నూతన ఆవిష్కరణలతోనే దేశ పురోగతి
నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్
హైదరాబాద్: ఉత్పత్తి, నూతన ఆవిష్కరణలతోనే దేశం పురోగతి సాధిస్తుందని నీతి ఆయోగ్ సభ్యులు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ వీకే సారస్వత్ పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థి, యువత మరింతగా దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించారు. 19వ ఫౌండేషన్ డే సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం గచ్చిబౌలిలోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) డీడీఈ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సారస్వత్ మాట్లాడుతూ మనవారికి విదేశీ ఉత్పత్తులంటే ఇష్టమని, అది దేశానికి కష్టమని అన్నారు.
ఎగుమతులు పెంచి దిగుమతులు తగ్గించాలంటే ఉత్పత్తి రంగం పురోగతి సాధించాల్సిందేనన్నారు. పర్యాటక, సేవల రంగాల్లో ప్రపంచస్థాయిలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ అది సరిపోదని, ఉత్పత్తి ఆధారిత నూతన ఆవిష్కరణలు అవసరమన్నారు. ఆ దిశగా దేశాన్ని పయనించేలా చేయాల్సిన బాధ్యత విద్యార్థి, యువత, మేధావి వర్గాలపై ఉందన్నారు. సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అభివృద్ధి సాధిస్తేనే దేశం పురోగతి సాధిస్తుందని 65 ఏళ్ల క్రితమే అప్పటి ప్రధాని నెహ్రూ, మొదటి విద్యామంత్రి మౌలానా ఆజాద్ గుర్తించారని ఆయన గుర్తు చేశారు. విద్యారంగంలో కలామ్ అప్పట్లో కృషి చేస్తే, ఆ తర్వాత కాలంలో అబ్దుల్ కలామ్ మిసైల్ రంగంలో ఎంతో పురోగతి సాధించేందుకు ఆద్యుడుగా మారారన్నారు. ఆయన సాన్నిహిత్యంతో తాను ఎంతో నేర్చుకున్నానన్నారు.
2032 నాటికి 6,000 మెగావాట్ల అణువిద్యుత్ ఉత్పత్తే లక్ష్యం..
అణువిద్యుత్ రంగంలో దేశం ఎంతో పురోగతి సాధిస్తోందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే సారస్వత్ తెలిపారు. న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అత్యధికంగా దేశంలోనే ఏర్పాటు చేసుకోగలుగుతున్నామని అన్నారు. 2032 నాటికి దేశంలో 6,000 మెగావాట్ల న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగేలా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
ఆకట్టుకున్న క్షిపణి చిత్ర ప్రదర్శన
భారతదేశంలో క్షిపణి ప్రయోగ రంగంలో సాధించిన పురోగతిని వీడియో చిత్ర ప్రదర్శన ద్వారా డాక్టర్ సారస్వత్ వివ రించారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ మహ్మద్ అస్లామ్ పర్వేజ్, ప్రో వైస్ చాన్స్లర్ డాక్టర్ షకీల్ అహ్మద్, సీడబ్ల్యూఎస్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ అమీనా తహసీన్ మాట్లాడారు.
2050 నాటికి దేశ జనాభాలో సగం మంది పట్టణాల్లోనే..
భారతదేశంలో జనాభా పట్టణీకరణ వైపు సాగుతోందని, 2050 నాటికి దేశ జనాభాలో సగం మంది పట్టణ ప్రాంతాల్లోనే నివాసముండటం ఖాయంగా కనిపిస్తోందని నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ సారస్వత్ పేర్కొన్నారు. దేశం ఇంత అభివృద్ధి సాధిస్తున్నా ఇప్పటికీ 300 మిలియన్ ప్రజలు దారిద్రరేఖకు దిగువనే ఉన్నారన్నారు. వైద్య రంగంలో ఎంతో పురోగతి సాధిస్తున్నా ఇప్పటికీ ఎక్స్రే, ఎంఆర్ఐ, సీటీస్కాన్ యంత్రాలన్నీ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ఈ పరిస్థితులు మారాలన్నారు. సెక్యూరిటీ ఇన్నోవేషన్ రంగంలో చాలా పురోగతి సాధించాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు.