హైదరాబాద్కు ఎన్నారై పెట్టుబడులు నో!
సాక్షి, హైదరాబాద్: అనుకున్న వెంటనే పెట్టుబడులు పెట్టగలిగేది.. దీర్ఘకాలికంగా లాభాలు ఆర్జించేది స్థిరాస్తి రంగమే. కానీ, ఈ విషయంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాసింత దూరంలోనే ఉందంటోంది అసోచామ్ సర్వే. ఏడాది కాలంగా డాలర్ విలువ పెరగటం, ఎన్నారైలకు ప్రత్యేక రాయితీలూ కల్పిస్తున్నా.. హైదరాబాద్కు ఎన్నారై పెట్టుబడులు రావట్లేదని అసోచామ్ ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది. ఎన్నారై పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. హైదరాబాద్కు స్థానమే దక్కలేదు.
సర్వేలోని పలు అంశాలివే..
స్థిరాస్తి రంగంలో ఎన్నారై పెట్టుబడులు ఏ స్థాయిలో ఉంటున్నాయనే అంశంపై ఢిల్లీ, చండీఘడ్, ముంబై, కోల్కత్తా, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, పుణే, డెహ్రాడూన్, చెన్నై నగరాల్లో దాదాపు 850 స్థిరాస్తి సంస్థలతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది హై ఎండ్ ప్రాపర్టీలు, వాణిజ్య సముదాయాల్లోనే ఎన్నారై పెట్టుబడులు పెరుగుతున్నాయి.
గతేడాది బెంగళూరులోని మొత్తం స్థిరాస్తి పెట్టుబడుల్లో 18 శాతంగా ఉన్న ఎన్నారై పెట్టుబడులు ఈ ఏడాది 35 శాతానికి పెరిగాయని సర్వే చెబుతోంది. ఇందుకు కారణం.. బెంగళూరులో ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఎక్కువగా ఉండటం వల్లే. 2,200 ఐటీ కంపెనీలు, 664 ఎంఎన్సీలు, 183 బయోటెక్నాలజీ కంపెనీలు, 248 బీపీఓలు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నాయి.
ఆ తర్వాతి స్థానాల్లో అహ్మదాబాద్ (32 శాతం), పుణే (30.5 శాతం), చెన్నై (28 శాతం), గోవా (23 శాతం) నిలిచాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నగరాల్లో మాత్రం గతేడాదితో పోల్చుకుంటే ఈసారి 21 శాతం ఎన్నారై ఎక్వయిరీలు పెరిగాయే కానీ, పెట్టుబడులు మాత్రం ఆ స్థాయిలో రాలేదని సర్వే చెబుతోంది.
దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, నిబంధనలను సరళీకృతం చేయటం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కారణంగా దేశంలో స్థిరాస్తి పెట్టుబడులు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి యూఎస్, యూఏఈ, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడిన ఎన్నారైలు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, స్థిరాస్తి సంస్థలూ ప్రాపర్టీ షోలు నిర్వహించటం, విదేశాల్లో కార్యాలయాలను ప్రారంభించటం, ఎన్నారైలకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తుండటం వంటివి మరింతగా కలిసొస్తుందని అసోచామ్ సర్వే సారాంశం.