. కమిన్స్‌ వేసిన ప్రారంభ ఓవర్‌ చివరి బంతికి మూడు పరుగులు తీసిన కోహ్లి అర్ధ శతకం (110 బంతుల్లో) అందుకున్నాడు. కమిన్స్‌ కట్టుదిట్టంగానే కనిపించినా, మరో పేసర్‌ స్టార్క్‌ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. హాజల్‌వుడ్, లయన్‌ను బరిలో దించినా ఇబ్బంది పెట్టలేకపోయారు. ఈ క్రమంలో లయన్‌ బౌలింగ్‌లో మిడాఫ్‌ దిశగా బౌండరీ కొట్టిన పుజారా సెంచరీ (280 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో అతడికిది 17వది కాగా... ఈ సిరీస్‌లో రెండోది కావడం విశేషం. 277/2తో భారత్‌ లంచ్‌కు వెళ్లింది. తొలి సెషన్‌లో 62 పరుగులే రావడం, జట్టు స్కోరు మోస్తరుగానే ఉండటంతో విరామం తర్వాత కోహ్లి జోరు పెంచే యత్నం చేశాడు. మిడాన్‌ దిశగా చక్కటి బౌండరీతో స్టార్క్‌పై ఎదురుదాడికి దిగాడు. అయితే, ఆ వెంటనే వేసిన షార్ట్‌ లెంగ్త్‌ బంతిని థర్డ్‌మ్యాన్‌ దిశగా పంపబోయి బౌండరీ లైన్‌ వద్ద ఫించ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు.

దీంతో మూడో వికెట్‌కు 170 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. మూడు ఓవర్ల వ్యవధిలోనే పుజారా ఇన్నింగ్స్‌ ముగిసింది. కమిన్స్‌ వేసిన బంతి తక్కువ ఎత్తులో వచ్చి పుజారా వికెట్లను పడగొట్టింది. ఇక్కడి నుంచి మరో వికెట్‌ పడకుండా టీ బ్రేక్‌ వరకు రహానే, రోహిత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించారు. రహానే ధాటిగా ఆడాడు. విరామం అనంతరం వీరిద్దరూ లయన్‌ బౌలింగ్‌లో వరుస బంతుల్లో లైఫ్‌లు పొందారు. రోహిత్‌ గాడిన పడిన దశలో రహానే లయన్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. కొత్త బంతితో ఫించ్‌ బౌలింగ్‌కు రాగా రోహిత్‌ సింగిల్‌తో అర్ధ శతకం (97 బంతుల్లో) అందుకున్నాడు. రోహిత్, రిషభ్‌ పంత్‌ దూకుడు చూపడంతో 20 ఓవర్లలో 76 పరుగులు సమకూరాయి. జట్టు స్కోరు కూడా 400 దాటింది. భారీ షాట్‌ కొట్టే ఊపులో పంత్‌ ఔటవ్వడం, జడేజా (4)ను హాజల్‌వుడ్‌ పెవిలియన్‌ చేర్చడంతో కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.
 

ఓపెనర్ల కంగారు... 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 6 ఓవర్లపాటే సాగగా... వాటిలోనే ఓపెనర్లు ఫించ్, హారిస్‌ ఉత్కంఠభరిత  క్షణాలను ఎదుర్కొన్నారు. భారత పేసర్లు ఇషాంత్, బుమ్రా తొలి ఓవర్‌ నుంచే వారిని ఒత్తిడిలోకి నెట్టారు. బుమ్రా వేసిన చివరి రెండు ఓవర్లలో అయితే ఫించ్, హారిస్‌ బంతి బంతికి గండమే అన్నట్లు కనిపించారు. అప్పటికీ, రోజు చివరి బంతి ఫించ్‌ బ్యాట్‌ అంచును తాకి మూడో స్లిప్‌లో ఉన్న కోహ్లి  ముందుపడింది. 
 
పిచ్‌ ఏం చేస్తుందో? 
ఆస్ట్రేలియా... భారత తొలి ఇన్నింగ్స్‌ స్కోరును అందుకుంటే మ్యాచ్‌కు ‘డ్రా’ ఫలితమే మిగులు తుంది. దీనిని నివారించాలంటే శుక్రవారం భారత బౌలర్లు కంగారూ బ్యాట్స్‌మెన్‌ పని పట్టాలి. రెండో రోజు బుమ్రా బౌలింగ్‌ చూస్తే ఇది నెరవేరేలానే కనిపిస్తోంది. ఇషాంత్, షమీ మెరిస్తే, జడేజా కూడా ఓ చేయేస్తే తిరుగుండదు. అయితే, పిచ్‌ ఎలా స్పందిస్తుందన్నదే అంతుబట్టకుండా ఉంది. గురువారం కొన్ని బంతులు తక్కువ ఎత్తులో వచ్చి పరీక్ష పెట్టాయి. పుజారా, రహానే అలాంటి బంతులకే ఔటయ్యారు. ఇవికాక ఆసీస్‌ బౌలర్లు పడగొట్టిన వికెట్లలో మూడు షార్ట్‌ బంతులకు వచ్చినవే. దీన్నిబట్టి పిచ్‌ అస్థిరంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు మ్యాచ్‌ల్లో రాణించిన ఆసీస్‌ స్పిన్నర్‌ లయన్‌ మెల్‌బోర్న్‌లో తేలిపోయాడు. అయితే, ఎండతో పాటు సహజంగా  ఏర్పడిన పగుళ్లను సద్వినియోగం చేసుకుంటే జడేజా వికెట్లు పడగొట్టే వీలుంటుంది.

కోహ్లి రికార్డు... 
విదేశాల్లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ (2002లో 1137 పరుగులు) పేరిట ఉన్న రికార్డును విరాట్‌ కోహ్లి బద్దలు కొట్టాడు. ఈ ఏడాది విదేశీ గడ్డపై కోహ్లి మొత్తం 1138 పరుగులు చేశాడు.  మెల్‌బోర్న్‌ వేదికగా ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో వరుసగా మూడు ఇన్నింగ్స్‌లో 50 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి విదేశీ క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. 2014లో కోహ్లి తొలి ఇన్నింగ్స్‌లో 169, రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేశాడు. ప్రస్తుత మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులు సాధించాడు.


స్కోరు వివరాలు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: హనుమ విహారి (సి) ఫించ్‌ (బి) కమిన్స్‌ 8; మయాంక్‌ (సి) పైన్‌ (బి) కమిన్స్‌ 76; పుజారా (సి) కమిన్స్‌ 106; విరాట్‌ కోహ్లి (సి) ఫించ్‌ (బి) స్టార్క్‌ 82; అజింక్య రహానే (ఎల్బీడబ్ల్యూ) (బి) లయన్‌ 34; రోహిత్‌ శర్మ (నాటౌట్‌) 63; రిషభ్‌ పంత్‌ (సి) ఖాజా (బి) స్టార్క్‌ 39; రవీంద్ర జడేజా (సి) పైన్‌ (బి) హాజల్‌వుడ్‌ 4; ఎక్స్‌ట్రాలు 31; మొత్తం (169.4 ఓవర్లలో 7 వికెట్లకు) 443 డిక్లేర్డ్‌. 
వికెట్ల పతనం: 1–40; 2–123, 3–293, 4–299, 5–361, 6–437, 7–443. 
బౌలింగ్‌: స్టార్క్‌ 28–7– 87–2; హాజల్‌వుడ్‌ 31.4–10–86–1; లయన్‌ 48–7–110–1; కమిన్స్‌ 34–10–72–3; మిచెల్‌ మార్‌‡్ష 26–4–51–0; ఫించ్‌ 2–0–8–0. 
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: హారిస్‌ (బ్యాటింగ్‌) 5; ఫించ్‌ (బ్యాటింగ్‌) 3; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (6 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 8. బౌలింగ్‌: ఇషాంత్‌ శర్మ 2–1–2–0; బుమ్రా 3–1–6–0; రవీంద్ర జడేజా 1–1–00.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement