శాంతికాముకులకు... నోబెల్ ‘సలామ్’
సాక్షి నాలెడ్జ్ సెంటర్: మానవాళి మంచి కోరుతూ, మనిషి మనుగడకు భరోసాను అడుగుతూ, అణ్వస్త్రమనేది లేని రేపటి ప్రపంచాన్ని కాంక్షిస్తున్న లక్షలాది మంది శాంతి కాముకులకు దక్కిన గౌరవమే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి. అణ్వాయుధాల మూలంగా మానవాళికి పొంచి ఉన్న పెనుముప్పుపై ప్రపంచవ్యాప్తంగా నిరంతరం ప్రచారం చేస్తూ, వివిధ దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ... స్థాపించిన పదేళ్లకే నోబెల్ శాంతి బహుమతి సాధించింది ఐ కెన్. ఇది ఒక వ్యక్తి కృషికో, సంస్థకో లభించిన గుర్తింపు కాదు. మనుషులంతా బాగుండాలని కోరుకోవడమే కాకుండా ఆ దిశగా తమకు తోచిన రీతిలో ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ దక్కిన గౌరవం.
భారత్ నుంచి మూడు సంస్థల భాగస్వామ్యం
మందుపాతరలపై నిషేధం కోరుతూ వచ్చిన స్వచ్ఛంద ఉద్యమం మూలంగా 1997లో వాటిని నిషేధిస్తూ అంతర్జాతీయ ఒడంబడిక జరిగింది. దీని నుంచి స్ఫూర్తి పొందిన అణుయుద్ధ నివారణకు పనిచేసే అంతర్జాతీయ డాక్టర్ల సంఘం... అణ్వాయుధ నిర్మూలనను కోరుతూ ఉద్యమాన్ని నిర్మించాలని తీర్మానించింది. ఫలితంగా 2007 ఏప్రిల్ 30న ఆస్ట్రియాలోని వియన్నాలో జరిగిన సమావేశాలతో ఐకన్ పురుడు పోసుకుంది.. ఐ కెన్‌లో 101 దేశాల నుంచి 468 సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి.
స్వచ్ఛంద సంస్థల నుంచి అంతర్జాతీయ సంస్థల దాకా వీటిలో ఉన్నాయి. ఇండియన్ డాక్టర్స్ ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ పీస్, డిసార్మమెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్... భారత్ నుంచి ఐకన్లో భాగస్వాములుగా ఉన్న మూడు సంస్థలివి. అంతర్జాతీయ స్టీరింగ్ గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా ఐకన్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. బీట్రిస్ ఫిన్ 2014 జూలై నుంచి కార్యనిర్వాహక డైరెక్టర్‌గా ఉన్నారు. స్వచ్ఛంద సంస్థలు ఏవైనా ఐ కెన్‌లో భాగస్వాములు కావొచ్చు. ప్రవేశ, వార్షిక రుసుములు ఏవీ ఉండవు.
లక్ష్యం...
పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలిగించే రసాయన, జీవ ఆయుధాలు, మందుపాతరల వాడకాన్ని నిషేధిస్తూ స్పష్టమైన అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. కానీ మానవ మనుగడకే తీవ్ర ముప్పు అని నిరూపించే సాక్ష్యాలు ఉన్నా, హిరోషిమా, నాగసాకిలో జరిగిన అణు విధ్వంసాన్ని ప్రపంచం కళ్లారా చూసినా, అణ్వస్త్ర నిర్మూలన దిశగా పెద్దగా ముందడుగు పడలేదు. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం (ఎన్పీటీ) 1970లో కుదిరినా... అది సమూల నిర్మూలకు ఉద్దేశించింది కాదు. 1967 ముందు అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకున్న అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలను ఎన్పీటీ అణ్వస్త్ర దేశాలుగా గుర్తించింది. తర్వాత భారత్, పాకిస్తాన్, ఉత్తరకొరియాలు అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించి తాము అణ్యాయుధాలను అభివృద్ధి చేసుకున్నామని బాహటంగా ప్రకటించుకున్నాయి.
ఇజ్రాయెల్ ఇలా బాహటంగా చెప్పకున్నా... అణ్వాయుధాలను కలిగి ఉంది. పైన చెప్పిన ఎనిమిది దేశాల ఉమ్మడిగా దాదాపు 15,000 వేల అణ్వస్త్ర వార్హెడ్లను కలిగి ఉన్నాయని అమెరికా సైంటిస్టులను ఉటంకిస్తూ ఐ కెన్ చెబుతోంది. ఓ వంద అణు బాంబులు వేస్తే లక్షల కొద్దీ జనం మృత్యువాతపడటమే కాకుండా... రేడియేషన్ ప్రభావం, పర్యావరణ మార్పుల కారణంగా 100 కోట్ల మంది జనం కరువుబారిన పడతారని ఐకన్ చెబుతోంది. అలాంటి దాదాపు 15,000 అణుకుంపట్లతో మనం కలిసి జీవిస్తున్నామని గుర్తుచేస్తోంది. అణ్వస్త్రాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఐ కెన్ పనిచేస్తోంది. నోబెల్ విజేతలు డెస్మండ్ టుటు, దలైలామా, ఐరాస మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తదితరులు ఐకన్కు మద్దతు పలికారు.
ఫలించిన కృషి...
ఐ కెన్, రెడ్‌క్రాస్ లాంటి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న సంస్థలు దశాబ్దకాలంగా చేసిన కృషి ఈ ఏడాది ఫలించింది. 2017లో అణ్వస్త్ర నిరోధక ఒప్పందంపై చర్చలు ప్రారంభించాలని 2016 అక్టోబర్ 27న ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2017లో చర్చలు మొదలై జూలె ఏడో తేదీన ‘అణ్వాయుధ నిషేధ ఒప్పందం (టీపీఎన్‌డబ్ల్యూ)’ ఐరాస సాధారణ సభ ఆమోదం పొందింది. కనీసం 50 దేశాలు తమ చట్టసభల్లో దీనికి ఆమోదముద్ర వేసిన వెంటనే ఒప్పందం అమలులోకి వస్తుంది.
అణ్వస్త్రాలను అభివృద్ధి చేయడం, పరీక్షించడం, తయారుచేయడం, కలిగి ఉండటం, సాంకేతికతను బదలాయించడం, నిల్వచేయడాన్ని టీపీఎన్‌డబ్ల్యూ నిషేధిస్తుంది. అయితే అణ్వస్త్ర దేశాలైన అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, భారత్, పాకిస్తాన్, ఉత్తరకొరియాలు టీపీఎన్డబ్ల్యూపై ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ప్రధాన దేశాలు దూరంగా ఉన్నందువల్ల... రేప్పొద్దున్న ఈ అంతర్జాతీయ ఒప్పందం అమలులోకి వస్తే... అణ్వస్త్రదేశాలు ఎంతవరకు కట్టుబడి ఉంటాయనేది చెప్పలేం. మొత్తం మీద ఓ ప్రజా ఉద్య మాన్ని నిర్మించి, ఐరాసలో 122 దేశాలతో అనుకూల ఓటు వేయించిన ఐ కెన్ కృషికి ‘నోబెల్ బహుమతి’ రూపంలో తగిన గుర్తింపు లభించింది.
► ‘ఐ కెన్’కు నోబెల్ శాంతి పురస్కారం, అణ్వస్త్ర నిరాయుధీకరణ ఉద్యమానికి దక్కిన గుర్తింపు
ఓస్లో: అణ్వాయుధాలను నిర్మూలించేందుకు విశేష కృషిచేస్తున్న ‘ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్–ఐ కెన్’ (అణ్వాస్త్రాల నిర్మూలనకు అంతర్జాతీయ ఉద్యమం) అనే సంస్థను 1.1 మిలియన్ డాలర్ల విలువైన నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఐ కెన్ అనేది ఒక ఉద్యమ సంస్థ. అంతర్జాతీయంగా అణ్వస్త్ర నిరాయుధీకరణను కోరుకుంటున్న వివిధ దేశాల్లోని వందలాది సంస్థల సమాహారం. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేసే ఐ కెన్...అణ్వాయుధాల నివారణకు ప్రపంచ దేశాలు సహకరించుకోవడంలో చోదక శక్తిగా పనిచేస్తోందని నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్‌వుమన్ బెరిట్ రీస్–అండర్సన్ శుక్రవారం పేర్కొన్నారు.
నోబెల్ ప్రకటన అనంతరం ఐ కెన్ కార్యనిర్వాహక డైరెక్టర్ బీట్రిస్ ఫిన్ మాట్లాడుతూ ‘మా సంస్థకు లభించిన ఈ పురస్కారం అణ్వాయుధాలు కలిగిన, వాటిపై ఆధారపడే దేశాలకు ఓ సందేశం పంపుతుంది. అదేంటంటే ఆ దేశాల విధానం ఆమోదనీయం కాదు అని. భద్రత పేరుతో లక్షలాది మంది ప్రజల ప్రాణాలను అవి ప్రమాదంలో పెట్టలేవు’ అని పేర్కొన్నారు. నోబెల్ ప్రైజ్ లభించినట్లు అధికారిక ప్రకటనకంటే కొన్ని నిమిషాల ముందే తనకు ఫోన్‌కాల్ వచ్చిందనీ, అప్పుడు నమ్మలేదని ఫిన్ తెలిపారు. ఇటీవల ఉత్తర కొరియా వరుసగా అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలు జరుపుతుండటం, ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దుచేసుకుంటామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో నోబెల్ శాంతి బహుమతి ఐ కెన్‌కు లభించడం గమనార్హం.